కరోనాతో 2020 నుంచి రద్దయిన అంతర్జాతీయ సర్వీసులు ఇటీవలే పునః ప్రారంభం అయ్యాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే భారతీయ విద్యార్థులు పెరిగిపోయారు. కరోనాతో సుదీర్ఘ కాలం తర్వాత వీసా అప్లికేషన్లు పెరగడంతో వాటిని క్లియర్ చేయడంలో ఆయా దేశాల ఎంబసీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బ్రిటన్‌లో సాధారణంగా స్టూడెంట్ వీసా అప్లికేషన్ మూడు వారాల్లో ప్రాసెస్ అయి ఆమోదం లభించేది. కానీ బ్రిటన్‌లో విద్య వీసాకు ఆమోదం కోసం విదేశీయులు సగటున ఐదు వారాల పాటు వేచి ఉండాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
విద్యార్థుల వీసా దరఖాస్తులకు ఆమోదం పలకడంతో జాప్యానికి బ్రిటిష్ హైకమిషన్ అధికార ప్రతినిధి క్షమాపణ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో విద్యార్థుల వీసా దరఖాస్తుల గణనీయంగా ఉంటాయి. కనుక విద్యార్థులు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ అధికార ప్రతినిధి సూచించారు.
బ్రిటన్‌కు స్టూడెంట్ వీసాపై వెళ్లే విద్యార్థులకు టైర్ -4 (జనరల్) స్టూడెంట్ వీసా అవసరం. 16 ఏండ్లు దాటితే మీరు బ్రిటన్‌లో విద్యాభ్యాసం కోసం స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఆఫర్ చేసిన కోర్సులో చేరేందుకు చెల్లించే ఫీజు సిద్ధం చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ మాట్లాడే విధానం, రాసే, చదివి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఫీజు ఆధార పడి ఉంటుంది.
ఆరు నెలల పాటు ఉండే కోర్సుల్లో చేరే వారికి, 11 నెలల వరకు ఇంగ్లిష్ భాష నేర్చుకోవడానికి షార్ట్‌టర్మ్ వీసాలు జారీ చేస్తారు. బ్రిటన్‌లో మాత్రమే వీసా అప్లికేషన్లు ఒక్కసారిగా పెరిగిపోలేదు. అమెరికా, కెనడా, పలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో కూడా వీసా అప్లికేషన్ల ప్రాసెస్ కోసం విద్యార్థులు వేచి ఉండాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన వీసా అప్లికేషన్లు సబ్‌మిట్ చేయాలని ఆయా దేశాల ఎంబసీలు విద్యార్థులను కోరుతున్నాయి.