DailyDose

థాయ్‌లాండ్‌లో.. గంజాయి చట్టబద్ధం.. అంతా ఓకే కానీ ఇలా చేస్తే జైలుశిక్షే..

థాయ్‌లాండ్‌లో..  గంజాయి చట్టబద్ధం.. అంతా ఓకే కానీ ఇలా చేస్తే జైలుశిక్షే..

*ఆసియాలోనే తొలి దేశంగా రికార్డు…. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం

భారత్‌లో గంజాయి సాగు చేయడం నిషేధం. భారత్‌లోనే కాదు… ఆసియా దేశాల్లో గంజాయి సాగు చేసినా, తరలించినా, విక్రయించినా, వినియోగించినా నేరమే. కానీ.. థాయ్‌లాండ్‌ ప్రభుత్వం గంజాయి సాగుతోపాటు, దాని వినియోగాన్ని కూడా చట్టబద్ధం చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. గురువారం నుంచే థాయ్‌లాండ్‌లోని చిన్న చిన్న కేఫ్‌ల్లో కూడా గంజాయి విక్రయాలు మొదలయ్యాయి.గతంలో దొంగచాటుగా గంజాయి కొనుగోలు చేసేవారు.. ఇప్పుడు బహిరంగంగా దాన్ని పొందగలుగుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడంపై మాత్రం ఆ దేశం నిషేధం విధించింది. వైద్యపరమైన ఉపయోగం కోసమే గంజాయిని ప్రోత్సహిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని థాయ్‌ మంత్రి అనుతిన్‌ చార్న్‌విరాకుల్‌ నిర్ణయించారు.కాగా.. బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగితే నేరంగా పరిగణిస్తామని, దీనికి 3 నెలల జైలుశిక్షతోపాటు రూ.60వేలు జరిమానా విధిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. గంజాయిని చట్టబద్ధం చేసిన ఫలితంగా.. ఇప్పటికే ఈ నేరాల కింద శిక్ష అనుభవిస్తున్న సుమారు 4 వేల మందిని విడుదల చేస్తారు.