DailyDose

ఉద్యోగాల భ‌ర్తీపై ప్ర‌ధాని మోదీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌- TNI తాజా వార్తలు

ఉద్యోగాల భ‌ర్తీపై ప్ర‌ధాని మోదీకి మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌-  TNI  తాజా వార్తలు

*గుంటూరు శివారులో అంకిరెడ్డిపాలెం వద్ద క్రేన్ సంస్థ నిర్మించిన వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 18 అడుగుల ఎత్తైన వినాయక చతుర్భుజ ఏకశిల విగ్రహ ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

*ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గ‌డుపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో బోయింగ్‌ సంస్థ చీఫ్‌ స్ట్రాటజీ అధికారి మార్క్‌ అలెన్‌, బోయింగ్‌ ఇండియా అధ్యక్షులు సలీల్‌ గుప్తాతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో బోయింగ్‌ సంస్థ ఉత్పత్తులతో పాటు భవిష్యత్తులో ఇక్కడ వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాల గురించి చర్చించారు.

*బ్యాంకర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2021-22లో దేశంలో నామమాత్రపు జీడీపీ నమోదయిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రోత్ 19.5 శాతంగా నమోదయిందని చెప్పారు. కరోనా తర్వాత మొదటిసారి గ్రోత్ చూడగలుగుతున్నామన్నారు. బ్యాంకులు పేదలకు ఎక్కువ రుణాలు ఇచ్చి.. ద్రవ్యోల్బనం బారినపడకుండా చూడాలని జగన్‌ సూచించారు.

* అమర్‌నాథ్ భక్తులకు శుభవార్త! శ్రీనగర్ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్ సేవలు ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. శ్రీనగర్ నుంచి పంచ తరణి వరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించాలని జమ్మూ-కశ్మీరు పరిపాలనా యంత్రాంగాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 3,500 మీటర్ల ఎత్తులో ఉన్న పంచ తరణి నుంచి ఆరు కిలోమీటర్లు కాలి నడకన లేదా గుఱ్ఱాలు లేదా పల్లకీల ద్వారా వెళ్లి, పవిత్రమైన, దివ్యమైన అమర్‌నాథ్ గుహకు చేరుకోవచ్చు. అమర్‌నాథ్ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది. బల్టాల్, పహల్గామ్‌ల గుండా అమర్‌నాథ్‌కు వెళ్ళవచ్చు. ఈ రెండు మార్గాల గుండా ప్రయాణించి, పంచ తరణి చేరుకోవాలి. అక్కడి నుంచి అమర్‌నాథ్ గుహకు వెళ్ళాలి. ఈ రెండు చోట్ల నుంచి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు హెలికాప్టర్ కోసం ఇక్కడి వరకు రాకుండా శ్రీనగర్ నుంచే హెలికాప్టర్‌లో ప్రయాణించడానికి అవకాశం లభిస్తుంది. ఇక వీరు హెలికాప్టర్ కోసం రోడ్డు మార్గంలో బల్టాల్‌కు లేదా పహల్‌గామ్‌కు వెళ్ళవలసిన అవసరం ఉండదు. కోవిడ్ కారణంగా రెండేళ్ళ అనంతరం అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభమవుతుండటంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వంఅంచనా వేస్తోంది. మరోవైపు ఉగ్రవాద సంస్థల హెచ్చరికల నేపథ్యంలో భక్తులకు భద్రత కల్పించే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, శ్రీనగర్ నుంచి హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించాలని ఆదేశించింది.

*నలుగురు పోలీసులకు 4 వారాల జైలుశిక్షపై హైకోర్టు స్టే విధించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసులకు జైలుశిక్ష విధించింది. జాయింట్ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్‌, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌కు శిక్షపై స్టే విధించింది. దంపతుల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణ ఉంది. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం కూడా ఉంది.

*తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో 12వందల ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండ‌లం వెంక‌ట‌పాళెం గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో విగ్రహ ప్రతిష్ట చేయడానికి నిర్వహించిన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిలోనూ శ్రీవారి ఆలయం నిర్మించామని వెల్లడించారు. మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని అన్నారు

*గుంటూరు జిల్లాలోని వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనలో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పాల్గొన్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్టన, మహాసంప్రోక్షణలో గవర్నర్‌తో పాటు మంత్రి సత్యనారాయణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో శిలాఫలకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. నూత‌న ఆల‌యం వ‌ద్ద విద్యుత్ దీపాలతో ఏర్పాటుచేసిన శంఖుచ‌క్ర నామాలు ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలుస్తున్నాయి. అదేవిధంగా, ఆల‌య ప్రాకారం, ఆల‌య విమానం, గోపురాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంక‌రించారు. ఆర్‌జీడీ లైటింగ్ ఏర్పాటుచేశారు. ఆల‌యం ప్రాంగణంలో వివిధ ర‌కాల పుష్పాల‌తో అలంక‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ఇందుకోసం రెండున్నర ట‌న్నుల పుష్పాలు, 20 వేల క‌ట్ ఫ్లవ‌ర్లు వినియోగించారు

*టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం గాంధీభవన్‌కు వచ్చారు. అమెరికా పర్యటన తరువాత పార్టీ ఆఫీస్‌లో నాయకులు, కార్యకర్తలతో టీపీసీసీ చీఫ్ భేటీ అవుతున్నారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కండువాలు, శాలువాలతో ఆహ్వానం పలికారు. మృగశిర కార్తీ సందర్భంగా పీసీసీ ఫిషర్మెన్ కమిటీ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్ బెస్తవారి వల,టోపీ, బుట్ట,చేపలను రేవంత్‌కు బహూకరించారు.

*రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతల భేటీ అయ్యారు. జాతీయ కార్యవర్గ భేటీల కోసం 34కమిటీల నియమించారు. ఈ సమావేశానికి తరుణ్‌చుగ్, శివప్రకాష్, అర్వింద్ మీనన్ హాజరయ్యారు. నేషనల్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే బాధ్యతలపై కమిటీ‌ సభ్యులకు నేతలు అవగాహన కల్పించారు. జులై 2, 3న హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలు ఉండనున్నట్లు ఈ సమావేశంలో వెల్లడించారు.

*జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం, సన్నబియ్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.50వేల కోట్ల మేర రుణం పొందేందుకు పౌర సరఫరాల శాఖకు గ్యారంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరుచేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గతంలో 2021-22 వానాకాలం వరకు రూ.61,600 కోట్ల రుణాలకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. అయితే… పౌర సరఫరాల శాఖ అభ్యర్థన మేరకు బ్యాంకు గ్యారంటీని రూ.50వేల కోట్లకు తగ్గించింది. ఇది 2021-22 యాసంగి సీజన్‌ వరకు వర్తిస్తుంది

*పట్టాదారు పాస్‌పుస్తకాల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ధరణిలో ఇచ్చిన ఆప్షన్‌తో పొటెత్తిన దరఖాస్తులు తాజాగా కలెక్టర్ల లాగిన్‌లోకి చేరుతున్నాయి. నెలరోజుల కిందట ఆప్షన్‌ ఇవ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా విజ్ఞప్తులు వచ్చాయి. మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. వాటిని కలెక్టర్ల లాగిన్‌లోకి ఎప్పట్లోగా పంపిస్తారంటూ రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో సీసీఎల్‌ఏ కార్యాలయం స్పందించింది. దరఖాస్తులను కలెక్టర్ల లాగిన్‌లోకి పంపాలని 3 రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు ఆమోదించగానే రైతులకు సమాచారం వెళ్లనుంది. ఆమోదం లభించిన వారంతా తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లి.. ఆయా పత్రాలు సమర్పించి, తగిన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

*పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రెండు లక్షల మంది పరీక్షలు ఫెయిల్ కావడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఉత్తీర్ణతా శాతం పెంచామని చెప్పారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో అసమర్థత వల్లే ఏడుగురు విద్యార్థిని విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. విజనరీ చంద్రబాబు, ప్రిజనరీ జగన్‌కు మధ్య ఉన్న తేడానే పదో తరగతి ఫలితాలు అని వ్యాఖ్యానించారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరీక్షల నిర్వహణ, ఉత్తీర్ణతపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని వెంటనే ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని లోకేష్ ఆరోపించారు.

*తిరుమల పవిత్రతను పక్కా ప్రణాళికతో వైసీపీ (YCP) ప్రభుత్వం దెబ్బతీస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్.. వెంకన్న సన్నిధిని నిత్య వివాదాల కేంద్రంగా మార్చేశారని ఆరోపించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుని అనేక ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఇప్పుడు ఏకంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తనకు గది కేటాయించలేదంటూ టీటీడీ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ వెంకట రత్నంపై దుర్భాషలాడుతూ భౌతిక దాడి చేశాడన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భక్తులకు, సిబ్బందికి రక్షణ కల్పించ లేకపోవడం టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

*మద్యం మత్తులో అనేక నేరాలు జరుగుతున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు అన్నారు. గురువారం ఆంధ్ర ప్రదేశ్మ ద్య విమోచన ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఆయన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్‌లలో, బస్సుల్లో మద్య విమోచన పోస్టర్స్‌ను అతికించనున్నామని, ఆర్టీసీ డ్రైవర్లతో పాటు మిగిలిన సిబ్బందిని ఖచ్చితంగా బ్రీత్ ఎనలైజర్‌తో ఆల్కహాల్ తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. మద్యం సేవించి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం ఆర్టీసీలోనే కాదని… ఈ తనిఖీలు మిగిలిన ప్రైవేట్ ట్రావెల్స్‌లో కూడా జరుగుతాయన్నారు. మద్య విమోచన ప్రచార కమిటీతో కలిసి పని చేయబోతున్నామని ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు.

*కల్లూరు గంగాధర్ రెడ్డి మృతిపై ఆయన భార్య ఫరిదా భాను స్పందించారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. ఎక్కువగా ఆలోచన చేస్తుండటంతో అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయని, సీబీఐ కేసుల గురించి ఎప్పుడు తమతో చర్చించలేదని అన్నారు. ఆయనకు ఎలాంటి బెదిరింపులు లేవని, సరిగా తినకపోవడం, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో మృతిచెందారని అన్నారు. రాత్రి భోజనం చేసి పడుకున్నారని, అనారోగ్యంతోనే చనిపోయారని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని ఫరిదా భాను స్పష్టం చేశారు.

*జూమ్ పాలిటిక్స్‌ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం, వైసీపీ నేతల జీవితాలే ఫేక్ అని ఆరోపించారు. లోకేష్ నిర్వహిస్తున్న జూమ్‌ కార్యక్రమంలోకి వైసీపీ వాళ్లు దొంగల్లా జొరబడ్డారని విమర్శించారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సులోకి వైసీపీ నేతలు వచ్చారని మండిపడ్డారు. ‘‘మా జూమ్ కాన్ఫరెన్సులోకి రావడం కాదు.. విద్యార్థులతో మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టగలరా?.. మంత్రి బొత్స కాన్ఫరెన్స్ పెడితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోనే చీపుర్లతో కొడతారు.. ముఖాన ఉమ్మేస్తారు.. పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మలు.. పనికి మాలిన వెధవలు జొరబడ్డారు.. వైసీపీది ఫేక్ పార్టీ అని నిరూపితం అయింది. జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. పదో తరగతి పాస్ కాని వెధవలు జూమ్ కాన్ఫరన్సులోకి వచ్చారు.. 2 లక్షల మంది విద్యార్థులు తప్పలేదా..?, కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చోసుకోలేదా..?, విద్యార్థులకు మనో ధైర్యం కల్పించాలని మేం కాన్ఫరెన్స్ పెడితే దొంగల్లా వచ్చారు.. విద్యార్ధులు తప్పలేదని.. ఆత్మహత్యలు చేసుకోలేదంటే మేం క్షమాపణ చెబుతాం’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

*దెందులూరు మండలంలో పోలీసుల అర్ధరాత్రి అరెస్టుల పర్వం కొనసాగించారు. శ్రీరామవరంలో నలుగురిని, మేదినరావుపాలెంలో ఒకరిని రాత్రి మూడు గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఏ స్టేషన్ కు తరలించింది తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరులో ఘర్షణ జరిగిన రోజు నుంచి అజయ్, వరకృష్ణ అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అచూకీ తెలియలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదని కుటుంబీకులు వాపోతున్నారు.

*రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌, మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో, శుక్రవారం ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌, మంచిర్యాల జిల్లాలలోని పలు ప్రాంతాల్లో వడగాలులూ వీచే అవకాశం ఉందని పేర్కొంది.

