Movies

అబ్బాయిలూ మారండి

అబ్బాయిలూ మారండి

నాగచైతన్యతో తన వివాహబంధం విచ్ఛిన్నమవడంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్‌, పుకార్లపై సమంత తొలిసారి స్పందించారు. నాగచైతన్య ఓ యువ కథానాయికతో ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదంతా సమంతే వెనుక ఉండి చేయిస్తున్నారనీ, ఆమె సన్నిహితులే నాగచైతన్యపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన అభిమానులుగా చెప్పుకునే కొందరు సోషల్‌ మీడియాలో సమంతను ట్రోల్‌ చేస్తున్నారు. ‘తప్పంతా సమంతదే’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై వస్తున్న ట్రోల్స్‌, పుకార్లపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సమంత నోరు విప్పారు. ‘అమ్మాయిలపై వదంతులు వస్తే అందరూ అవి నిజం అనుకుంటారు. అబ్బాయిపై వదంతులు వస్తే మాత్రం అమ్మాయే చేయించింది’ అని అంటారని మంగళవారం ఆమె ట్వీట్‌ చేశారు. అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి, మీ పనిమీద, కుటుంబంపైన దృష్టి పెట్టండి అని హితవు పలికారు. ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్నవాళ్లు వారి పని వారు చేసుకుంటున్నారు. మీరు కూడా మీ పని చేసుకుంటే బాగుంటుందని ట్రోలర్స్‌కు సూచించారు. సమంత నటించిన ‘యశోద’ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘శాకుంతలం’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయ్‌ దేవరకొండ సరసన ‘ఖుషీ’లో సమంత నటిస్తున్నారు.