అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు రాజాకృష్ణ మూర్తికి డిస్టింగ్‌గ్యూష్డ్ లీడర్‌షిప్ అవార్డు దక్కింది. ఇల్లినాయ్ రాష్ట్ర సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జెస్సీ వైట్ ఆయన్ను ఈ అవార్డుతో సత్కరించారు. రాజా నిబద్ధతతో ప్రజాసేవ చేశారని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. న్యూఢిల్లీలో పుట్టిన కృష్ణమూర్తి చిన్నతనంలోనే కుటుంబంతో సహా అమెరికాకు వలసపోయిన విషయం తెలిసిందే. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో ప్రాంతంలో ఆయన బాల్యం గడిచింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. గతంలో రాష్ట్ర అటార్నీ జనరల్ ఆఫీసులో స్పెషల్ అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఇక ప్రతినిధుల సభ సభ్యుడిగా ఆయన అనేక చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. విద్యా, కార్మిక సంక్షేమం, అభివృద్ధి, ప్రజారోగ్య కార్యక్రమాలపై ఆయన రూపొందించిన చట్టాలు పెను ప్రభావం చూపించాయి.