*జగన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ రేషన్‌ డీలర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు డీలర్ల వ్యవస్థనే రద్దు చేయాలనుకున్న వైసీపీ ప్రభుత్వం విమర్శల ధాటితో వెనక్కు తగ్గిన విషయం తెలిసింది. తాజాగా ఉచిత కోటా బియ్యం ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు పేదలను, ఇటు డీలర్లను ఇబ్బందుల్లోకి నెట్టింది. డీలర్ల ఆదాయానికి గండి కొట్టినట్లయింది. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఉచిత కోటా బియ్యం పంపిణీ చేస్తోంది. ఆ కోటా వల్ల రెగ్యులర్‌గా వచ్చే కమీషన్‌తో పాటుగా కేంద్రం ఇచ్చే కమీషన్‌ కూడా డీలర్లకు అందుతోంది. ఇప్పటికే డోర్‌ డెలివరీతో నష్టపోయామని భావిస్తున్న తరుణంలో ఈ అదనపు ఆదాయం కొంత ఊరటనిచ్చింది. సెప్టెంబరు వరకు గడువు, సరిపడ బియ్యం నిల్వలు ఉన్నప్పటికీ… కేంద్రం నూరు శాతం కార్డులకు రాయితీ ఇవ్వట్లేదనే నెపంతో ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో ఉచిత కోటా బియ్యం ఆపేశారు. దాంతో డీలర్లకు ప్రతినెలా వచ్చే రెండో కోటా కమీషన్‌ ఆగిపోయింది. ఇది రాష్ట్రంలో 29 వేలకు పైగా రేషన్‌ దుకాణాలను నడుపుతున్న ఆయా కుటుంబాలపై ప్రభావం వేసింది. రేషన్‌ సరుకుల పంపిణీతో వచ్చే కమీషన్‌పై ఆధారపడి 30 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

*జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసుకు సంబంధించి కేవలం బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు మాత్రమే నిజాయితీపరుడిలా తనకు కనిపిస్తున్నారని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు. మిగతా వారంతా డైవర్షన్‌ ప్రయోగిస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు.

*ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కావేటి విజయానంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. 1992 ఆలిండియా సర్వీసు క్యాడర్‌కు చెందిన విజయానంద్‌ ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం వేచి ఉన్నారు. ప్రస్తుతం ఇంధనశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్న బి.శ్రీధర్‌ ఆ బాధ్యతలను విజయానంద్‌కు అప్పగిస్తారు. జెన్కో ఎండీగా ఉన్న శ్రీధర్‌ ఏపీ ట్రాన్స్‌కో సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

*ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ఆ తర్వాత విజయవాడలో రిలే నిరాహారదీక్షలకు రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది. గురువారం విద్యాశాఖ కమిషనర్‌ నిర్వహించే సమావేశానికి రావాలని సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డితోపాటు మరో ముగ్గురు ప్రతినిధులను ప్రభుత్వం బుధవారం ఆహ్వానించింది.

*గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, అప్‌గ్రేడ్‌ చేస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే హామీ ఇచ్చారని యూటీఎఫ్‌ తెలిపింది. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావుతో కలిసి యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ బుధవారం కాంతిలాల్‌ దండేను కలిశారు.

*రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలను, వలంటీర్లను గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌ల ఆధీనంలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ తీర్మానించింది. విజయవాడలో ఈ నెల 6 నుంచి రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ సమావేశాల్లో ఆమేరకు చర్చించి తీర్మానాలు చేశారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ స్వతంత్ర శాఖగా గ్రామ పంచాయతీలకు సమాంతరంగా పనిచేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చే కేంద్ర నిధులను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు, సర్పంచ్‌లకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానించారు. పది డిమాండ్ల సాధన కోసం వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం తీర్మానించిందని పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

* రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తిరుమల వేంకటేశ్వరస్వామిని బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. అంతకుముందు వేకువజామున ఆలయంలో జరిగిన అర్చన సేవలో కూడా ఆయన పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు.

*రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన గవర్నర్‌ శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఆయన్ను వేదపండితులు ఆశీర్వదించగా, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.

*పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా, మరో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. కృష్ణాజిల్లా కాజ శివారు మట్లమాలపల్లి గ్రామానికి చెందిన డొక్కుమాల హేమచంద్ర(16) బుధవారం శానిటైజర్‌ తాగి మరణించాడు. ఇతను కాజ జడ్పీ పాఠశాల విద్యార్థి. తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే జిల్లా నిడుమోలుకు చెందిన బాలిక సోషల్‌, గణితం సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన కారణంగా నెయిల్‌ పాలిష్‌ తాగింది.

*శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. 34 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపులో రూ.4,00,23,145 నగదు లభించింది. నగదుతోపాటు 391 గ్రాముల బంగారం, 9.400 కిలోల వెండి లభించాయి.

*మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ బుధవారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. గురువారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

*రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించింది. జలసౌధలో ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు నేతృత్వంలో జలసౌధలో సమావేశం జరిగింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు తక్షణం ఎన్ని నిధులు కావాలి? ప్రస్తుతం పనులు ఏ మేరకు జరిగాయి? చెల్లింపులు ఏ మేరకు పెండింగ్‌లో ఉన్నాయి? వంటి అంశాలను ఆరా తీశారు. గురువారం కల్లా సమగ్ర వివరాలు అందించాలని ఆయా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లను ఈఎన్‌సీ ఆదేశించారు. వివరాల సేకరణ అనంతరం గురువారం లేదా శుక్రవారం ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావును కలిసి, నిధుల అంశాన్ని నివేదించాలని నిర్ణయించారు.

*గాంధీ ఆస్పత్రిలో ఇకపై అన్ని రకాల అవయవ మార్పిడి సర్జరీలను నిర్వహించేలా ఒక అవయవ మార్పిడి కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గతంలో గాంధీలో కాలేయ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించిన సర్కారు, 2018లో అందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. అయితే.. తాజాగా దాన్ని సవరిస్తూ మరో జీవోను ప్రభుత్వం జారీ చేసింది. గాంధీలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో పేర్కొంది. దీని ఏర్పాటుకు ప్రాథమికంగా అవసరమైన నిధులు రూ. 20కోట్లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి విడుదల చేస్తున్నట్లు మరో జీవోలో స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే కేంద్రంలో అన్ని రకాల అవయవ మార్పిళ్లు జరుగుతాయని అధికారులు తెలిపారు.. ఇక.. ప్రస్తుతం నిమ్స్‌ కేంద్రంగా జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ వ్యవహారాలను.. తాజా కేంద్రం ప్రారంభం అనంతరం గాంధీ నుంచే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

*హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ చాలా మంచి మనిషి అని, సమర్థుడైన అధికారి అని.. కానీ, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన కూడా అసత్యాలు చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ప్రజాప్రతినిధుల పిల్లలను కాపాడేందుకే తెలంగాణ ప్రభుత్వం కేసును నీరుగారుస్తోందని, పోలీసులతోనూ అసత్యాలు చెప్పించిందని విమర్శించారు. బాలికపై గ్యాంగ్‌రేప్‌ ఘటనలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల కుమారులతోపాటు ఏపీ ప్రభుత్వ సలహాదారుడి కుమారుడు కూడా ఉన్నాడని, ఇప్పటికైనా ఏపీ సీఎం జగన్‌ స్పందించి సదరు సలహాదారుడిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరసన తెలపకుండా విపక్షాల నేతలను ఇళ్ల వద్దే కట్టడి చేసే తెలంగాణ పోలీసులకు.. గ్యాంగ్‌రేప్‌ నిందితులను పట్టుకోవడానికి వారం రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మైనర్లను అనుమతించినందుకు అమ్నీషియా పబ్‌ యజమానిని అరెస్టు చేయాలని, పబ్‌ను తక్షణమే మూసివేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఉన్న పబ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు నియంత్రణ లేదన్నారు. ప్రజాప్రతినిధుల పిల్లలను కాపాడేందుకు కేసును బలహీనపర్చడం తగదన్నారు.

*రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించింది. జలసౌధలో ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు నేతృత్వంలో జలసౌధలో సమావేశం జరిగింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు తక్షణం ఎన్ని నిధులు కావాలి? ప్రస్తుతం పనులు ఏ మేరకు జరిగాయి? చెల్లింపులు ఏ మేరకు పెండింగ్‌లో ఉన్నాయి? వంటి అంశాలను ఆరా తీశారు. గురువారం కల్లా సమగ్ర వివరాలు అందించాలని ఆయా ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లను ఈఎన్‌సీ ఆదేశించారు. వివరాల సేకరణ అనంతరం గురువారం లేదా శుక్రవారం ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావును కలిసి, నిధుల అంశాన్ని నివేదించాలని నిర్ణయించారు.

*రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగనుంది. మరో వారంలో నోటిపికేషన్‌ విడుదల కానుందని ఎన్నికల కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి. జూన్‌ చివరి వారం వరకు నామినేషన్ల ఘట్టం ముగుస్తుందని, జూలై మూడో వారంలో ఎన్నికలు జరుగవచ్చని చెప్పాయి. జులై 25న కొత్త రాష్ట్రపతి పదవీ స్పీకారం చేస్తారు. అయిదేళ్ల క్రితం రాష్ట్రపతి ఎన్నికలకు జూన్‌ 14న నోటిఫికేషన్‌ జారీ అయిందని, ఇప్పుడు ఆ లోపే ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారని ఈ వర్గాలు స్పష్టం చేశాయి.

*పర్యావరణ పనితీరు సూచీ లో 180 దేశాల్లో భారత దేశం అట్టడుగున ఉంది. యేల్, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు నిర్వహించిన అద్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వాతావరణ మార్పులు, పర్యావరణ ప్రజారోగ్యం, జీవ వైవిద్ధ్యం వంటి 40 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించారు.