‘గని’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది ముంబయి భామ సయీ మంజ్రేకర్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. అడివి శేష్ హీరోగా శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ “నా హృదయానికి ఎంతగానో దగ్గరైన చిత్రమిది. ఇందులో నేను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాఠశాల మిత్రురాలు, ఆయన భార్య ఇషా పాత్రలో కనిపిస్తాను. సందీప్‌ఉన్నికృష్ణన్ జీవితాన్ని ప్రభావితం చేసే మహిళగా నా పాత్ర భిన్నకోణాల్లో సాగుతుంది. ఈ సినిమాకు స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పాను.తెలుగు స్పష్టంగా పలకడానికి ఎంతో సాధన చేశాను. సినిమా చూస్తున్నప్పుడు చాలా సహజంగా డబ్బింగ్ చెప్పాననిపించింది. ఈ కథలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. కొద్ది రోజుల క్రితం సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్‌ను కలిశాను. వారు నా పట్ల ఎంతో ఆప్యాయత కనబరిచారు. కెరీర్ తొలినాళ్లలోనే తెలుగులో పెద్ద సంస్థల నుంచి అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఓ నటిగా ఇంతకుమించి ఏమీ కోరుకోవడం లేదు. మనసుకు నచ్చిన కథల్లో నటిస్తూ నాయికగా రాణించాలనుంది’ అని చెప్పింది.