ఢిల్లీ అధికార సౌధాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. సీనియర్ ఐఏఎస్ రాజీవ్ మెహరిషి ఆర్థికశాఖ, హోంశాఖ కార్యదర్శి వంటి కీలక పదవులు నిర్వహించారు. కెరీర్ చివర్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గానూ బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ఇప్పుడు విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఖాళీగా ఉండటం ఎందుకని తనకిష్టమైన పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. ఒకప్పుడు హాబీ.. ఇప్పుడు అదే తన వృత్తిగా మారింది. తాను ఎవరి దగ్గరా నేర్చుకోలేదని, సొంత ఆలోచనల మేరకు చేసుకుంటూ పోతున్నానని ఓ ఇంటర్వ్యూలో మెహరిషి చెప్పారు. ‘ఉప్పు, మెంతులు, జీలకర్ర ఎంత వేయాలో నాకు తెలియదు. నాకు నచ్చిన పాళ్లల్లో వేస్తూ పోతాను. ఇదంతా భగవంతుడిచ్చిన జ్ఞానం’ అంటారు మెహరిషి. మొదట కుటుంబ సభ్యులు తన పచ్చళ్లను వాడి చూశారని, బాగున్నాయన్నారని తెలిపారు. తర్వాత కోడలు ఆస్థా జైన్ ‘పిక్లీ.. టేస్ట్ ఆఫ్ దాదా’ అనే బ్రాండ్ నేమ్‌తో మెహరిషి పచ్చళ్లను మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు.