DailyDose

లక్ష కోట్లకు చేరువలో పశు సంపద

లక్ష కోట్లకు చేరువలో పశు సంపద

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే మరో మైలురాయిని అధిగమించనున్నది. రాష్ట్రంలోని పశు సంపద మొత్తం విలువ రూ.లక్ష కోట్లకు చేరువలో ఉన్నది. రాష్ట్రంలో 2013-14లో రూ.24,878 కోట్లుగా ఉన్న పశు సంపద విలువ 2021-22 నాటికి రూ.94,400 కోట్లకు పెరిగింది. అంటే ఎనిమిదేండ్లలో రూ.69,522 కోట్ల విలువైన పశుసంపద వృద్ధి చెందింది. స్వరాష్ట్రంలో 79.45 శాతం వృద్ధి నమోదైంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో, స్థూల ఆదాయంలో పాడి సంపద కీలక పాత్ర పోషించింది. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రంలో పశు సంపదతోపాటు పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ పథకాలు ఇందుకు దోహదం చేశాయి. మాంసం ఉత్పత్తి, వినియోగంలోనూ తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

ఫలితమిచ్చిన గొర్రెల పంపిణీ
కులవృత్తులకు అండగా నిలవడంతో పాటు మాంసం ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రంలో 2012లో 1.28 కోట్ల గొర్రెలు ఉండగా 2019లో వాటి సంఖ్య 1.91 కోట్లకు పెరిగింది. గొర్రెల పంపిణీ పథకం కారణంగా గొర్రెల సంఖ్య 63 లక్షలు పెరగడం విశేషం. గొర్రెల సంఖ్య పెరుగుదలలో 49.21% నమోదైంది. గత ఫిబ్రవరి నాటికి 3.88 లక్షల మంది లబ్ధిదారులకు 81.60 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. గొర్రెల పంపిణీతో పాటు ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల కారణంగా మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2013-14 లో 4.46 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా 2021-22 నాటికి 10.15 లక్షల టన్నులకు పెరిగింది.

చేపల సవ్వడి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేపల ఉత్పత్తి 2.49 లక్షల టన్నుల నుంచి 3.89 లక్షల టన్నులకు పెరిగింది. గుడ్ల ఉత్పత్తి కూడా 1,006 కోట్ల గుడ్లు నుంచి 1,725 కోట్లకు ఎగబాకింది. పాల ఉత్పత్తిలోనూ 44.97 శాతం వృద్ధి నమోదైంది. 2013-14లో 42.07 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి కాగా 2021-22 నాటికి 60.99 లక్షల టన్నులకు పెరిగింది.