‘స్టార్ ఇమేజ్ అనే చట్రంలో బందీ కావడం నాకు ఇష్టం లేదు. మంచి సినిమాలు చేయాలని ఆలోచిస్తాను తప్ప ఇమేజ్‌ను పట్టించుకోను. నా కోసమే పుట్టిన కథ ఉంటే తప్పకుండా అదే నన్ను వెతుక్కుంటూ వస్తుంది’ అని సాయిపల్లవి అన్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి విజయం తర్వాత ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ఇది. రానా కథానాయకుడు. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. వచ్చే శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ‘విరాటపర్వం’ విశేషాలను పంచుకున్నారు. 1990ల నాటి పరిస్థితులు, అప్పటి సామాజిక, రాజకీయ ఇతివృత్తంతో సాగే చిత్రం ఇది. ‘విరాటపర్వం’ కథ వింటున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్లుంది. వెన్నెల లాంటి పాత్రలు అరుదుగా లభిస్తాయి. నటిగా నన్ను నేను సవాల్ చేసుకున్నట్లు ఉంటుంది అనిపించి ఈ చిత్రం చేశాను. వెన్నెల ఒక సాధారణ అమ్మాయి. అమాయకత్వంతో పాటు తను నమ్మేదాన్ని సాధించే తెగువ ఉంటుంది. దర్శకుడు చాలా రీసెర్చి చేసి సహజసిద్ధంగా సినిమాను తీర్చిదిద్దారు. రానా గారు రవన్న పాత్రలోకి వచ్చాక సినిమా స్థాయి పెరిగింది. ఆ పాత్ర ఆయనకు సరిగ్గా నప్పుతుంది. సరళ గారి కుటుంబాన్ని కలిశా. వారి అమ్మగారు నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు.