DailyDose

అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చు – TNI తాజా వార్తలు

అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చు –  TNI  తాజా వార్తలు

*అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని‌వీర్‌లో ఒకసారి పని చేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికి నష్టం జరగదన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌‌లు ఇచ్చేనందుకు వచ్చిందన్నారు. అగ్నివీరులకు విద్య , ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌‌పై రాజకీయం చేయొద్దన్నారు. ప్రతి ఒక్కరు అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు.

*తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆల‌య మ‌హాసంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మంత్రి ,టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డితో కలిసి తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.ఈ నెల 23న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ,మహా సంప్రోక్షణ ఆవాహన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎంకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు.
అనంతరం టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రాన్ని సీఎంకు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

*అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో కూడా అగ్నివీర్‌ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌.. ఈనెల 24న ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

* తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. జ్వరం కారణంగా నేటి అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి. శనివారం రాత్రి నుంచి ఆయనకు జ్వరం రావటంతో వైద్యులు పరిశీలించి రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ముందుగా ప్రకటించిన మేరకు స్టాలిన్‌.. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాల్లో సోమవారం పర్యటించాల్సి ఉంది. ఆయన పర్యటించే తేదీలను త్వరలో ప్రకటిస్తారని అధికారులు తెలిపారు.

*యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన తీస్ మార్ ఖాన్ సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్.. ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయి కుమార్ నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు.

* ఆన్లైన్‌లో టిక్కెట్ల విక్రయంపై ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో సినిమా థియేటర్లు, ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. టిక్కెట్ల ఆన్లైన్ విక్రయాల కోసం ఎంవోయూ‌పై సంతకాలు చేయాలని ప్రభుత్వం ఎగ్జిబిటర్‌లపై ఒత్తిడి చేస్తుంది. అయితే టికెట్ విక్రయాల డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియకుండా.. సంతకాలు చేయమని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ఆన్లైన్ విక్రయ సంస్థల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటు సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్ రద్దు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా చిలకలూరిపేట‌లో ఐదు ఏసీ థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై కోర్టుకు వెళ్లడం లేదా థియేటర్లను మూసివేయడమే తమ ముందున్నమార్గమని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

*నిత్యం యోగా సాధన చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగాడే సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మైండ్,బాడీని ఫిట్ గా వుంచేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. యోగసాధన వల్ల కలిగే ప్రయోజనాలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా వుండచ్చన్న విషయాన్ని తెలిపేందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రకటించడంలో కీలక పాత్రపోషించారన్నారు.భారతీయ సంస్క`తిలోనే యోగా ఒక భాగంగా వుందన్నారు. శారీరక, మానసిక పటిష్టానికి యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మానసిక స్థతిని సమన్వయం చేయడం, శరీరాన్ని, ఆత్మను యోగా ద్వారా మన ఆదీనంలో వుంచుకోవచ్చని అన్నారు. యోగా ఫర్ హుమానిటీగా థీమ్ గా 2022 సంవత్సరం యోగాడేను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసును రైల్వే పోలీసులు సిట్‌కు బదిలీ చేశారు. ఈ అల్లర్లలో 16 ప్రైవేట్‌ కోచింగ్ సెంటర్ల పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరులోని పలు కోచింగ్‌ సెంటర్లపై పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసం వెనక ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీ ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ ఆవుల సుబ్బారావు పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. కాగా ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును.. తెలంగాణ పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడులకు పాల్పడినవారు సాయి అకాడమీకి చెందినవారిగా గుర్తించారు. వాట్సాప్‌ చాటింగ్‌, గ్రూప్స్, కాల్ రికార్డింగ్స్‌లో.. సుబ్బారావు పాత్రపై ఆధారాలున్నా ఎందుకు వదిలేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

*సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ను అదుపులోకి తీసుకోలేదని జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. భారత్ బంద్ బందోబస్తులో భాగంగా సోమవారం ఉదయం నరసరావుపేట రైల్వే స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైల్వేస్టేషన్‌పై దాడి ఘటనలో సుబ్బారావును ప్రశ్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని చెప్పారు. యూపీ పోలీసులు సుబ్బారావును విచారించారనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.

*ప్రకాశం: జిల్లాలోని రైల్వే స్టేషన్ల వద్ద పోలీసు భద్రత కొనసాగుతోంది. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద అధికారులు భద్రత పెంచారు. ఒంగోలు, చీరాల, సింగరాయకొండ, మార్కాపురం, గిద్దలూరు, దొనకొండ రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల వద్ద అనుమానితులపై ఆరా తీస్తున్నారు.

*గుంటూరు(Guntur) జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ(YCP) నేతల మట్టి దోపిడి నిరసిస్తూ నేడు చలో అనుమర్లపూడి కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ(TDP) నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ కుమార్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిరాల మ్యానీలు హౌస్ అరెస్ట్ చేశారు. చలో అనమర్లపూడి నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అనమర్లపూడిలో భారీగా పోలీసులు మోహరించారు. అనమర్లపూడి వెళ్లే రోడ్లలో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.

*ఎన్టీఆర్: జిల్లాలోని తిరువూరులో Bharath bandh ప్రభావం కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు, హోటళ్ళు యధావిధిగా తెరుచుకున్నాయి. అలాగే రోడ్లపై ఆర్టీసీ బస్సులు యదేచ్ఛగా తిరుగుతున్నాయి. బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు నిరసనగా పలు రాష్ట్రాలలో భారత్ బంద్‌కు ఆర్మీ అభ్యర్థులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

*బద్వేలు మండలం వల్లువారిపాలెం కొండల్లో తేనె(Honey) కోసం వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. కడప(Kadapa) జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు పొంగడంతో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారు ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామానికి చెందిన రమేష్, వెంగయ్యలుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు.

*ఏలూరు: జిల్లాలోని గుండుగొలను సమీపంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దెందులూరు మండలం సింగవరం పరిధి గుండుగోలను వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 నుంచి 40లోపు ప్రయాణికులు ఉన్నారు. బస్సు రాజాం నుండి గుంటూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే దెందులూరు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న భీమడోలు ఎస్‌ఐ చావా సురేష్ ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారు 108 అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారని ఎస్‌ఐ తెలిపారు.

*కర్నూలు: జిల్లాలోని ఆదోని పట్టణంలో మాతా శిశు ఆసుపత్రి దగ్గర 108 అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్‌పై కొందరు యువకులు దాడి చేశారు. అంబులెన్స్‌కు అడ్డుగా ఉన్న స్కూటర్ తీయాలంటూ అంబులెన్స్ డ్రైవర్ అడగటంతో… గౌళీ పేటకు చెందిన యువకులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్, టెక్నీషియన్ ప్రస్తతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

*శ్రీశైలం అటవీ ప్రాంతంలో అరుదైన పక్షిని ఆ శాఖ రేంజర్ మహమ్మద్ గుర్తించారు. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నల్లమలలో కొంతకాలంగా పక్షులు జంతువుల పరిశోధన చేస్తున్నామని ఫారెస్ట్ రేంజర్ మహమ్మద్ తెలిపారు. నల్లమలలో అరుదైన చుక్కలపొట్ట గద్ద ఆకారపు గుడ్లగూబను అడవి ప్రాంతంలోని తమ కెమెరాలో బంధించామన్నారు. సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజర్ మహమ్మద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ఈ పక్షిని కనుగొన్నట్లు అటవీశాఖ బయోడైవర్షటి సైన్స్ ల్యాబ్ రేంజర్ మహమ్మద్ వెల్లడించారు.

*శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామంలో దాదాపు ఏడుగురిపై ఎలుగుబంటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానికులు పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఎలుగుబంటి దాడులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

*కడప: జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడీపీ(TDP) నేతలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. పంటల బీమాలో రైతులకు అన్యాయం జరిగిందని తెలుగు దేశం శ్రేణులు నిరసన చేపట్టారు. పులివెందులకు చెందిన టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా ఒక వర్గానికి మాత్రమే పంటలబీమా వర్తింపచేసిందని.. అర్హులందరికీ న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. కాగా… కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తున్న టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షులు లింగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి సోమవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వకుళమాత ఆలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఈ నెల 23న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నెల 18 న అంకురార్పణంతో మొదలై 23 వరకు వివిధ రకాల పూజా కార్యక్రమాలు, 23 న మహా సంప్రోక్షణ ఆవాహన, ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రాన్ని సీఎంకు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.

* రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అత్యవసర సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పార్లమెంట్‌ భవనంలోని రూం నెం. 25లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలోని ఎంపీలంతా సమావేశం కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. అధికార పార్టీకి పోటీగా ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్ సహా దేశంలోని అనేక పక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ తమ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయలేదు.

*సెంట్రల్ జైలులోని 12 మంది ఖైదీలు బోర్డు పరీక్షలు పాస్ అయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సెంట్రల్ జైలులో వెలుగుచూసింది.ఆగ్రా సెంట్రల్ జైలులో ఉన్న 12 మంది ఖైదీలు వార్షిక 10వ తరగతి, 12వ తరగతి యూపీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని జైలు అధికారులు తెలిపారు.‘‘10వ తరగతిలో ముగ్గురు ఖైదీలు ఫస్ట్ డివిజన్ ర్యాంక్ సాధించారు,మరో ఆరుగురు ఖైదీలు సెకండ్ డివిజన్ ర్యాంక్ పొందారు. అంతేకాకుండా 12వ తరగతిలో ముగ్గురు ఖైదీలకు సెకండ్ డివిజన్ వచ్చింది అని జైలు సీనియర్ సూపరింటెండెంట్ వికె సింగ్ చెప్పారు. 10వ తరగతిలో జితేంద్ర అనే ఖైదీ 64.83 శాతం మార్కులు సాధించగా, అర్జున్‌, షీలేష్‌లు వరుసగా 63.16, 62.83 శాతం మార్కులు సాధించారు.

*అగ్నివీర్‌ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ఫై ర్ అయ్యారు. అగ్నిపథ్‌తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్‌లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని.. మరో బీజేపీ నేత చెప్పారన్నారు. పీఎం మోదీ ని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తున్నారా? అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ను తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మోదీ-ఆదానీ అవినీతిపై.. శ్రీలంక ఆరోపణల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని తన ట్వీట్‌లో కేటీఆర్ ఆరోపించారు.

*సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ఆ దిశగా ముందుకువెళ్లకుండా ఎవరో పిరికిమందు నూరిపోస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.అస్కార్‌ రావు అన్నారు. విశాఖలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ రిస్టోర్‌కు మినహా మరే ప్రత్యామ్నాయానికి అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. నవరత్నాల అమల్లో కీలకంగా ఉన్న ఉద్యోగులను పదో రత్నంగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 137 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్నచోట పీఈటీ, ప్రధానోపాధ్యాయుడు పోస్టులను రద్దు చేయడం వల్ల విద్యా వ్యవస్థ బలహీన పడుతుందన్నారు. 117 జీవో రద్దుకు ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనలకు తాము మద్దతిస్తున్నామని తెలిపారు. అలాగే డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ అధికారాలకు కోత విధించి జాయింట్‌ కలెక్టర్లకు అధికారాలను కట్టబెట్టేలా ఇచ్చిన జీవో 64ను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

* మూడేళ్లకు బార్లు పెట్టుకునేందుకు జగన్‌ సర్కార్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, సెప్టెంబరు 1 నుంచి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ డిమాండ్‌ చేశారు. ఆదాయం, అప్పుల కోసం మద్యం అమ్మకాలు పెంచి, మహిళల మాంగల్యాలు తెంచుతారా? అని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. మద్యంపై వచ్చే 15ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చి, రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని, చేయనందుకు మహిళలందరికీ సీఎం క్షమాపణ చెప్పాలని ఆదివారం ఓ ప్రకటనలో రఫీ డిమాండ్‌ చేశారు.

*ఈ ఏడాది యాసంగిలో రైతుల నుంచి 5 మిలియన్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు 9లక్షల మందిపైగా రైతులకు రూ.9,726 కోట్లను చెల్లించినట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోలు దాదాపు మూడొంతులు తగ్గింది. రాష్ట్ర సర్కారు 2020-21 సీజన్‌లో 21 లక్షల మంది రైతుల నుంచి 14.1 మిలియన్‌ టన్నుల ధాన్యాన్ని కొని, రూ.26,601 కోట్లు చెల్లించింది. మొత్తమ్మీద ఏడేళ్లలో రూ.98 వేల కోట్ల విలువైన 55 మిలియన్‌ టన్నుల పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

*కేంద్ర ఆర్థిక శాఖ అనవసర ఖర్చులను తగ్గించడంపై దృష్టి సారించింది. పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు పలు సూచనలు చేసింది. ఉద్యోగులు పర్యటనలు, ఎల్టీసీలకు వెళ్లే సమయంలో అతి తక్కువ ధరకు దొరికే విమాన టికెట్లను ఎంచుకోవాలని స్పష్టం చేసింది. ఉద్యోగులకు కేటాయించిన ప్రయాణ శ్రేణిలో కనీసం మూడు వారాల ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఆఫీస్‌ మెమోరాండం జారీ చేసింది. ఉద్యోగులు తమకు కేటాయించిన పర్యటనకు ఒక్క టికెట్‌ మాత్రమే బుక్‌ చేయాలని, పర్యటన ఆమోద దశలో ఉన్నా బుకింగ్‌ చేసుకోవచ్చని సూచించింది.

