గురువాయూరు.. కేరళలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ఆ క్షేత్రంలో వెలసిన కృష్ణస్వామి సేవలో పదుల సంఖ్యలో ఏనుగులు పాల్గొంటాయి. ఈ గజరాజులన్నిటినీ పున్నత్తూర్ గజశాలలో ఉంచుతారు ఆలయ అధికారులు. ఇప్పుడీ క్యాంప్ నిర్వాహకురాలిగా సీఆర్ లేజుమోల్ అనే మహిళ ఎంపికయ్యారు. మొత్తం 44 ఏనుగుల సంరక్షణ బాధ్యత పూర్తిగా తనదే. క్యాంప్ మేనేజర్‌గా 44 ఏనుగులతోపాటు మావటీలు సహా 150 మంది సేవకులనూ ఆమె పర్యవేక్షిస్తారు. లేజుమోల్‌కు అక్కడి ఏనుగులన్నీ పరిచయమే. ఆమె తండ్రి మావటి. ఆమె భర్త, మామ కూడా మావటివాళ్లే. కుటుంబ నేపథ్యం ఉండటంతో, ఏనుగుల మనోభావాలు తనకు ఇట్టే అర్థమవుతాయని చెబుతున్నది లేజుమోల్. 1996లో గురువాయూర్ దేవస్థానంలో క్లర్క్‌గా ఆమె ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగి సేవల విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి చేరుకుంది. తాజాగా, ఏనుగుల క్యాంప్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించింది. ‘దైవకార్యంలో పాల్గొనే ఏనుగులకు ఎంత చేసినా తక్కువే’ అంటున్నది లేజుమోల్. రోజూ వాటికి ఆహారం అందించడంలో లోటుపాట్లు లేకుండా చూసుకుంటానని చెబుతున్నది ఆ గజదళ నాయకురాలు. తరచూ ఏనుగులకు వైద్యపరీక్షలు నిర్వహించడం, అవసరమైన చికిత్సలు అందించడం తన తక్షణ బాధ్యతలని వెల్లడించింది. ఏనుగులకు ఆయుర్వేద వైద్యం అందుబాటులోకి తీసుకొస్తానని ప్రకటించింది లేజుమోల్.