Politics

బీజేపీ 420 కంటే డబల్ – TNI రాజకీయ వార్తలు

బీజేపీ 420 కంటే డబల్    – TNI రాజకీయ వార్తలు

* ఎన్‌డీఏ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైనిక దళాల్లో ఖాళీల భర్తీ కోసం అగ్ని‌పథ్ పేరుతో కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆర్మీలో కొత్తగా చేరిన యువతను నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తే వాళ్లు ఎలా బతుకుతారు? అని నారాయణ ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ది కోసమే ‘అగ్నిపథ్’ తీసుకువచ్చారని, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన యువకుడి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి, అగ్నిపథ్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు అంటూనే ప్రభుత్వ సంస్థలను మూసివేస్తుండడం బాధిస్తోందన్నారు. విపక్షాల నేతలను అరెస్టులు చేసేందుకు ఉపయోగపడే ఇంటలిజెన్స్, ఇప్పుడు ఎం చేస్తుందని ప్రశ్నంచారు. బీజేపీ తీరు పక్కా 420 కంటే డబల్ అన్న రీతిలో ఉందన్నారు.

*ఆ ఆరోప‌ణ‌లు బండి అజ్ఞానానికి నిద‌ర్శ‌నం : మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ఘ‌ట‌న దుర‌దృష్‌ క‌ర‌మ‌ని రాష్ట్ర మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెంద‌డం ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేస్తున్నానని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌ల వెనుక టీఆర్ఎస్ పార్టీ ఉంద‌ని బండి సంజ‌య్ వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌న్నారు. ఈ ఆరోప‌ణ‌లు ఆయ‌న అజ్ఞానానికి నిద‌ర్శ‌నమ‌ని మంత్రి పేర్కొన్నారు. మరి బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల వెనుక ఎవరున్నారు? అక్కడ టీఆర్ఎస్ ఉన్నదా..? ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే మూర్ఖపు బీజేపీ నిర్ణయాల వల్ల నేడు దేశ వ్యాప్తంగా అల్ల‌ర్లు జ‌రుగుతున్నాయి. బండి సంజ‌య్ లాంటి నాయ‌కుల వ్యాఖ్య‌ల వ‌ల్లే దేశంలో అశాంతి, అభ‌ద్ర‌త ఏర్ప‌డింద‌న్నారు.

* తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తెచ్చింది కేసీఆర్:Errabelli
తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తీసుకు వచ్చింది సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ కళల పట్ల మమకారంతో ఉన్నారని, కేసీఆర్ చొరవతో సాహిత్యానికి ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు.ర‌వీంద్ర భార‌తిలో గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ నిర్వ‌హిస్తున్న శిల్పకళా ప్రదర్శనను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారితో క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కళలు,సాహిత్యానికి ఎంతో గుర్తింపు లభిస్తోందన్నారు.

*వైఎస్‌ఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు: పువ్వాడ
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.షర్మిల చెప్పే సినిమా డైలాగ్‌లను ప్రజలు పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల చేసిన విమర్శలకు మంత్రి స్పందించారు.షర్మిలకు దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్నారు.వైఎస్‌ హయాంలో భూములెవరు కబ్జా చేశారో అందరికీ తెలుసునని, నేను ఉత్త పుణ్యానికి మంత్రి అయ్యాని పువ్వాడ పేర్కొన్నారు.మీ అన్న, నాన్నలా డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులివ్వడం కేసీఆర్‌కు తెలీదని అన్నారు.

*ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా?: బండి సంజయ్‌
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తుంటే వారిని ఉగ్రవాదులు మాదిరిగా ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను సిల్లీ అనడం దుర్మార్గమని అన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా?అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు.శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవిద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారు.

