జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక పాలనా యంత్రాంగంలో భారతీయ మూలాలున్న వారిని, అందులోనూ మహిళల్ని కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా.. భద్రత, విదేశీ వ్యవహారాలు, న్యాయ సేవలు… ఒకటని కాదు ప్రతిచోటా మనవాళ్లు ఉనికి చాటుతున్నారు. వీరి సంఖ్య ఇరవైకి పైనే. అది క్రమంగా పెరుగుతూనే ఉంది. తమ ప్రతిభా సామర్థ్యాలతో అగ్రరాజ్యంలో అత్యున్నత హోదాల్లో కొలువుదీరిన వారిలో కొందరి విజయగాథలివీ…
ఆరతి సాంకేతిక సలహాదారు
జో బైడెన్ తాజాగా భారతీయ మూలాలున్న ఆరతి ప్రభాకర్‌ని ‘డైరెక్టర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ’గా నామినేట్ చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా వ్యవహరిస్తారీమె. ఆరతి పుట్టింది దిల్లీలో. ఆమెకు మూడేళ్లప్పుడు కుటుంబం టెక్సాస్ వెళ్లింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసి.. ‘డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డీఏఆర్‌పీఏ)లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేరారు. అక్కడ సెమీ కండక్టర్స్ సాంకేతికతను మిలటరీలో ఉపయోగించడంపై పరిశోధనలు చేశారు. 1993లో బిల్‌క్లింటన్ అధ్యక్షుడిగా ఉండగా ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ’ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత వ్యాపారవేత్తగా మారి ఐటీతోపాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే సాంకేతికత అభివృద్ధిపైన పనిచేశారు. ఆ తర్వాత డీఏఆర్‌పీఏకు నాయకత్వ బాధ్యతలు వహించారు. అప్పుడు తీవ్రవాదులు బాంబుల తయారీకి ఉపయోగించే న్యూక్లియర్, రేడియాలజీ పరికరాల్ని గుర్తించే సాంకేతికతకు నమూనాని అభివృద్ధి చేశారు. ఎమ్‌ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ తయారీకి మార్గం సులభం చేశారు. యాక్చుయేట్ అనే స్వచ్ఛంద సంస్థని ప్రారంభించి ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపే సంస్థలని ప్రోత్సహించారు. ‘క్యాన్సర్ మూన్‌షాట్’ పేరుతో క్యాన్సర్ పరిశోధన, చికిత్స కోసం జో బైడెన్ తెచ్చిన కార్యక్రమంలోనూ ఆరతి పనిచేశారు. ‘ప్రతిభావంతురాలైన ఇంజినీర్, అత్యున్నతమైన భౌతికశాస్త్రవేత్త. శక్తిమంతమైన ఆవిష్కరణల్లో అమెరికాని ముందుంచే వ్యక్తి’ అంటూ ఆరతిని కొనియాడారు బైడెన్.
నీరా టాండన్ ఆమె చదివాకే..
వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ, అధ్యక్షుడికి సీనియర్ సలహాదారు. అధ్యక్షుడి సంతకం కోసం వెళ్లాల్సిన పాలసీ పేపర్లూ, ఇతర పత్రాల వివరాల్ని ఈమే అంతిమంగా నిర్ణయిస్తారు. 51 ఏళ్ల నీరాకు డెమొక్రాటిక్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. హిల్లరీ క్లింటన్‌కు సన్నిహితురాలు, ఒబామా ప్రభుత్వంలోనూ పనిచేశారు. ఒబామా తెచ్చిన ఆరోగ్య బీమా పథకం రూపకర్తల్లో ఈమె ఒకరు. బైడెన్ అధ్యక్షుడయ్యాక నీరాను మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ కార్యాలయ అధిపతిగా నియమించాలనుకున్నా.. రిపబ్లికన్ల నుంచి సెనేట్‌లో వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. తర్వాత గతేడాది మేలో సీనియర్ సలహాదారుగా, అక్టోబరులో స్టాఫ్ సెక్రటరీగా నియమించారు. ఈ హోదాల్లో ఉన్నత స్థాయి చర్చల ప్రక్రియలో భాగమవుతారు. టాండన్ తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. ఈమె అక్కడే పుట్టారు. ఇంజినీరింగ్, ఆపైన లా చేశారు.
సుమన గుహ రక్షణ విభాగంలో…
బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 2021 జనవరిలోనే ఈమెను అధ్యక్షుడికి స్పెషల్ అసిస్టెంట్‌గా, దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ డైరెక్టర్‌గా నియమించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్, కమలా హ్యారిస్ బృందానికి దక్షిణాసియా వ్యవహారాలపైన ఏర్పడిన కమిటీ సహ ఛైర్మన్. ఇదివరకు విదేశీ విభాగంలో అధికారిగా, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు సంబంధించిన ఆఫీసర్ ఆఫ్ ది స్పెషల్ రిప్రజంటేటివ్‌కి సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో దక్షిణాసియా వ్యవహారాలు చూస్తారు. బంగాలీ మూలాలున్న సుమనకు ఇంగ్లిష్, బంగాలీ, రష్యన్, ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం ఉంది.
వనితా గుప్త న్యాయ పీఠంపైనా..
బైడెన్ ప్రభుత్వంలో కమలా హ్యారిస్ తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న స్థానం వనితా గుప్తది. ఈమె అసోసియేట్ అటార్నీ జనరల్. అమెరికా న్యాయవ్యవస్థలో ఇది మూడో అత్యున్నత స్థానం. ఈ స్థానానికి ఎంపికైన శ్వేతజాతీయేతరుల్లో తొలి మహిళ. యేల్ యూనివర్సిటీ నుంచి బీఏ, న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. ప్రజా హక్కుల న్యాయవాదిగా వనితకు అమెరికాలో ప్రత్యేక గౌరవం ఉంది. వలస కుటుంబాలూ, నల్ల జాతీయుల తరఫున నిలుస్తూ అనేక కేసుల్లో గెలిచారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నపుడు ప్రజా హక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా పనిచేశారు.