సప్త శృంగాలు… అంటే ఏడు శిఖరాల మధ్య… చుట్టూ ప్రకృతి సౌందర్యంతో అలరారే కొండ మీద… అమ్మవారు స్వయంభువుగా వెలసిన క్షేత్రం…. సప్తశృంగి ఆలయం. అక్కడ అభయహారిణిగా, అభయప్రదాయినిగా కొలువైన దేవిని ‘సప్త శృంగి మాత’గా భక్తులు కొలుస్తారు.
మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో సప్తశృంగి ఆలయం ఒకటి. నాసిక్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి సుమారు 1,230 మీటర్ల ఎత్తులో… పర్వత శిఖరాగ్రం మీద ఈ ఆలయం ఉంది. మహారాష్ట్రలోని శక్తి పీఠాల్లో ఇదొకటి. అర్థశక్తి పీఠంగానూ దీన్ని వ్యవహరిస్తారు. రెండు అంతస్తుల ఎత్తులో ఉండే ఆలయంలో అమ్మవారు 18 చేతులతో… ప్రతి చేతిలో ఒక భిన్నమైన ఆయుధంతో… అసురసంహారిణి అయిన దుర్గాదేవి రూపంలో… భీకరంగా కనిపిస్తుంది. ప్రధాన ఆలయంలోని విగ్రహం పది అడుగుల ఎత్తుతో సమున్నతంగా ఉంటుంది.
ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించే కథలు ఎన్నో ఉన్నాయి. దక్షయజ్ఞం జరిగినప్పుడు, తండ్రి దక్షుడి వల్ల భర్త మహా శివుడు పొందిన అవమానాన్ని సహించలేక సతీదేవి ఆత్మార్పణ చేసుకుంది. ఆమె పార్థివ దేహాన్ని భుజాలపై పెట్టుకొని తాండవిస్తున్న శివుణ్ణి చూసి ముల్లోకాలూ కంపించిపోయాయి. అప్పుడు విష్ణు మూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని 51 భాగాలుగా ఖండించాడు. ఆ భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలయ్యాయి. వాటిలో సతీదేవి కుడి చెయ్యి పడిన చోటు సప్త శృంగి అని చెబుతారు. రామాయణ కాలంలో దండకారణ్యం ఇదేననీ, సీతాన్వేషణలో… ఈ ప్రాంతానికి రామ లక్ష్మణులు వచ్చి, సప్తశృంగి మాతను పూజించారనీ స్థానికుల విశ్వాసం. బ్రహ్మదేవుడి కమండలం నుంచి గిరిజా మహానంది పేరుతో అమ్మవారు ఆవిర్భవించిందనీ, ఆమే సప్త శృంగి అనీ పురాణ కథనాలు చెబుతున్నాయి. మహిషాసుర సంహారం కోసం దుర్గాదేవికి దేవతలు తమతమ ఆయుధాలను అందించారనీ, ఆ ఆయుధాలతో… పద్ధెనిమిది చేతులతో సప్తశృంగి అమ్మవారిగా దుర్గమ్మ వెలసిందనీ మరో కథ ఉంది. కాగా భీమాసురుడనే రాక్షసుణ్ణి వధించడం కోసం… మార్కండేయ మహర్షి ప్రార్థన మేరకు ఏడు శక్తి రూపాల కలయికగా… సప్తశృంగి అమ్మవారు వెలసిందంటారు.
సప్తశృంగి మాతను మహిషాసుర మర్దినిగానూ స్థానికులు ఆరాధిస్తారు. మానసిక ఆందోళనలు, భయాలు తొలగించి, ధైర్యాన్నీ, సంకల్పబలాన్నీ సప్తశృంగి మాత ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. స్వయంభువు అయిన ఈ అమ్మవారికి ఆలయం చుట్టూ అనేక తటాకాలు ఉన్నాయి. వాటిలో కాళీకుండ్, సూర్యకుండ్, దత్తాత్రేయకుండ్ ప్రధానమైనవి. ఆ ప్రాంత గిరిజనులకు ఈ అమ్మవారు ఆరాధ్యదైవం. విగ్రహానికి అన్ని వేళలా సిందూరంతో పూత వేస్తారు.
సప్తశృంగి మాతను మహిషాసుర మర్దినిగానూ స్థానికులు ఆరాధిస్తారు. మానసిక ఆందోళనలు, భయాలు తొలగించి, ధైర్యాన్నీ, సంకల్పబలాన్నీ సప్తశృంగి మాత ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.