*బీజేపీ ప్రతీ చర్యకు రియాక్షన్ ఉంటుంది: Sailajanath
బీజేపీ చేసే ప్రతీ చర్యకూ రియాక్షన్ ఉంటుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్రం మంత్రి అమిత్ షాల వికృత రాజకీయ క్రీడను దేశమంతా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఎఫ్‌ఐఆర్ కూడా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని మూడు రోజులు విచారించారని మండిపడ్డారు. దేశంలో సమస్యలను డైవర్షన్ చేయడానికే రాహుల్ గాంధీని విచారించారని ఆరోపించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రాహుల్ పర్యటిస్తారని తెలిపారు. ఆశేతు హిమాచలం రాహుల్ పర్యటిస్తే బీజేపీ పక్కటెముకలు విరుగుతాయని వ్యాఖ్యానించారు. తక్షణమే రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు వెనక్కి తీసుకోవాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

*సికింద్రాబాద్ ఘ‌ట‌న‌ విచారకరం: మంత్రి errabelli
సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ ఆందోళ‌న ఘ‌ట‌న దుర దృష్ట‌క‌రమని, ఆ ఆందోళ‌న‌లో ఒక‌రు మృతి చెందిన‌ట్లు. ఆ మృతి చెందిన యువ‌కుడు వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండ‌లం ద‌బీర్‌పేట‌కు చెందిన రాకేశ్ గా తేల‌డం, ప‌లువురు గాయ‌ప‌డ‌టం ఆవేద‌న క‌లిగిస్తున్న‌దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యాధికారుల‌ను మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు, క్ష‌త‌గాత్రుల‌కు ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఒక ఆనాలోచిత‌, ఆప‌రిప‌క్వ‌, అసంబ‌ద్ధ ఆలోచ‌న వ‌ల్ల ఈ అన‌ర్థాలు జ‌రుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

*Agnipath Schemeపై కుట్రలు చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
అగ్నిపథ్‌ పథకం పై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని తప్పుబట్టారు. విధ్వంసం సృష్టించాలనే అలజడులు సృష్టించారని మండిపడ్డారు. దేశభక్తి, జాతీయ భావం పెంచే క్రమంలోనే అగ్నిపథ్‌ తెచ్చామని తెలిపారు. అనేక దేశాల్లో అగ్నిపథ్‌ లాంటి పథకాలు ఉన్నాయని గుర్తుచేశారు. నాలుగేళ్ల తర్వాత విధిగా దేశ సేవ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. దేశ సేవ చేయాలనుకున్నవారే అగ్నిపథ్‌లో చేరవచ్చన్నారు. ఇది కంపల్సరీ స్కీమ్‌ కాదని, అగ్నిపథ్‌ అనేది వాలంటరీ స్కీమ్ అని కిషన్‌రెడ్డి తెలిపారు. మోదీ ప్రధాని కాకముందు నుంచే అగ్నిపథ్‌పై దేశంలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అనేక దేశాల విధానాన్ని పరిశీలించాకే అగ్నిపథ్‌ తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ దుర్ఘటన దురదృష్టకరం. ఉదయం నుంచి విధ్వంసం సృష్టిస్తుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. రైల్వేస్టేషన్‌ ఘటన ఉద్దేశపూర్వంగా జరిగిందే. ఘటనలో వ్యక్తి మృతి బాధాకరం. శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి. హింస జరుగుతుంటే రెచ్చగొట్టేలా ఓ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్‌పై అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వచ్చినవారంతా ఏమైనా సైన్యంలో చేరేవారా? వన్‌ ర్యాంక్.. వన్‌ పెన్షన్ అమలు చేస్తున్నాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.

*Jaganవి చావు తెలివితేటలు: చంద్రబాబు
ఈ దిక్కుమాలిన పాలన గురించి పిల్లలకూ అర్ధమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరల పెంపులో జగన్‌ వి చావు తెలివితేటలని మండిపడ్డారు. ఆస్తుల కబ్జాలకు సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌ నుంచి విముక్తి పొందండి.. ఆంధ్రాను రక్షించండి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను డిమాండ్ చేశాకే పోలీసుల టీఏ, డీఏకు నిధులు విడుదల చేశారని తెలిపారు. సారా వ్యాపారం చేసే బొత్స సత్యనారాయణకు విద్యాశాఖా కట్టబెట్టారని విమర్శించారు. అమ్మ ఒడి కాదు.. అర ఒడి కూడా దక్కలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.

*ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పేదలకు మరింత దగ్గరగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నేడు బస్తీ దవాఖానలు ప్రారంభించామన్నారు. దీంతో ఇక్కడి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. బస్తీ దవాఖానల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడంతో పాటు స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందిస్తారన్నారు. అదేవిధంగా టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారని తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం, యోగ లాంటివి చేసి శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలి గిరిజన ప్రజలు మరణించేవారని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వైద్య సేవలు మెరుగుపడ్డాయని, సీజనల్ వ్యాధులు, విష జ్వారాల వల్ల మరణాలను పూర్తి నిరోధించగలిగమని పేర్కొన్నారు.

*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటన దురదృష్టకరం: Revantht
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఈ రోజు జరిగిన ఘటన దురదృష్టకరం. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితం ఇది. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలి’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. కాగా… ‘అగ్నిపథ్‌’ను రద్దు చేయాలంటూ ఈరోజు ఉదయం ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి చేశారు. రైళ్లపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అంతేకాకుండా మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. ప్లాట్‌పాంలపై రాళ్లతో దాడి చేస్తూ పూర్తి ధ్వంసం చేశారు. వేలాదిగా ఆర్మీ అభ్యర్థులు స్టేషన్‌లోకి చొచ్చుకురావడంతో పోలీసులు వారిని అదుపుచేయలేకపోయారు. చివరకు ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు అభ్యర్థులు గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో ఆ వైపుగా రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర నుంచి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఇటు బోయిన్‌పల్లి మదర్ తెరిసా స్టాచ్యూ దగ్గర నుంచి పోలీసులు దారి మళ్లించారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్న అన్ని బస్సులను, అన్ని రోడ్లను బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఒక ఆటో, బస్సు లేకుండా ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు కిలోమీటర్ల మేర నడిచి వెళుతున్నారు.

*వైసీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి: Tulasireddy
వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీనించాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…. ఎక్కడో ఎందుకు? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. నిన్న వేంపల్లె పట్టణంలో ఫర్హాన అనే 28 ఏళ్ల వివాహిత ఇంటిలోనే గొంతు కోసి హత్య చేయబడిందని తెలిపారు. 2020లో పులివెందుల పట్టణానికి చెందిన శివరాని, వీరమ్మ, పెద్ద కుడాల గ్రామానికి చెందిన నాగమ్మ హత్య కావించబడ్డారని అన్నారు. 2021లో నల్లపురెడ్డి పల్లెకు చెందిన పార్థ సారథి రెడ్డి, అగడూరుకు చెందిన కులాయప్ప, కోమనూతల సర్పంచ్ గడ్డం మునెప్ప హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. నాకు, నా కుటుంబానికి ప్రాణ హాని ఉంది. రక్షణ కల్పించండి అని ముఖ్యమంత్రి గారి చెల్లెలు డాక్టర్ సునీత రెడ్డి కడప ఎస్పీకి లేఖ రాసిందని అన్నారు.వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా మారిన దస్తగిరి తన ప్రాణాలను కాపాడండి అని మొర పెట్టుకుంటున్నాడని తెలిపారు. నియోజకవర్గంలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారని, దేవతావిగ్రహాలకు రక్షణ లేదని వ్యాఖ్యానించారు. నియోజవర్గంలో చీనీ చెట్లు, అరటి చెట్లు తదితర పండ్ల తోటలను నరికి ప్రత్యర్ధుల ఆర్థిక మూలాలను దెబ్బతీసే దుష్ట సంస్కృతి పెచ్చు మీరుతోందని ఆందోళన చెందారు. సొంత నియోజవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్ర పరిస్థితి చెప్పతరమా! అంటూ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

*‘అగ్నిపథ్’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణం: VH
సైనికుల నియమకాలలో ‘‘అగ్నిపథ్’’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.డిఫెన్స్ దగ్గర నిధులు లేవంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏమి కావాలని నిలదీశారు. ఇలాంటి విధానాలు బీజేపీ మానుకోవాలని హితవుపలికారు. నేడు దేశం అగ్నిపథ్‌తో అగ్ని గుండంలా మారిందన్నారు. మహమ్మద్ ప్రవక్త పైన బీజేపీ నాయకులు చేసిన ప్రకటనలతో ప్రపంచం ముందు భారత్ పరువు పోయిందని తెలిపారు. ఇవన్నీ దేశ ప్రతిష్టను మంట గలుపుతున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన ప్రధాని మోదీకి పాలించే నైతిక హక్కు లేదని వీహెచ్ వ్యాఖ్యానించారు.

*అప్పు చేసైనా హామీలు అమలు చేయాలి: రఘురామరాజు
‘‘మాట ఇచ్చి తప్పితే రాజకీయాలలో ఉండడానికి అర్హులా? అటువంటి వారికి రాజకీయాలలో కొనసాగే అర్హత ఉందా..? అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి… ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికేౖనా, అప్పు చేసైనా అమలు చేయాలి’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. అనేక హామీలను తమ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని, హోదాను సాధిస్తే ఉద్యోగ విప్లవం వస్తుందని ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగానైనా హోదా ఇస్తేనే మద్దతిస్తామని పేర్కొనాలని సూచించారు. తన నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనతోపాటు ప్రోటోకాల్‌ ప్రకారం సభకు హాజరుకావాల్సి ఉందంటూ తాను రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని షా తన లేఖలో పేర్కొన్నారని రఘురామరాజు వెల్లడించారు.

*రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిదే విజయం: కేఏ పాల్‌
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బరిలో దింపే అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని సూచించారు. తాను ఓడిపోయే వారి పక్షాన ఉండనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించినవారు పోటీ చేయడానికి ఇష్టపడడం లేదన్నారు. తాను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోనని చెప్పారు. మంచి తటస్థ వ్యక్తిని ఎన్డీఏకి సూచించానన్నారు. తనతో పాటు 18 పార్టీలు ‘సేవ్‌ సెక్యులర్‌ ఇండియా కుటమి’లో ఉన్నాయని, సీఎం కేసీఆర్‌తో ఆ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించానని వెల్లడించారు. ‘‘కేసీఆర్‌కి చాలా పార్టీలు దూరంగానే ఉంటున్నాయి. ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదు. అమరవీరుల కుటుంబాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వలేదు. దోపిడీదారులకు మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్‌ వైఫల్యం చెందారు’’ అని పాల్‌ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. కాగా, గ్లోబల్‌ ఎకనమిక్‌ సమ్మిట్‌ ఏర్పాటుకు ప్రధాని మోదీ అంగీకరించారని, త్వరలో తేదీలు వెల్లడిస్తారని స్పష్టం చేశారు. దీనిని హైదరాబాద్‌లో నిర్వహించాలని సూచించానని, అహ్మదాబాద్‌లో వద్దని చెప్పానని అన్నారు.

*అప్పు చేసైనా హామీలు అమలు చేయాలి: రఘురామరాజు
మాట ఇచ్చి తప్పితే రాజకీయాలలో ఉండడానికి అర్హులా అటువంటి వారికి రాజకీయాలలో కొనసాగే అర్హత ఉందా.. అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి… ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికేౖనా అప్పు చేసైనా అమలు చేయాలి అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. అనేక హామీలను తమ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామని హోదాను సాధిస్తే ఉద్యోగ విప్లవం వస్తుందని ఎన్నికలకు ముందు జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగానైనా హోదా ఇస్తేనే మద్దతిస్తామని పేర్కొనాలని సూచించారు. తన నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనతోపాటు ప్రోటోకాల్‌ ప్రకారం సభకు హాజరుకావాల్సి ఉందంటూ తాను రాసిన లేఖకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని షా తన లేఖలో పేర్కొన్నారని రఘురామరాజు వెల్లడించారు.

*కేంద్ర పథకాలకు మోదీ ఫొటో ఉండాల్సిందే-కేంద్రమంత్రి శోభా కరంద్లాజే
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉండాల్సిందేనని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అధికారులకు స్పష్టంచేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా, కలెక్టరేట్‌లో కేంద్ర పథకాల అమలు తీరుపై గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని.. కేంద్ర పథకాలకు సీఎం జగన్‌ సొంత పేర్లు పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటున్నారని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో మంత్రి ఉష శ్రీచరణ్‌, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి ఆయన్ను అడ్డుకుని ఆయనతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని.. కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తున్నా, ప్రజలకు చెప్పడం లేదన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు తెలియజేసే బాధ్యత కలెక్టర్‌దేనని స్పష్టంచేశారు.

*మెడలు వంచుతారా..తల దించుతారా?: లోకేశ్‌
‘‘కేంద్రం మెడలు వంచుతారా? లేక కేసుల మాఫీ కోసం తల దించుతారా?.. చెప్పాలి’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, జగన్‌రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన ఈమేరకు ఓ ప్రకటన చేశారు. ‘‘ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ 2 సెలవిచ్చారు. స్పెషల్‌ స్టేటస్‌ సాధిస్తారని 22 మంది ఎంపీలని ప్రజలు ఇచ్చారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కోసం మీరు పోరాడింది నిజమైతే… ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా?’’ అని లోకేశ్‌ నిలదీశారు.

*రాష్ట్రంలో అరాచక పాలన: కొనకళ్ల
రౌడీయిజం, హత్యా రాజకీయాలు చేస్తూ జగన్‌రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారని మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శించారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురంలో ఇటీవల వైసీపీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం వినుకొండ టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పథకం ప్రకారం జల్లయ్యను హత్య చేయించారని ఆరోపించారు.

*కాంట్రాక్టు వైద్యులకు.. ఐదేళ్ల సడలింపునివ్వాలి: భట్టి
కొత్త నియామకాల్లో కాంట్రాక్టు పద్ధతిలో ప్రస్తుతం పనిచేస్తున్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి కనీసం ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలామంది వైద్యులు, సిబ్బంది కాంట్రాక్టు ప్రాతిపదికన ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారిలో చాలామందికి నిర్ధారిత వయో పరిమితి దాటిందని వివరించారు. ఈ నేపథ్యంలో వారికి ఐదేళ్ల సడలింపు ఇవ్వాలని కోరారు.

*రైతులకు ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలం: పోలంరెడ్డి
రైతులకు ఎరువులు అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాగమాంబాపురంలో స్థానిక నాయకులు శ్రీహరి, గిరి, రంతుల్లా, ప్రసాద్‌లతో కలిసి ఆయన బాదుడే బాదుడులో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టికి ధాన్యానికి 918 కిలోలకు గాను 1100 కిలోలు సేకరించి రైతులను దుర్మార్గంగా దోపిడీ చేశారన్నారు. భూములు, గ్రావెల్‌, ఇసుక, యూరియా మాఫియాలతో ఎమ్మెల్యే ప్రసన్న నియోజకవర్గాన్ని మాఫియాలకు అడ్డాగా మార్చారని దుయ్యబట్టారు. నాగమాంబాపురంలో రైతులు పంట విరామం ప్రకటించడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంవీ.శేషయ్య, బత్తల హరికృష్ణ, హరనాఽథ్‌, కృష్ణచైతన్య, దయాకర్‌రెడ్డి, వెంకటరమణయ్య, శశి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

*రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం: మనోహర్‌
రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన నేత మనోహర్‌ తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాకు కేంద్ర నిధులు వస్తున్నాయని తెలిపారు. రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే స్కామ్‌గా మార్చిందని ఆరోపించారు. కౌలు రైతుల సమస్యలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొని డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రత్యేక హోదా కాకపోతే ప్రత్యేక నిధులు తేవాలని డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానని స్పష్టంగా చెప్పాలని కేంద్రాన్ని కోరామని మనోహర్‌ తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రానికి చెప్పామన్నారు. అమలాపురం ఘటనపై కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాశామని చెప్పారు. అసత్యాలు చెప్పినందుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని మనోహర్‌ డిమాండ్ చేశారు.

