Movies

నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్‌ కూడా చేస్తున్నారు

నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్‌ కూడా చేస్తున్నారు

‘చోర్‌ బజార్‌’ ఎంటర్‌టైన్‌మెంట్, కమర్షియల్, కలర్‌ఫుల్‌ ఫిల్మ్‌. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్‌ ఫిలిం. నా జానర్‌ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్‌) అన్నారు. ఆకాష్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో వీఎస్‌ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది.

ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్‌కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ రాలేకపోయేదాన్ని.అందుకే తెలుగులో గ్యాప్‌ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్‌ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్‌ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్‌ సీన్స్‌ చేస్తున్నారు. ‘చోర్‌ బజార్‌లో’ నాది అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యాన్‌ పాత్ర.

ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్‌ సాబ్‌. మా ఇద్దరికీ అమితాబ్‌ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్‌ డోర్‌ ఉమెన్‌ అనే ఇమేజ్‌ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్‌ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్‌ సిరీస్‌లోనూ నటించనున్నాను’’ అన్నారు.