DailyDose

జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక

జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక

దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారైంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్‌ చేపట్టనున్నారు.ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది.

ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుందంటే..
రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ సభ్యులుంటారు. వీరు ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుడిని ఎన్నుకొంటారు. రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు మాత్రమే ఎన్నుకొంటారు.ఓటింగ్‌ బ్యాలట్‌ పేపర్‌ విధానంలో జరుగుతుంది. ఓటింగ్‌ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే అది రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్‌ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.2017లో జులై 17న రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. గతేడాది అధికార, ప్రతిపక్ష కూటములు దళిత అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. అప్పుడు ఎన్డీయే కూటమి పార్టీలతోపాటు, బయట నుంచి ఏఐఏడీఎంకే, వైకాపా, జేడీయూ, బీజేడీ, తెరాస, ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్రులు మద్దతివ్వడంతో రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం సాధించారు.

ఓట్ల విలువ ఇలా..
ప్రస్తుతం ఎలక్టోరల్‌ కాలేజీలో 776 ఎంపీలు ఉండగా.. వారి ఓట్ల విలువ 5,43,200గా ఉంది. ఇక 4033 ఎమ్మెల్యేలు ఉండగా.. వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీయేకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీయే బలం కొంత ఎక్కువగానే ఉంది