అమెరికాలోని యాష్‌విల్లే నగరంలో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే ‘చాయ్ పానీ’ పేరే చెబుతారు. అంత ఫేమస్. ఇప్పుడది ‘అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్- 2022’ గౌరవం దక్కించుకుంది. ఇంగ్లండ్‌లో పుట్టి ఇండియాలో పెరిగిన మెహెర్వాన్ ఇరానీ ‘చాయ్ పానీ’ యజమాని. ప్రవాస భారతీయులకు, అమెరికన్లకు అదిరిపోయే వీధి రుచులు పంచి అందరివాడు అనిపించుకుంటున్నాడు.
నార్త్ కరోలినా రాష్ట్రంలో ఉంటుంది యాష్‌విల్లే. నగరంలోని భారతీయులందరికీ ‘చాయ్ పానీ’ రుచి తెలుసు. ఆ మాటకొస్తే అనుకోకుండా అటుగా వచ్చిన అమెరికన్లూ అతిథులుగా మారిపోతారు. చిరుతిండ్లకు చిరునామాగా నిలిచిన చాయ్ పానీలో చాట్, భేల్ పూరి, ఆలూ టిక్కి, స్వీట్ పొటాటో చాట్, పావ్‌భాజీ, వడపావ్, ఊతప్పం, పకోడీ, పనీర్ టిక్కా.. ఇలా పక్కా లోకల్ రుచులు దొరుకుతాయి. వీధి వంటకాలను ఈ తరానికి నచ్చేలా వండి వడ్డించి అందరివారయ్యారు మెహెర్వాన్ అండ్ కో. మాంసాహార ప్రియుల కోసం కీమా పావ్, లాంబ్ బర్గర్, చికెన్ టిక్కా రోల్, కశ్మీరీ వంటకాలు, చికెన్ పకోడీ లాంటి పసందైన నాన్ వెజ్ వంటకాలూ వడ్డిస్తారు. సాగ్ పనీర్, చికెన్ థాలీతో భోజనమూ తయార్.
ఓనరు కూతురితో పెండ్లి
లండన్‌లో పుట్టిన మెహెర్వాన్ ఇరానీ ఇండియాలో పెరిగాడు. పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ‘నువ్వు అమెరికా వెళ్తే, అందరికంటే ముందుంటావ’ని అతని తండ్రి ఆశీర్వదించాడు. మొదట్లో మెహెర్వాన్ అక్కడ చిన్నాచితకా ఉద్యోగాలు చేశాడు. సౌత్ కరోలినా బీచ్‌లో ఫ్రెంచ్ పాస్ట్రీ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేశాడు. కొన్నాళ్లకు అదే రెస్టారెంట్ యజమాని కూతురు మొల్లీని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అంతలోనే చదువు మీద మనసు మళ్లి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాలో ఎంబీఏ చేశాడు. తర్వాత మెహెర్వాన్ దంపతులు శాన్‌ప్రాన్సిస్కోకు వెళ్లారు. కొన్నాళ్లు సేల్స్‌మ్యాన్‌గా పనిచేశాడు. పన్నెండేండ్ల తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనే లక్ష్యంతో ‘చాయ్ పానీ’ ప్రారంభించాడు.
గ్లోబల్ ఇండియన్ బ్రాండ్
భారతీయ స్ట్రీట్ ఫుడ్‌ను శుచిగా, రుచిగా అందించి అక్కడివారి మనసులు గెలుచుకున్నారు మెహెర్వాన్ దంపతులు. భారతీయులతోపాటు అమెరికన్ల కితాబులూ అందుకున్నారు. ఇటీవల జేమ్స్ బయర్డ్ ఫౌండేషన్ చికాగోలో నిర్వహించిన రుచుల పండుగలో చాయ్ పానీ రెస్టారెంట్ నాలుగు కేటగిరీల్లో నామినేషన్లు అందుకుంది. చివరికి అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్‌గా ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా అవార్డు గెలుచుకుంది. రోజూ కష్టపడితే విజయం అదే వెంటపడుతూ వస్తుంది కదా. అందుకు మెహెర్వాన్ విజయమే ఓ ఉదాహరణ. తన రుచులు ఎంతమందిని మెప్పిస్తే ఆన్‌లైన్ ఓటింగ్‌లో నెగ్గుకొచ్చి ఉంటాడు?! గతంలోనూ ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రకటించిన చాలామందికి నచ్చిన టాప్ 50 రెస్టారెంట్లలో చాయ్ పానీ ఒకటిగా నిలిచింది. ఈ విజయాలతో చాయ్ పానీ ఎనిమిది ఫ్రాంచైజీలు ప్రారంభించింది. అలాగే డెకాటర్ బొటివాలా (అట్లాంటా), బాక్స్‌టన్ హాల్ బార్బెక్యూ (యాష్‌విల్ల్లే) రెస్టారెంట్లు, స్పైస్ వాలా అనే చిన్న కంపెనీ కూడా నడుపుతున్నాడు మెహెర్వాన్. ‘నా జీవిత భాగస్వామి సహకారంతోనే ఈ విజయం సాధ్యమైంది’ అంటాడు మెహెర్వాన్.