బరువు తగ్గాలనుకుంటే నిద్ర మీద కూడా దృష్టి పెట్టాలి. కంటి నిండా నిద్ర లోపిస్తే, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు, ఎమోషనల్ ఈటింగ్ మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ శరీర బరువును పెంచేవే! కాబట్టి కంటి నిండా నిద్రకు తోడ్పడే ఈ పానీయాలను నిద్రకు ముందు తాగుతూ ఉండాలి.
పాలు:
పాలలోని ట్రిప్టోఫాన్, క్యాల్షియం, కెసీన్ ప్రొటీన్లు గాఢ నిద్రలోకి జారుకునేటందుకు దోహదపడతాయి. కెసీన్ జీర్ణప్రక్రియను నెమ్మదింపజేసి గాఢ నిద్రలో ఉండగా కండరాల నిర్మాణానికి తోడ్పడతుంది. ఫలితంగా పరోక్షంగా కండరాలు బలపడి, ఫిట్నెస్ సొంతమవుతుంది.
ద్రాక్ష రసం:
గాఢ నిద్ర పట్టడంతోపాటు, నిద్రావస్థలో కొవ్వు కరిగేలా చేసే గుణం ద్రాక్ష రసానికి ఉంది. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని క్రమపరిచి, శరీర గడియారం కరెక్టుగా పని చేసేలా తోడ్పడతాయి.
దాల్చిన చెక్క తేనీరు:
దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు ఉంటాయనే విషయం మనకు తెలుసు. నిద్రకు ముందు ఈ చెక్క పొడితో తయారుచేసిన తేనీరు తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. అలాగే శరీరంలోని మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దాంతో కూడా శరీర బరువు తగ్గుతుంది.
మెంతుల నీళ్లు:
మెంతులు నానబెట్టిన నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరిగి, బరువు పెరగకుండా ఉంటాం! బరువు తగ్గడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరు కోసం కూడా మెంతుల నీళ్లు తాగాలి. అయితే నిద్రకు అరగంట ముందు తాగినప్పుడే ఈ ప్రయోజనాలు దక్కుతాయి.