గల్ఫ్ దేశం కువైత్‌లో అంతర్గత మంత్రిత్వశాఖ శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో భారీ సంఖ్యలో ప్రవాసులు అరెస్ట్ అయ్యారు. రెండు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన దాడుల్లో సుమారు 408 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. మొదటి బృందం జలీబ్ అల్ ష్యూక్, సాల్మియా, సల్హియా ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక సోదాల్లో 80 మంది ప్రవాసులు పట్టుబడ్డారని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో 48 మంది పరారీలో ఉన్నవారు, 13 మంది గడువు ముగిసిన రెసిడెన్సీ పర్మిట్లు కలిగినవారు, ఇద్దరు గడువు ముగిసిన వీసాదారులు, ఐదుగురు స్పాన్సర్‌ల నుండి తప్పించుకున్నవారు, 12 మంది చెల్లుబాటు అయ్యే ID proof లేని వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
Kuwait లో భారీ సంఖ్యలో వలసదారులు అరెస్ట్..!ఇక రెండో అధికార బృందం అల్ వఫ్రా, మీనా అబ్దుల్లా ప్రాంతాలతో పాటు అల్ ఫర్వానియా గవర్నరేట్ పరిధిలో చేపట్టిన సోదాల్లో 328 మంది పట్టుబడ్డారు. వీరందరూ స్థానికంగా రెండు పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటిలో లోకల్ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, ఫర్వానియాలో 166 మంది అరెస్టైతే.. అల్ వఫ్రా, మీనా అబ్దుల్లా ప్రాంతాలలో మరో 162 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందరిని ప్రాసిక్యూషన్ ముందు హాజరుపరిచిన తర్వాత న్యాయస్థానం సూచన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు.