గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్టోయ్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ను చంపేది తనేనని గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్యకు లారెన్స్ బిష్టోయ్ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుండగా 2018లో సల్మాన్‌ను రాజస్థాన్‌లో చంపేస్తానంటూ లారెన్స్ చేసిన ఓపెన్ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టూడే ఈ వీడియోను తాజాగా వెలికితీసింది.
దీంతో లారెన్స్ కామెంట్స్ బాలీవుడ్ మీడియాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా 2018లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రం చట్టం కేసులో లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అతడి సహాయకులకు ఢిల్లీ హైకోర్డు రిమాండ్ విధించింది. దీంతో బిష్ణోయ్ అతడి సహాయకులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు తరలిస్తుండగా కోర్డు వెలుపల మీడియాతో లారెన్స్ సల్మాన్ చంపేస్తానంటూ ఈ కామెంట్స్ చేశాడు.
‘ప్రస్తుతం నేను ఏం చేయలేదు. ఒకసారి నేను యాక్షన్ తీసుకుంటే ఏమైతుందో తెలుస్తుంది. నేను ఎలాంటి నేరం చేయకపోయిన నన్ను నిందితుడిని చేశారు. రాజస్థాన్‌లో సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాను. అప్పుడు నేను ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరేం చేస్తారో చూస్తా’ అంటూ బహింరంగంగా సవాలు విసిరాడు. కాగా జోధ్‌పూర్ సమీపంలోని అడివి కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. అయితే లారెన్స్ బిష్ణోయ్ కమ్మునిటీలో కృష్ణ జింకను దైవంగా భావిస్తారట. ఈ నేపథ్యంలో బిష్ణోయ్, సల్మాన్‌ను టార్గెట్ చేసినట్లు తెలిసింది.
ఈ వీడియోలో లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతడి సహాయకుడు, గ్యాంగ్‌స్టర్ సంపత్ నేహ్రా కూడా కనిపించాడు. అయితే బిష్ణోయ్ కామెంట్స్‌కు ముందు సంపత్ నేహ్రా సల్మాన్ ఇంట్లో రెక్కీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నేహ్రాను, అతడి గ్యాంగ్‌ను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేశారు. కాగా బిష్ణోయ్ సంబంధాలు ఇతర దేశాలకు కూడా వ్యాపించాయి. దీంతో 5 రాష్ట్రాల్లో 700 మంది షూటర్లు ఉన్న ఈ ముఠా ఇతర ముఠాలతో సత్ససంబంధాలను పెంచుకుంటుంది. నిత్యం పంజాబీ ఆర్టిస్టులపై దాడులకు పాల్పడుతూ పంజాబ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల పోలీసులకు తలనొప్పిగా మారింది ఈ ముఠాలు.