NRI-NRT

తానాలో నూతన సభ్యులకు ఓటు హక్కు గోవిందా! – TNI ప్రత్యేకం

తానాలో నూతన సభ్యులకు ఓటు హక్కు గోవిందా! - TNI ప్రత్యేకం

తానాలో పాలన గాడి తప్పింది. ప్రస్తుత పాలకవర్గం మూడు గ్రూపులుగా విడిపోయి తమ స్వప్రయోజనాల కోసం పోరాడుకుంటున్నారని, సంస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నాయకత్వంలోని పాలకవర్గం తీరు పట్ల తానా సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పాలకవర్గం నిర్లక్ష్యం మూలంగా కొత్తగా సభ్యులుగా చేరిన 70వేల మంది సభ్యులకు ఓటు హక్కు లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

గత జనవరిలో జరిగిన సభ్యత్వ నమోదు సందర్భంగా రికార్డు స్థాయిలో 70వేల మంది నూతనంగా సభ్యత్వం తీసుకున్నారు. వీరి సభ్యత్వాలను పరిశీలించి అర్హత కలిగిన వారిని సభ్యులుగా కొనసాగించే బాధ్యత ప్రస్తుత పాలకవర్గంపై ఉంది. గత ఏప్రిల్ 30వ తేదీ లోపుగా ఈ కార్యక్రమం పూర్తి కావలసి ఉంది. కానీ ఇప్పటివరకు నూతన సభ్యుల వెరిఫికేషన్ పూర్తి కాలేదు. దీనితో వచ్చే ఎన్నికలలో వీరు ఓటు వేయటానికి అనర్హులని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే తానాలో పోటాపోటీగా నూతన సభ్యులను చేర్పించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.

*** అంజయ్య మహాసభలు ఎక్కడయ్యా?
సహజంగా కొత్త పాలకవర్గం ఎన్నికైన అనంతరం తానా కాన్ఫరెన్స్ తమ ఆధ్వర్యంలో ఎక్కడ నిర్వహించాలి? అనే విషయంపై దృష్టి పెడతారు. సహజంగా అధ్యక్షుడు ఏ ప్రాంతం వాడు అయితే అక్కడ మహాసభలు నిర్వహించడానికి రెండు సంవత్సరాలు ముందుగానే కాన్ఫరెన్స్ సెంటర్లను రిజర్వు చేసుకుంటారు. కానీ, ప్రస్తుతం అంజయ్య నాయకత్వంలోనే పాలకవర్గం మహాసభలు ఎక్కడ నిర్వహించాలి అనే విషయంపై ఒక అవగాహనకు రాలేకపోయినట్లు సమాచారం. మొదటి నుండి అంజయ్యకు బాసటగా నిలిచిన ఆయన అట్లాంటా అనుచర వర్గం ఈ పర్యాయం తానా మహాసభలు నిర్వహించలేమని చేతులెత్తేసినట్లు సమాచారం. 2023 జులై నెలలో తానా మహాసభలు నిర్వహించవలసి ఉండగా ఇప్పటివరకూ వేదికకు సంబంధించి నిర్ణయం జరగకపోవడం పాలకవర్గం తీవ్ర వైఫల్యంగా సభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికైనా తానా మహాసభలు నిర్వహించే తేదీలు, ప్రదేశాన్ని ప్రకటించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్.