DailyDose

తెలంగాణకు పట్టణ కళ

తెలంగాణకు పట్టణ కళ

పట్టణీకరణలో తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఎంతగా అంటే.. 2025 నాటికి తెలంగాణ పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నీతిఆయోగ్‌ వెల్లడించింది. ఇక్కడ పట్టణీకరణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెండున్నర దశాబ్దాల ముందున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదిక వివరాలను విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలోని పట్టణ జనాభా జాతీయ సగటు మొత్తం జనాభాలో 31.16 శాతంగా ఉండగా.. తెలంగాణ మొత్తం జనాభాలో 46.8 శాతంగా నమోదైంది. ఈ అంశంలో తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. పట్టణీకరణ వేంగంగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు మొత్తం జనాభాలో సగటున 48.45 శాతం పట్టణ జనాభాను నమోదు చేస్తే, కేరళలో 47.23 శాతంగా నమోదైంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర 45.23 శాతంతో ఉంది. కాగా, వచ్చే మూడేళ్లలో తెలంగాణ పట్టణ జనాభా తమిళనాడు, కేరళను దాటి తొలి స్థానానికి చేరుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది.

రాష్ట్ర జీడీపీలో మూడింట రెండొంతుల వాటా పట్టణాల్లోనే
పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే ఆర్థిక కార్యకలాపాల ప్రభావంతో ఉపాధి, ఆదాయ స్థాయిలు అధికంగా ఉంటాయని నీతి ఆయోగ్‌ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సంఖ్యను 142కు పెంచారు. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల్లో మౌలికవసతులు మెరుగుపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు అధికంగా జరగడంతో రాష్ట్ర జీడీపీలో మూడింట రెండు వంతుల వాటాను పట్టణాలే అందిస్తున్నాయి.

పట్టణ ప్రాంతాలలో విద్య, ఉపాధి అవకాశాలు, మంచి జీవన స్థితిగతులు ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షించడానికి కారణమవుతున్నాయి. ఆరు సంవత్సరాలుగా ‘జీవన నాణ్యత సూచిక‘లో దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ గుర్తింపు పొందింది. పట్టణ ప్రాంతాలలో జనాభా పెరుగుదల రాష్ట్రాన్ని పట్టణీకరణలో ప్రధాన సాధకంగా మారుస్తుండగా,

2025 నాటికి తెలంగాణ రాష్ట్రం యాభై శాతం పట్టణ జనాభా పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అంచనా వేశారు. 2050 నాటికి దేశంలో ఇదే తరహా పట్టణీకరణ ప్రక్రియ సాగుతుందని, తద్వారా తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రెండున్నర దశాబ్దాలు ముందుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ అన్ని రకాల ప్రమాణాల్లో మేటిగా ఉండటం కూడా రాష్ట్రం పట్టణీకరణలో ముందుండడానికి కారణంగా చెపుతున్నారు.

అన్ని సూచికల్లో హైదరాబాద్‌ టాప్‌
దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ నగరం అన్ని సూచికల్లో అగ్రభాగాన కొనసాగుతోంది. కొనుగోలు శక్తి సూచిక, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయం, ఆస్తి ధర మొదలు ఆదాయ నిష్పత్తి, ట్రాఫిక్‌ ప్రయాణ సమయం, కాలుష్యం/వాతావరణ సూచికలో హైదరాబాద్‌ నగరం ముందంజలో ఉంది. ఇటువంటి పలు అంశాలతో హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోని ముప్పై ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలిచిందని నీతి ఆయోగ్‌ పేర్కొంది.