*నీకే పథకం ఇవ్వం.. దొబ్బెయ్‌!
కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఒక వృద్ధుడిపై చెలరేగిపోయారు. ‘‘నీకు ఏ పథకాలూ ఇవ్వం..దొబ్బెయ్‌’’ అంటూ బూతుపురాణం మొదలుపెట్టారు. కాకినాడ జిల్లా జగన్నాథపురం ప్రాంతంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సమయంలో తనకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందడం లేదని ఓ వృద్ధుడు ఫిర్యాదుచేశాడు. స్థానిక నేతల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. సమస్య చెబితే చూస్తాను.. చేస్తాను.. అంటూ ఎమ్మెల్యే నుంచి హామీ దొరుకుతుందని ఆయన ఆశించారు. దీనికి భిన్నంగా ద్వారంపూడి చిందులు తొక్కడంతో ఆయన అవాక్కయ్యాడు.

*పోలీస్‌ పోస్టుల రాతపరీక్షల సిలబ్‌సకు ఏ ఒక్క పుస్తకమూ ప్రామాణికం కాదని రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) స్పష్టం చేసింది. ఫలానా పుస్తకాలు చదవమని అభ్యర్థులకు తాము సూచించబోమని వివరించింది. రాతపరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలపై తలెత్తే వివాదాల పరిష్కారానికి పాఠ్యపుస్తకాలను, తెలుగు అకాడమీ పుస్తకాలను తాము పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొంది. ప్రశ్నలపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తే… సబ్జెక్టు నిపుణుల కమిటీని సంప్రదిస్తామని తెలిపింది. అభ్యంతరాల పరిష్కారంలో కమిటీదే తుది నిర్ణయమని పేర్కొంది. ఈ అంశంపై పోలీస్‌ నియామక మండలి అధికారులు స్పందిస్తూ… ‘‘గత నోటిఫికేషన్‌ సమయంలో రాతపరీక్షల్లోని ప్రశ్నలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ, ఇతర పాఠ్యపుస్తకాలను అభ్యర్థులు ప్రామాణికంగా తీసుకుని… కొన్ని ప్రశ్నలకు ప్రాథమిక కీలో తప్పుడు సమాధానాలున్నాయని మా దృష్టికి తీసుకువచ్చారు. కొందరు హైకోర్టుకూ వెళ్లారు. ప్రశ్నలపై అభ్యంతరాలను పరిష్కరించేందుకు విషయ నిపుణులతో కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ కమిటీ సూచించిన సమాధానాన్నే పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో సిలబ్‌సకు ఎలాంటి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోబోం’’ అని తెలిపారు.

*తెలంగాణలో బీమా పథకం ఏమైందో చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రంలో బీమా పథకం ఏమైందో చెప్పాలని బీజేపీ నేత విజయశాంతి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతుల సంక్షేమంపై లేదని విమర్శించారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్రం మీద కక్షతో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారని దుయ్యబట్టారు. గురువారం ఆమె సోషల్ మీడియా వేదికగా కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..‘‘కేసీఆర్ రాజ‌కీయ‌లు త‌ప్ప.. ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చేది ఒక్క‌టి కూడా చేయ‌డం లేదు. ఆయన అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అన్నదాత‌లు అరిగోస‌లు ప‌డుతూనే ఉన్నరు. సీఎం సారుకు జాతీయ రాజ‌కీయ‌ల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదు. తాజాగా పునాసల సీజన్‌‌‌‌ షురువైనా పంటల బీమా అమలుపై కేసీఆర్ స‌ర్కార్ ఎటూ తేల్చడం లేదు. ఈ సీజన్లో మే 5 నాటికే విడుదల కావాల్సిన పంటల బీమా నోటిఫికేషన్ ఇప్పటికీ రాలేదు. గ‌త రెండేండ్లుగా ఫసల్ బీమా యోజనను కేసీఆర్ స‌ర్కార్ అమలు చేయడం లేదు. బెంగాల్ తరహాలో మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా పంటల బీమా పథకం తెస్తమని చెప్తున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. దీంతో పంటలకు బీమా లేక… అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా మన రైతులు నష్టపోతున్నరు.