Kids

పూర్ణ ది గ్రేట్‌.. 7 ఖండాల్లో 7 శిఖరాల అధిరోహణం

పూర్ణ ది గ్రేట్‌.. 7 ఖండాల్లో 7 శిఖరాల అధిరోహణం

7 ఖండాల్లో 7 శిఖరాల అధిరోహణం
చరిత్ర సృష్టించిన మాలావత్‌ పూర్ణ
మౌంట్‌ డెనాలి ఎక్కి ప్రపంచ రికార్డు
నెలకొల్పిన నిజామాబాద్‌ ఆడబిడ్డ

పిన్న వయసులోనే ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకొన్న మాలావత్‌ పూర్ణ మరో చరిత్ర సృష్టించింది. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్‌ డెనాలి (6,190 మీటర్లు) శిఖరాన్ని అధిరోహించింది. పూర్ణ ఈ ఫీట్‌ను ఈ నెల 5న సాధించినట్టు ఆమె కోచ్‌ శేఖర్‌ తెలిపారు. ఫలితంగా ఏడు ఖండాల్లో ఏడు అత్యున్నత శిఖరాలను అధిరోహించిన (7 సమ్మిట్స్‌ చాలెంజ్‌) ఘనత సొంతం చేసుకొన్నది. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్‌సెండ్‌ అడ్వెంచర్‌ నిర్వహించిన సాహస యాత్రలో పాల్గొన్న పూర్ణ.. తెలంగాణ పేరును నలుమూలలా వ్యాప్తి చేసింది.

ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ ప్రోత్సాహంతో మే 18న పర్వతారోహణకు బయలుదేరిన పూర్ణ.. 19న అలాస్కాలోని యాంకరేజ్‌ నగరానికి చేరుకొన్నది. ఆమెతో పాటు భారత్‌ నుంచి మరో 4 మంది జట్టు సభ్యులు ఉన్నారు. వీరంతా మే 22న టాకిట్నాకు వెళ్లారు. మౌంట్‌ డెనాలి నేషనల్‌ పార్కులో వివరాలు నమోదు చేసి, మే 24న బేస్‌ క్యాంపునకు చేరుకొన్నారు. అక్కడి నుంచి మౌంట్‌ డెనాలి అధిరోహణను ప్రారంభించారు. జూన్‌ 5న పూర్ణ తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పూర్ణ.. 2014లో ఎవరెస్టును అధిరోహించి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

పూర్ణ అధిరోహించిన పర్వతాలు:
1. ఎవరెస్టు (ఆసియా)
2. మౌంట్‌ కిలిమంజారో (ఆఫ్రికా)
3. మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (యూరప్‌)
4. మౌంట్‌ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా)
5. మౌంట్‌ కార్టెన్జ్‌ (ఓషియానియా)
6. మౌంట్‌ విన్‌సన్‌ (అంటార్కిటికా)
7. మౌంట్‌ డెనాలి (ఉత్తర అమెరికా)