గల్ఫ్ దేశం కువైత్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. మడగాస్కర్, కామెరూన్, ఐవరీ కోస్ట్, ఘనా, బెనిన్, మాలి, కాంగోతో సహా దాదాపు 10 దేశాలకు అన్ని రకాల వీసాలను నిషేధించే ప్రతిపాదనను ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రస్తుతం పరిశీలిస్తోంది. వీటిలో ఎక్కువ దేశాలు ఆఫ్రికాకు చెందినవి ఉన్నాయి. ఈ 10 దేశాల్లో కొన్ని దేశాల దౌత్యకార్యాలయాలు కువైత్‌లో లేవు. కానీ, ఆయా దేశాలకు చెందిన జాతీయులు వేల సంఖ్యలో కువైత్‌లో ఉన్నారు. వారిలో చాలా మంది వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సందర్భంలో అరెస్ట్ అవుతున్నారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం, నివాస చట్టాలను ఉల్లంఘించేవారు అధికంగా ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.
అయితే, ఇలాంటి వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియ చాలా క్లిష్టతరంగా మారుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి కారణం వారిలో కొందరు తమ పాస్‌పోర్ట్‌లను ఉద్దేశపూర్వకంగా దాచడం, ధ్వంసం చేయడం చేస్తున్నారు. అలాంటి వారిలో చాలామంది దౌత్యకార్యాలయాలు లేని దేశానికి చెందినవారు ఉంటున్నారు. వారిని దేశం నుంచి పంపించి వేయాలంటే వారికి ప్రయాణ పత్రాలను జారీ చేయాల్సి ఉంటుంది. కానీ, వారి దేశాలకు చెందిన ఎంబసీలు లేకపోవడంతో ఇది క్లిష్టంగా మారుతుందని అంతర్గత మంత్రిత్వశాఖ పేర్కొంది. అందుకే ఇకపై ఈ కోవకు చెందిన సుమారు 10 దేశాల వారికి అన్ని రకాల వీసాలు నిషేధించాలనే ప్రతిపాదనను మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది.