నేటి సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల కాలంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ఫాలోవర్లను ఆకర్షించేలా మంచి మంచి ఫోటోలు తీస్తున్నారు. అయితే, భారత్‌లో ఇటీవల నిర్వహించిన ఒక ప్రదర్శనలో ఒకప్పటి స్ట్రీట్ ఫోటోగ్రఫీని మరోసారి కళ్లకు నికట్టినట్లు చూపించారు.అలనాటి స్ట్రీట్ ఫోటోగ్రఫీని ప్రదర్శించిన ఈ గ్యాలరీలో మొత్తంగా 23 ఫోటోలున్నాయి.
బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తున్న ఈ ఫోటోలను కేతకి శేత్, పబ్లో బర్త్‌మోలోమ్యూ, రఘు రాయ్, సూని తారాపోర్‌వాలా లాంటి ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తీశారు.1970 నుంచి 2000 మధ్య కాలంలో తీసిన ఈ ఫోటోలు భారత్‌లోని స్ట్రీట్ ఫోటోగ్రఫీలో స్వర్ణ యుగాన్ని తలపించాయి. అప్పట్లో కెమెరాను భుజాన వేసుకుని ఫోటోగ్రాఫర్లు వీధుల్లో తిరిగేవారు. ప్రజల జీవితాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించేవారు.”అప్పట్లో అనుమతులు తీసుకోవడం లాంటివేమీ ఉండేవి కాదు.
అటుగావెళ్తున్న వారి జీవితాలను ప్రతిబింబించేలా చక్కటి ఫోటోలను ఫోటోగ్రాఫర్లు తీసేవారు”అని దిల్లీకి చెందిన ఫోటోనిక్ సంస్థ వివరించింది. ఇక్కడ ప్రదర్శనను ఈ సంస్థే ఏర్పాటుచేసింది.”నేడు వీధుల్లో ఫోటోగ్రఫీ అనేది వివాదాస్పద, సంక్లిష్ట, నిఘా వ్యవహారంలా మరింది. ప్రతిదాన్నీ ప్రైవసీతో ముడిపెడుతున్నారు. మరోవైపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ స్ట్రీట్ ఫోటోగ్రాఫరే”అని సంస్థ వ్యాఖ్యానించింది.