తానా ప్రస్తుత పాలకవర్గం ఏ ముహూర్తంలో పదవీ బాధ్యతలు చేపట్టిందో గాని గత సంవత్సర కాలంగా తానాలో అన్నీ రికార్డులే నెలకొంటున్నాయి! తానా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పలు అపశకునాలు ఎదురవుతున్నాయి. సంవత్సర కాలం క్రితం చికాగోకు చెందిన ఒక హెల్త్ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో కరోనా సోకి కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకోమని ₹25కోట్లు విలువ చేసే రక్షణ సామాగ్రిని ఉచితంగా అందజేశారు. తానా నాయకత్వం వైఫల్యం మూలంగా గత సంవత్సర కాలంగా ఆ సామాగ్రి నిరుపయోగంగా పడి ఉన్నాయి. అమెరికా నుండి ఆంధ్ర రాష్ట్ర విశాఖ రేవుకు పంపడానికి 6-7నెలల సమయం పట్టింది. చివరకు ఆ సామాగ్రిని ఎక్కడ భద్రపరచాలనే విషయంపై కూడా తానా నాయకత్వంలో విభేదాలు తలెత్తి మరో 4-5నెలలు కాలయాపన జరిగింది. చివరకు ఒక ప్రైవేటు గోదాములో ఆ సరుకుని నిల్వ ఉంచినట్లు సమాచారం. ఈ ₹25కోట్ల విలువైన సామాగ్రి గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో బూడిదపాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తానా నాయకత్వం ఏమి సమాధానం చెప్తుందో వేచి చూద్దాం. కేవలం తానా పాలకవర్గం నిర్లక్ష్యం మూలంగానే కోట్ల రూపాయిల విలువైన ఆరోగ్య సామాగ్రి బుగ్గిపాలైనట్లు సమాచారం. కరోనా సమయంలో ఆసుపత్రులకు, రోగులకు అందించవల్సిన మాస్కులు, ఇతర రక్షణ సామాగ్రి నిరుపయోగంగా సంవత్సర కాలంగా ఉంచారు. తీరా ఇవి అగ్నికి ఆహుతి కావడంతో తానాలో కలకలం రేగుతోంది.