పూరీ జగన్నాథునికి అర్పించే ఒబడా, ఇతర పిండి వంటకాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతాయి. ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రంలో లిపిబద్ధమై ఉంది. పురుషోత్తమునికి నిత్యం ఒబడా, మరో 24 రకాల పిండి వంటకాలు నైవేద్యంగా పెడతారు. పండగలు, పర్వదినాల్లో 56 రకాల వంటకాలు ఉంటాయి. ఆషాఢ బహుళ పాడ్యమి తిథి నుంచి శుక్లపక్షమి పాడ్యమి వరకు స్వామి ఒనొసొనొ మందిరంలో గోప్య ఉపచారాలు అందుకునే సమయంలో పాఠశాలలో తయారైన వంటకాలు అర్పణ కావు. పళ్లు, పేలాలు, జున్ను, పంచామృతం, పొణా మాత్రమే సమర్పిస్తారు. ఈ పదార్థాల్లో రోగనిరోధక శక్తి ఉందని ఆయుర్వేద శాస్త్ర రీత్యా రుజువైంది.
***మేలు చేస్తుంది ….
స్వామికి ఒనొసొనొ మందిరంలో నిత్యం అర్పించే పొణా పానీయం ఆరోగ్యానికి మేలు చేస్తుందని గోప్య సేవలు చేసే దైతాపతులు పేర్కొన్నారు. పాలు, జున్ను, కర్పూరం, జాజి, తేనె మిశ్రమాలతో తయారు చేసిన ఈ పానీయం ఆరోగ్య ప్రదాయిని అని ప్రధాన దైతాపతి సేవాయత్ రామకృష్ణ దాస్ మహాపాత్ర చెప్పారు. పొణా సేవనంతో జీర్ణశక్తి పెరుగుతుందని, వేడి తగ్గుతుందని ఉదర సంబంధిత రుగ్మతలు పోతాయని శాస్త్రం చెబుతోంది.
** భక్తులకు ఉచితంగా ..
పూరీలోని మఠాధీశులు ఒనొసొనొ మందిరం సేవలకు అవసరమైన సామగ్రి సమకూరుస్తారు. ఈ నేపథ్యంలో స్వామికి అర్పించే పోణా కోసం కొంతమంది భక్తులు నిరీక్షిస్తారు. గోప్య సేవలు చేసే దైతాపతులు దీన్ని సేవిస్తారు. మిగిలిన పానీయాన్ని వేచి ఉన్న భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.