*రాష్ట్రంలో కొత్తగా మరో 236 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 19,715 కరోనా టెస్టులు చేశారు. పాజిటివ్‌ కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 180 వచ్చాయి. మేడ్చల్‌లో 13, రంగారెడ్డిలో 28, సంగారెడ్డిలో ఐదు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,026కు చేరుకుంది.

* సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. రైల్వే కేసుల్లో శిక్ష పడ్డవారికి భవిష్యత్‌లో ప్రభుత్వోద్యోగాలు రావని స్పష్టం చేశారు. సుమారు 2 వేల మంది ఆందోళనకారులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారని, వారిని కొందరు రెచ్చగొట్టారని వివరించారు. ఈ నెల 17న జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు రైల్వేస్టేషన్‌ మూడో గేటు నుంచి 300 మంది దాకా వచ్చారని, వారి చేతుల్లో కర్రలు, రాడ్లు ఉన్నట్లు, కొందరు పెట్రోల్‌ బాటిళ్లతో వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా ఉందని తెలిపారు. ‘‘9.30కల్లా మొత్తం 2 వేల మంది జమయ్యారు.

*‘‘రోడ్డు ప్రమాదంతో ఏడాది కాలంగా చికిత్స పొందుతున్నా. వైద్య బిల్లులు చెల్లించలేకపోతున్నాను. నేను ఆత్మహత్య చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి’’ అని కోరుతూ ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు ట్వీట్‌ చేశాడు. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన శ్రీరామ్‌జీ శర్మ అనే వ్యక్తి రాయ్‌పూర్‌లో ఇంటీరియర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. నిరుడు తన స్నేహితుడిని విమానం ఎక్కించేందుకు స్కూటీపై రాయ్‌పూర్‌ విమానాశ్రయానికి వెళ్లారు. తిరిగి వెళ్తున్న సమయంలో వాహనం జారిపడడంతో శర్మ గాయపడ్డారు. ఆయన కాలు, చేయి ఫ్ర్యాక్చర్‌ అయ్యాయి. బాధితుడు రాయ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కొద్ది కాలానికే ఆయన కాలు, చేయి పనిచేయడం ఆగిపోయింది. దీంతో స్నేహితుల సలహా మేరకు హైదరాబాద్‌ నగరానికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. గాయాలైన చోట ఎముకలు దెబ్బతిన్నట్లు తేలడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా రావడంతో దానికీ బాధితుడు చికిత్స తీసుకుంటున్నారు.

*రుణాల చెల్లింపుల్లో ముందంజలో ఉండే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఇళ్లకు సౌర విద్యుత్తును అందించేందుకు స్త్రీనిధి సంస్థ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఐకేపీ ద్వారా సంప్రదాయేతర ఇంధన వనరులను మరింత చేరువ చేసే దిశగా స్త్రీనిధి రుణం ద్వారా మహిళలు వారి గృహాల్లో సోలార్‌ విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేసుకునే చర్యలు చేపట్టనుంది. నిబంధనల ప్రకారం అర్హులకు, ఆసక్తి ఉన్నవారికి టీఎస్‌ రెడ్కో సబ్సిడీ రూ.60 వేలు పోను 3 కేవీ సోలార్‌ యూనిట్‌ ఏర్పాటుకు రూ.1.30 లక్షలు స్త్రీ నిధి రుణంగా ఇస్తారు. ఈ యూనిట్‌తో విద్యుత్తు చార్జీల భారం తగ్గించుకునే అవకాశముంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల సమాఖ్యల ద్వారా దీనిపై అవగాహన కల్పించేందుకు అధికారులు దృష్టిసారించారు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సంస్థ (టీఎస్‌ రెడ్కో) లబ్ధిదారుల గృహాల్లో సోలార్‌ విద్యుత్తు యూనిట్‌ పరికరాలను ఏర్పాటు చేయనుంది. రెడ్కో గతంలో బ్యాంకు రుణాలందుకున్న వారికి, నగదుతో కొనుగోలు చేసిన వారికి మాత్రమే సోలార్‌ విద్యుత్తు ప్లేట్లను అందజేసేది. తొలిసారి మహిళా సంఘాలకు రారుతీపై అందించేందుకు సిద్ధమైంది. తొలివిడత రూ.39 కోట్ల లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల యూనిట్ల ఏర్పాటుకు స్త్రీ నిధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది.

*రాష్ట్రంలో పట్టణాల్లో నివసించే జనాభా పెరుగుతోంది. 2025 నాటికి 50శాతం మంది జనాభా పట్టణాల్లోనే జీవించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణ జనాభా శాతం 46.8గా ఉంది. ఈ విషయంలో తమిళనాడు, కేరళ తర్వాత… తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. నీతి ఆయోగ్‌ ఆదివారం ఈ వివరాలను వెల్లడించింది. నగరాలు, పట్టణాల అభివృద్ధిని ఆర్థిక వృద్ధికి గ్రోత్‌ ఇంజిన్లుగా నీతి ఆయోగ్‌ భావిస్తోంది. ప్రజలకు జీవనోపాధిని అందించడంలో పట్టణాలు ముందంజలో ఉంటున్నట్టు ఇటీవల నీతి ఆయోగ్‌ పేర్కొంది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన పట్టణ జనాభా వివరాలను వెల్లడించింది. నీతి ఆయోగ్‌ ప్రకారం… 2014లో రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల పట్టణాల్లో మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలను 142కి పెంచింది.

* అమూల్య పదనిధితో తెలుగు భాషను సుసంపన్నం చేసి, తన స్వరార్చనతో వేంకటేశ్వరుడి మహత్తుని లోకానికి చాటిన అన్నమయ్య.. తిరుమల కొండపై నివసించిన ఇంటిని కూల్చివేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఘోరమైన అపచారానికి పాల్పడిందని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, సనాతన సమధర్మ ప్రచార పరిషత్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీశ్రీశ్రీ విజయ శంకరస్వామి అన్నారు. కూల్చిన ప్రదేశంలోనే అన్నమయ్య ఇంటిని పునర్నిర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అన్నమయ్య గృహ సాధన సమితి పేరుతో ఆధ్యాత్మిక ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. వీరిలో.. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌, ఎంపీలు గురుమూర్తి, సంగంలాల్‌ గుప్తా, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి, చిట్టిబాబు, ఇషా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ స్వాతి సాంఘీ ఉన్నారు.

*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, ఎంపీలు గురుమూర్తి, సంగం లాల్‌ గుప్తా, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, చిట్టిబాబు, ఇషా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ స్వాతి సాంఘీ, టీటీడీ మాజీ సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు.

*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. ఆదివారం సందర్భంగా గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం సత్యనారాయణవ్రతం ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

*ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. బ్యాంకుల పనితీరును, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలులో సాధించిన పురోగతిని ఈ సమావేశంలో ఆమె సమీక్షిస్తారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో బడ్జెట్‌ ప్రతిపాదించిన తర్వాత జరుగుతున్న తొలి సమీక్షా సమావేశం ఇదే.

*భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) జారీ చేసే సార్వభౌమ పసిడి బాండ్స్‌ (ఎస్‌జీబీ)కు కొవిడ్‌ సమయంలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. పెట్టుబడుల విలువ రక్షణ కోసం అసలుకు ఢోకా లేని ఈ బాండ్స్‌ను మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. పథకం ప్రారంభమైన 2015 నవంబరు నుంచి ఇప్పటివరకు వరకు 90 టన్నుల బంగారానికి సమానమైన సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ) జారీ చేయడం ద్వారా ఆర్‌బీఐ రూ.38,693 కోట్లు సమీకరించింది. ఇందులో 75 శాతం (రూ.29,040 కోట్లు) పెట్టుబడులు గత రెండేళ్లలో వచ్చాయి. ఎనిమిదేళ్ల కాలపరిమితి ఉండే ఎస్‌జీబీల నుంచి మదుపరులు ఐదేళ్ల తర్వాత తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. చివరి వరకు ఉంటే పెట్టుబడి లాభాలతో పాటు ఏటా కొంత వడ్డీ ఆదాయం లభిస్తుంది.

*ఉపాధ్యాయుల పునర్విభజన జీవో 117ను ఉపసంహరించుకోకపోతే వేలాది పోస్టులు రద్దవుతాయని, దానివల్ల విద్యావ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు. జీవో 117ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే మున్సిపల్‌ టీచర్ల బదిలీల షెడ్యూలు వెంటనే విడుదల చేయాలని కోరారు.

*తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మన్నం శ్రీనివాస్‌ ఎన్నికైనట్లు ఆ సంఘం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సీహెచ్‌.పినాకపాణి, గౌరవాధ్యక్షులుగా బి.రమే్‌షబాబు ఎన్నికయ్యారని వివరించింది.

*ఉపాధ్యాయుల పునర్విభజన జీవో 117ను ఉపసంహరించుకోకపోతే వేలాది పోస్టులు రద్దవుతాయని, దానివల్ల విద్యావ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు. జీవో 117ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే మున్సిపల్‌ టీచర్ల బదిలీల షెడ్యూలు వెంటనే విడుదల చేయాలని కోరారు.

*ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు బోధనా సిబ్బందికి సంబంధించిన కాంట్రాక్టు నిర్వహణ/అగ్రిమెంట్‌ బాండ్ల ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్రంలోని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్‌ నరసింహారావు ఆదేశాలిచ్చారు..

* సిమ్‌ కార్డులు, ఇంటర్నెట్‌ కనెక్షన్ల మాదిరిగానే కరెంటును కూడా మనకు నచ్చిన కంపెనీ నుంచి కొనుక్కునే రోజులు రాబోతున్నాయి..! ఈ దిశగా… విద్యుత్‌ పంపిణీ (డిస్కమ్‌) వ్యవస్థలో లైసెన్స్‌ రాజ్‌ను తొలగించడానికి కేంద్రం వడివడిగా అడుగులేస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే జూలై నెలాఖరులో జరిగే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోనే విద్యుత్‌ చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును ప్రవేశపెడతామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ప్రకటించారు. పంపిణీ వ్యవస్థలో పోటీని ప్రోత్సహించడం దీని ఉద్దేశమని ఆయన తెలిపారు. గురువారం ఢిల్లీలో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ‘ఇండియా ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ సమిట్‌-2022’లో ఆయనీ విషయం వెల్లడించారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు (2021)ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది.

*తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు సింగపూర్‌లోని సివిల్‌ సర్వీసెస్‌ క్లబ్‌ టేసన్‌ సోన్‌లో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయ. రాష్ట్ర మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్‌ జవహర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ సాధించిన ఘన విజయాల గురించి వివరించారు. తెలుగుజాతి అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనలో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రతిరోజూ దాడులు, దారుణాలు, సామాజిక పరిస్థితులపై సింగపూర్‌లోని ప్రవాసాంధ్రులు ఆందోళన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

*మాజీ మంత్రి అయ్యన్న ఇల్లు కూల్చివేత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యేనని టీడీపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా ఆదివారం నగరంలోని సెవెన్‌హిల్స్‌ జంక్షన్‌లో సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం స్థానికంగా ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ ప్రశ్నించారు. బీసీ నేత అయ్యన్నపాత్రుడుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అని అన్నారు. టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత నాయకులు ప్రణవ్‌ గోపాల్‌, ఈతలపాక సుజాత, ఆరేటి మహేశ్‌, యల్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

*ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను రెండవ రోజు ఆదివారం కూడా కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర జలశక్తి సంఘం (సీడబ్ల్యుసీ) సభ్యుడు కె.వోరా సారఽథ్యంలో సభ్యులు కుడి ప్రధాన కాల్వ పనులలో కీలకమైన హెడ్‌ రెగ్యులేటర్‌, ఇ, ఎఫ్‌ శాడిల్‌ డ్యాంలను, దేవరగొంది-చేగొండపల్లి గ్రామాల నడుమ కొండలను తొలిచి నిర్మించిన జంట గుహలను, పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ కనెక్టివిటీలో కీలకమైన మామిడిగొంది, తోటగొంది జంట గుహలను పరిశీలించారు. తోటగొంది సమీపంలో నిర్మించిన కుడి ప్రధాన కాల్వ రెగ్యులేటర్‌, స్టోరేజ్‌ పాయింట్లు, పట్టిసీమ డెలివరీ చానల్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.