DailyDose

చెట్టు కింద సర్పంచ్… 15 నెలలుగా అక్కడే విధులు..!

Auto Draft

చెట్టు కింద ప్లీడరు అని మనం వినే ఉంటాం. కొందరైతే సరదాగా సాగే పాత సినిమా చూసి ఉంటారు. కానీ చెట్టు కింద సర్పంచ్ అని ఎప్పుడైనా విన్నారా? పోనీ చూశారా? లేదా..అయితే ఈ స్టోరీని మీరూ చదివేయండి మరి.

చెట్టు నీడే గ్రామ సచివాలయం..చెట్టు కింద ఓ కుర్చీ..! ఎదురుగా ఓ టేబుల్.. దానిపైనే ఒక ఫైల్..! ప్రజలెవరైనా వచ్చి సమస్యలు చెబితే.. పేపర్లు తిరగేసేది అక్కడే.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఎవ్వరూ.. అందుబాటులో ఉండరు.! ఇవన్నీ ఎవరి బాధలో కావు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఓ సర్పంచ్‌ కష్టాలివి. బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ 15 నెలలు దాటినా.. కార్యాలయానికి మాత్రం నోచుకేలేకపోయారు. కొత్త భవన నిర్మాణం ప్రారంభమయ్యాయి.కానీ సర్పంచ్‌ ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుడు కావడంతో నిర్మాణ పనులు పూర్తిగా అటకెక్కాయి. ఎక్కడంటరా..ఇదిగో ఇక్కడ..

ఇక్కడ చెట్టు కింద కుర్చీలో కూర్చుని పేపర్లు తిరగేస్తున్న వ్యక్తి పేరు శివశంకర్. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు సర్పంచ్. అయితే.. ఇక్కడ చెట్టు కింద పేపర్లతో పనేంటి అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో గెలిచిన శివశంకర్‌ కార్యాలయం ఇదే! 15 నెలలుగా..శివశంకర్ ఈ చెట్టు కిందే విధులు నిర్వహిస్తున్నారు.బొడ్డపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం కూల్చేసి కొత్త భవనం నిర్మిస్తామంటూ 2020లో ప్రభుత్వం పనులు చేపట్టింది. కొన్నాళ్లు పనులు బాగానే జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో….తెలుగుదేశం మద్దతుదారుడు శివశంకర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యాక పరిస్థితి మొదటికి వచ్చింది. గతంలోనే 65 శాతం పూర్తైన పనులు అంతకుమించి అడుగుకూడా ముందుకు కదల్లేదు. పనుల్లో జాప్యంపై ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వాపోయారు శివశంకర్. రాజకీయ కారణాలతోనే నిర్మాణం నిలిపివేశారని ఆరోపించారు.

” అధికారులంతా కూడా ఈ భవన నిర్మాణం పూర్తవుతుంది. కానీ ఆర్థిక కారణాల వల్ల ఆలస్యమవుతుందని చెబుతున్నారు.కచ్చితంగా పూర్తి చేస్తాం అంటున్నారు. కానీ తెలుగుదేశానికి మద్దతుదారునైన నేను సర్పంచ్ గా గెలిచాను కాబట్టి కావాలనే కక్షపూరితంగా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు. కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికే గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని ఆపివేశారు. ఇక్కడికి ఏ వాలంటీరు కానీ, సిబ్బంది కానీ, గ్రామ వాలంటీరు కానీ రావడానికి ఇబ్బంది పడతారు.” -శివశంకర్, సర్పంచ్ బొడ్డపాడు, కృష్ణా జిల్లా
పొరుగునే ఉన్న చిన్న పులిపాక పంచాయతీ కార్యాలయంలో.. గ్రామ సచివాయ ఏర్పాటుతో ఇబ్బందులు తప్పడంలేదని స్థానికులు వాపోతున్నారు. సచివాలయ సిబ్బంది కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు.