స్నేహితుడి మరణం ఆ విద్యార్థిని తీవ్రంగా కలిచివేసింది. తన మిత్రుడికి జరిగినట్లు మరెవరికీ జరగకూడదనే అతడి ఆలోచన ఓ ఆవిష్కరణకు కారణమైంది. ఆ ఆవిష్కరణే ఇవాళ ఆ విద్యార్థికి పెద్ద పెద్ద సెలబ్రెటీలకు మాత్రమే దక్కే Golden Visa ను తెచ్చిపెట్టింది. దుబాయ్‌లో 16 ఏళ్ల ఓ భారతీ విద్యార్థికి దక్కిన అరుదైన గౌరవం ఇది. ఇంతకీ ఆ విద్యార్థి ఎవరు? అతని ఆవిష్కరణ ప్రాముఖ్యత ఏంటి? అసలు అతని స్నేహితుడికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కేరళ రాష్ట్రం త్రిసూర్‌కు చెందిన సబీల్ బషీర్(16) దుబాయ్‌లోని న్యూ ఇండియా మోడల్ స్కూల్(NIMS)లో చదువుతున్నాడు. 2019లో ఇదే స్కూల్‌లో తనతో పాటు చదివే అతని మిత్రుడు మహమ్మద్ ఫర్హాన్ ఫైజల్ అనుకోని విధంగా ప్రమాదవశాత్తు స్కూల్ బస్సులో చిక్కుకుని ఊపిరాడక చనిపోయాడు. ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం వేరే చోటుకు వెళ్లిన సమయంలో ఫర్హాన్ బస్సులో నిద్రపోవడంతో అందులోనే ఉండిపోయాడు. డ్రైవర్ గానీ, అందులోని అసిస్టెంట్ గానీ ఫర్హాన్ బస్సులో ఉన్న విషయాన్ని గమనించలేదు. తీవ్రమైన ఎండ, పైగా బస్సు డోర్స్ పూర్తిగా మూసి ఉండడంతో ఫర్హాన్‌కు బయటపడే మార్గం లేకుండా పోయింది.
దాంతో ఊపిరాడక బస్సులోనే చనిపోయాడు. సాయంత్రం మళ్లీ విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కడంతో ఫర్హాన్ విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటన అప్పుడు దుబాయ్‌లో సంచలనంగా మారింది. స్కూల్ బస్సులు విద్యార్థులకు ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నను లేవనెత్తితింది. ఇక ఈ ఘటన తన క్లోజ్ ఫ్రెండ్‌ను కోల్పోయిన బషీర్‌ను తీవ్రంగా కలిచివేసింది. అప్పుడే అతను ఓ నిర్ణయానికి వచ్చాడు. తన మిత్రుడికి జరిగినట్లు మరెవరికీ జరగకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఈ సమస్య పరిష్కారం విషయమై ఆలోచించడం మొదలెట్టాడు. ఒకవేళ విద్యార్థులు అనుకోకుండా బస్సులో ఉండిపోతే వారికి ఏమీ జరగకుండా సురక్షితంగా బయటపడే ఆవిష్కరణ చేయాలనేది బషీర్ ఆలోచన. ఈ క్రమంలో 2020లో 10వ తరగతి చదువుతున్న సమయంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో కొన్ని క్రాష్ కోర్సులు పూర్తి చేశాడు. ఆ తర్వాత మహమ్మారి సమయంలో ఇంటి వద్దే ఉండడంతో కొంత సమయం దొరికింది. ఆ సమయంలోనే ‘సబీల్ స్మార్ట్ విజిలెంట్ సిస్టమ్’ను కనుగొన్నాడు. ఒకవేళ పాఠశాల బస్సులో విద్యార్థిని వదిలివేస్తే.. డ్రైవరు బస్సు ఇంజిన్‌ను ఆఫ్ చేసి, దాని డోర్స్ మూసివేసిన 30 సెకన్లలోపు అధికారులను అప్రమత్తం చేయడం ఈ పరికరం ప్రత్యేకత.
సబీల్ స్మార్ట్ విజిలెంట్ సిస్టమ్’ అనే పరికరం ఎలా పని చేస్తుందంటే..
పిల్లలు కొన్నిసార్లు బస్సులో నిద్రపోవడం వల్ల ఎవరూ గనించకపోతే అందులోనే ఉండిపోతారు. అలా ఒక విద్యార్థి స్కూల్ బస్సులో చిక్కుకుపోయిన సందర్భంలో మొదట ఈ పరికరం కృత్రిమ మేధస్సు (AI), అధునాతన థర్మల్ సెన్సార్ టెక్నాలజీ ద్వారా పిల్లల హృదయ స్పందన, కదలిక, శ్వాస కోసం బస్సును స్కాన్ చేస్తుంది. బస్సులో విద్యార్థి ఉన్నట్లు నిర్ధారణ అయితే, 30 సెకన్లలోపు అధికారులను అప్రమత్తం చేస్తుంది. ముందుగా ఆటోమెటిక్‌గానే బస్సు డోర్స్ తెరుస్తుంది. ఆ తర్వాత పోలీసులకు, అంబులెన్స్, పాఠశాల రవాణా నిర్వాహకులకు సందేశాలు వెళ్తాయి.
బషీర్‌కు Golden Visa..
ఈ లైఫ్ సేవింగ్ ఆవిష్కరణకు గాను బషీర్‌కు మేలో యూఏఈ ప్రభుత్వం Golden Visa సత్కరించింది. విద్యార్థుల భద్రతను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడంలో చేసిన కృషికి బషీర్ UAE గోల్డెన్ వీసాను పొందాడు. అది కూడా రంజాన్ మొదటి రోజు గోల్డెన్ వీసా అందుకోవడం ఆనందంగా ఉందని బషీర్ తండ్రి, దీర్ఘకాలంగా దుబాయ్‌లో నివసిస్తున్న బషీర్ మొయిదీన్ అన్నారు. గోల్డెన్ వీసా అందుకోవడం చాలా థ్రిల్‌గా ఉందన్నాడు బషీర్. ఇది తన కుటుంబానికి, తనకు దక్కిన గొప్ప గౌరవం అని చెప్పుకొచ్చాడు.