తిరుపతి సమీపంలోని పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ నిర్మించిన శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఉదయం జలాధివాసం నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, చతుర్దశ కలశ స్నపనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.అనంతరం శ్రీ వకుళమాత అమ్మవారి విగ్రహానికి జలాధివాసం నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి వేద మంత్రాల మధ్య మంత్రించిన జలంతో విశేషంగా ప్రోక్షణ (జలాధివాసం) చేయడం వలన విగ్రహంలో ఎలాంటి దోషాలు ఉన్నా, తొలగి ప్రతిష్టకు యోగ్యం అవుతుందని అర్చకులు తెలిపారు. తరువాత కుంభారాధన, ఉక్త హోమాలు చేపట్టారు. అంతకుముందు జూన్ 23న ఆలయ మహా సంప్రోక్షణ ఏర్పాట్లను జేఈఓ వీరబ్రహ్మం టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర రెడ్డి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మీ, డిప్యూటీ ఈఓ గుణ భూషణ్ రెడ్డి, వైఖానస ఆగమ సలహాదారు విష్ణు బట్టాచార్యులు, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు కలశారాధన, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.