NRI-NRT

అబార్షన్లపై నిషేధమా? ..అమెరికాలో గళమెత్తిన మహిళలు

అబార్షన్లపై నిషేధమా? ..అమెరికాలో గళమెత్తిన మహిళలు

అబార్షన్‌ విషయమై అమెరికాలో భిన్నాభిప్రాయాలు ఇప్పటివి కాదు. మత విశ్వాసాలను నమ్మే సంప్రదాయవాదులకు, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చే ప్రగతిశీలవాదులకు మధ్య ఈ విషయమై ఎన్నేళ్లగానో పోరు నడుస్తోంది. 50 ఏళ్ల క్రితం రో వెర్సస్‌ వేడ్‌ కేసు తర్వాత రాజ్యాంగపరంగా సంక్రమించిన అబార్షన్‌ హక్కులకు సుప్రీంకోర్టు మంగళం పలికి, దాన్ని నిషేధించేందుకు రాష్ట్రాలకు అధికారాలు కట్టబెట్టడంపై మహిళలు భగ్గుమంటున్నారు.పిల్లలను మోసి కనే శ్రమ ఆడవాళ్లదే కాబట్టి దానిపై నిర్ణయం తీసుకునే హక్కు తమకే ఉండాలంటూ దేశవ్యాప్తంగా భారీగా నిరసనలకు దిగారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఏడు రాష్ట్రాలు అలబామా, అర్కన్సాస్, కెంటకీ, లూసియానా, మిసోరి, ఒక్లహామా, సౌత్‌ డకోటా అబార్షన్లను నిషేధించే ప్రక్రియను ప్రారంభించాయి. మరో 23 రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అబార్షన్‌ క్లినిక్స్‌ మూసేస్తున్నారు.మహిళల పునరుత్పత్తి హక్కులపై అధ్యయనం నిర్వహించే గట్‌మ్యాచర్‌ ఇనిస్టిట్యూట్‌ గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు 45 ఏళ్ల వయసులోనూ అబార్షన్‌ చేయించుకుంటున్నారు. 20–30 ఏళ్ల వయసు వారిలో ఏకంగా 60 శాతం అబార్షన్లు జరుగుతున్నాయి. వీరిలో ఆఫ్రికన్‌ నిరుపేద, అందులోనూ నల్లజాతి మహిళలే ఎక్కువ. ఇన్సూరెన్స్‌ లేని టీనేజర్లు, వలస వచ్చిన మహిళలపై తీర్పు తీవ్ర ప్రభావం చూపించనుంది.

ఆలస్యమూ కొంప ముంచుతుంది
డెమొక్రాట్ల పట్టున్న కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్‌ సహా 10 రాష్ట్రాల్లో అబార్షన్లకు చట్టబద్ధత కొనసాగనుంది. దాంతో నిషేధమున్న రాష్ట్రాల మహిళలు అబార్షన్‌కు వందలాది మైళ్ల దూరం ప్రయాణించి ఇలాంటి రాష్ట్రాలకు వెళ్లాలి.