వివాహ బంధం నుంచి వేరుపడేందుకు మరో సంపన్న జంట సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు, దిగ్గజ సెర్చ్ఇంజిన్ గూగుల్ (Google) సహ-వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (Sergey Brin), ఆయన భార్య నికోల్ షనాహన్లు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి సెర్జీ బ్రిన్ ఈ నెలలో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, గత మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులు పొందిన మూడో జంట కావడం గమనార్హం.
గూగుల్ సహ-వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ (49), నికోల్ షనాహన్ (37)లు 2018లో ఒక్కటయ్యారు. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే, విరుద్ధమైన అభిప్రాయాలు కలిగిన వీరు పరస్పరం విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, హై ప్రొఫైల్ కేసు కావడం, వీరి విడాకులపై ప్రజల్లో ఆసక్తి ఉండడం, చిన్నారి కస్టడీ గురించిన వివరాలు బయటకు వెళ్లే ఆస్కారం ఉన్న నేపథ్యంలో విడాకుల విషయంపై పూర్తి గోప్యత పాటించేందుకు ఈ జంట చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక న్యాయమూర్తిని (Private Judge) ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.
సెర్జీ బ్రిన్ అంతకుముందే మరో మహిళ నుంచి విడిపోయారు. 23అండ్‌మీ (23andMe) సంస్థ సహ వ్యవస్థాపకురాలు అన్నే వొజిస్కీని 2007లో వివాహం చేసుకున్న ఆయన.. 2015లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం షనాహన్‌తో సహజీవనం సాగించిన సెర్జీ బ్రిన్.. 2018లో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు ఇద్దరు సంతానం కాగా షనాహన్కు మూడేళ్ల కూతురు ఉంది. అయితే, మనస్పర్ధల కారణంగా 2021 నుంచి ఇరువురు వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం.
ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన గూగుల్‌ను లారీ పేజ్‌తో కలిసి సెర్జీ బ్రిన్ 1998లో స్థాపించారు. అనంతరం దానిని ఆల్ఫాబెట్ (Alphabet Inc.) కంపెనీగా మార్చారు. అయితే, 2019లో సెర్జీతోపాటు లారీ పేజ్ కూడా ఆల్ఫాబెట్ నుంచి బయటకు వచ్చారు. అయినప్పటికీ వారికి అందులో షేర్లు ఉన్నందున ఆ సంస్థ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం, సెర్జీ బ్రిన్ సంపద 94బిలియన్ డాలర్లు (సుమారు రూ.7లక్షల కోట్లు).
ఇదిలాఉంటే, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్(Bill Gates)-మిలిందా దంపతులు కూడా ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ (Jeff Bezos)- మెకంజీ స్కాట్లు విడాకులు తీసుకున్నారు. అయితే, విడాకుల సమయంలో ఈ కుబేరులు భారీ స్థాయిలో భరణాన్ని సమర్పించుకున్నారు. వారి సంపదలో ఎంత మొత్తం చెల్లించారనే విషయాన్ని కూడా వెల్లడించారు. అయితే, ప్రస్తుతం సెర్జీ బ్రిన్ జంట ప్రైవేటు న్యాయమూర్తిని ఎంపిక చేసుకోవడంతో విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు తెలిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.