రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన నేత ద్రౌపది ముర్ము(64) పేరును భారతీయ జనతా పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ద్రౌపది ముర్ముపై పుదుచ్చేరి కాంగ్రెస్ ట్విటర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
‘బీజేపీకి అధ్యక్షుడిగా డమ్మీ వ్యక్తి కావాలి. డమ్మీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ కోరుకుంటోంది. కేంద్రం ఎస్సీ, ఎస్టీ వర్గానికి ద్రోహం చేయాలని చూస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది’ అని పుదుచ్చేరి కాంగ్రెస్ ట్వీట్ చేసింది. అనంతరం కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది. అయితే డిలీట్ చేసినప్పటికీ ఆలోపే సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో విమర్శలకు దారితీసింది.
కాంగ్రెస్ ట్వీట్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రతిపక్ష కాంగ్రెస్ గిరిజన సమాజాన్ని, మహిళలను అవమానపరిచిందని విమర్శించింది. కాంగ్రెస్ ద్రౌపది ముర్మును డమ్మీగా పేర్కొందని ఆమె జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన తొలి మహిళా గిరిజన నాయకురాలని పేర్కొంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని కాంగ్రెస్ అవమానించిందంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు.