NRI-NRT

అబార్షన్‌ హక్కుల రద్దు.. అమెరికాకు ఇది చీకటి దినం..

అబార్షన్‌ హక్కుల రద్దు.. అమెరికాకు ఇది చీకటి దినం..

అబార్షన్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుమారు యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా.. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలు.. అబార్షన్‌పై నిషేధం విధించేందుకు, కఠిన చట్టాలు చేసేందుకు అధికారం పొందనున్నాయి.

దేశవ్యాప్తంగా అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 1973 నాటి మైలురాయి నిర్ణయం ‘రోయ్‌ వర్సెస్ వేడ్‌’ని సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు ప్రపంచ నేతలు స్పందించారు ‘‘ఇది అమెరికాకు విచారకరమైన రోజు’’ అని బైడెన్‌ అభివర్ణించారు. ‘‘రో వెళ్ళిపోవడంతో.. దేశంలోని మహిళల ఆరోగ్యం, జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి’’ అని ఒక ప్రకటన విడుదల చేశారాయన.

ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబాబా సైతం సుప్రీం కోర్టును తప్పుబట్టారు. ఈ తీర్పు స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారాయన. ఇవాళ సుప్రీంకోర్టు దాదాపు 50 సంవత్సరాల పూర్వాపరాలను తిప్పికొట్టడమే కాకుండా, రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తల ఇష్టానుసారంగా ఎవరైనా తీసుకోగల అత్యంత తీవ్రమైన వ్యక్తిగత నిర్ణయాన్ని – లక్షల మంది అమెరికన్ల ఆవశ్యక స్వేచ్ఛపై దాడి చేసింది అంటూ ట్విటర్‌ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

తీర్పుపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ.. భయానకంగా ఉందంటూ తీర్పుపై కామెంట్‌ చేశారు. గర్భస్రావానికి చట్టబద్ధమైన హక్కును కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న మిలియన్ల మంది అమెరికన్ మహిళల భయం, కోపాన్ని నేను ఊహించలేను’ అంటూ ఓ ట్వీట్‌ చేశారు.

అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తదితర ప్రముఖులు.. అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా మహిళా ఆరోగ్య ప్రాముఖ్యత తగ్గడంతో పాటు వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పలువురు ప్రముఖులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు.

రోయ్‌ 1973 ప్రకారం.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి రెండు త్రైమాసికాల్లో అబార్షన్‌లకు అనుమతిస్తారు. అయితే తాజా సుప్రీం కోర్టు రద్దు నిర్ణయంతో.. సగానికి సగం పైగా రాష్ట్రాలు కఠిన అబార్షన్‌ చట్టం తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీర్పు ఇచ్చిన జస్టిస్‌ శ్యామ్యూయెల్‌ అలిటోకు వ్యతిరేకంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఇంటర్నెట్‌ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.