అమెరికన్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ శనివారం సంతకం చేశారు. ప్రజల ప్రాణాలకు ఇక రక్షణ లభించినట్టేనని ఆయనీ సందర్భంగా అన్నారు. ఇది చట్టరూపం దాల్చడంతో ఇకపై కఠినమైన తనిఖీల తర్వాతే తుపాకులను మంజూరు చేస్తారు. ఇటీవల న్యూయార్క్, టెక్సస్ రాష్ట్రాల్లో జరిగిన విశృంఖల కాల్పులకు అమాయకులు బలైన సంగతి తెలిసిందే. ఆత్మరక్షణకు తుపాకులు వాడటం అమెరికన్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిన రెండు రోజుల్లోనే బిల్లుపై బైడెన్ సంతకం చేశారు. పాలక డెమొక్రాట్లతో పాటు విపక్ష రిపబ్లికన్లూ బిల్లుకు ఆమోదం తెలిపారు.