ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యునికి ఉత్తర దక్షిణాయనాలు ఉన్నట్లే.. సినీరంగంలో సక్సెస్‌లు మారిమారి వస్తుంటాయని నటుడు, నిర్మాత, మక్కల్ నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అన్నారు. ఈయన కథానాయకుడిగా రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నిర్మించిన విక్రమ్ చిత్రం ఈ నెల 3న విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కమలహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ గురువారం చెన్నైలో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. కమలహాసన్ మాట్లాడుతూ ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపా. మంచి విజయాన్ని సాధించాను.. ఇది చాలు అన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాదన్నారు. దీనికంటే మరింత విజయవంతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో తన పయనం సాగుతుందన్నారు.
తదుపరి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి నటిస్తారా ? అన్న ప్రశ్నకు తానెప్పుడూ సిద్ధమేనని, దర్శకుడే రజనీకాంత్‌కు కథ చెప్పి ఒప్పించాలని, అలాగే తనకు కథ నచ్చాలని అన్నారు. సమీప కాలంలో మన చిత్రాల కంటే ఇతర భాషా చిత్రాల గురించే చర్చించుకోవడం గురించి మీ స్పందన..? అన్న ప్రశ్నకు ఇంతకు ముందు అపూర్వ సహోదరులుగళ్, అవ్వై షణ్ముఖుని, ఏక్ దూజ్ కేళియే వంటి చిత్రాలు దేశం దాటి విజయం సాధించాయని, సూర్యునికి కూడా ఉత్తర దక్షిణాయనాలు ఉంటాయని, అదే విధంగా సక్సెస్‌లు కూడా మారి మారి వస్తాయని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.