ఆపదలో ఉన్నప్పుడు.. గ్రామ దేవతలే తమను కష్టనష్టాల నుంచి కాపాడుతారని పల్లె ప్రజలు విశ్వసిస్తారు. అమ్మవార్లకు ప్రతీకగా ఊరి మధ్యలో బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. ఏటా కొలుపులు, పూజలు చేస్తారు. ఆ సమయంలో ఊరంతా ఏకమై కులమతాలకు అతీతంగా జాతర జరుపుతారు.
*గ్రామం నడిమధ్యలో నిలువుగా నాటిన రాయిని బొడ్రాయి (బొడ్డురాయి) పిలుస్తారు. గ్రామ నిర్మాణ సమయంలో పొలిమేరలను నిర్ణయించి.. ఆ వైశాల్యానికి మధ్యభాగంలో ఈ బొడ్డురాయిని ప్రతిష్ఠిస్తారు. శాస్త్రోక్తంగా పూజిస్తారు. మానవ శరీర మధ్యభాగంలో ‘నాభి’లాగా.. గ్రామానికి బొడ్రాయి మధ్య భాగంగా ఉంటుంది. అందుకే, దీనికి బొడ్డురాయి అని పేరు. బొడ్రాయి మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది. కింది భాగాన్ని బ్రహ్మ స్వరూపంగా భావించి నాలుగు పలకలుగా చెక్కుతారు. మధ్యభాగాన్ని విష్ణువుకు ప్రతీకగా ఎనిమిది పలకలతో, పై భాగాన్ని శివుడి స్వరూపంగా భావించి లింగాకారంగా చెక్కుతారు. ఊరి మధ్య భాగంలో గద్దెను నిర్మించి, దానిపైన బొడ్రాయిని ప్రతిష్ఠిస్తారు. అంతకుముందే బొడ్రాయి కింద ఎనిమిది మంది పొలిమేర దేవతలకు అధిదేవత, శక్తి స్వరూపిణిగా కొలిచే శీతలాదేవి అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. పొలిమేర్లలో ఉన్న దిక్కుల వారీగా ఆయా దిక్కులకు సంబంధించిన యంత్రాలను, సర్వతోభద్ర యంత్రాన్ని భక్తిపూర్వకంగా స్థాపన చేస్తారు.
*ఒక్కో విధానం..
బొడ్రాయి ప్రతిష్ఠాపన, పూజలకు సంబంధించి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానాన్ని అవలంబిస్తారు. గ్రామాలకు సాంకేతిక పరిజ్ఞానం చేరడం, భిన్న కులాలు, మతాలకు చెందిన ప్రజలు ఉండటం వల్ల పూజా విధానాల్లోనూ భిన్నత్వం కనిపిస్తున్నది. కొన్ని గ్రామాల్లో కేవలం బొడ్రాయిని మాత్రమే ప్రతిష్ఠిస్తే.. మరికొన్ని గ్రామాల్లో గ్రామదేవతలను కూడా కలిపి పూజిస్తున్నారు.
*జీర్ణోద్ధరణ ఇలా..
వరదలు, ఇతర కారణాల వల్ల బొడ్రాయి నేలలో కూరుకుపోయినప్పుడు, గ్రామ విస్తీర్ణం పెరగడం, లేదా రోడ్ల విస్తరణలో భాగంగా బొడ్రాయికి స్థానచలనం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు.. బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన చేస్తారు. ఈ సందర్భంగా గ్రామాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. బొడ్రాయి పండుగ సమయంలో బంధువులను పిలుచుకుని వేడుకలు జరుపుకొంటారు. ఆడబిడ్డలకు ఒడిబియ్యం పోస్తారు. బొడ్రాయిని ప్రతిష్ఠించే సమయంలో గ్రామస్తులకు కొన్ని ఆంక్షలను విధిస్తారు. ప్రతిష్ఠ జరిగే రోజు గ్రామ కట్టడి చేస్తారు. ఊరివాళ్లంతా గ్రామంలోనే ఉండేలా, పొలిమేర దాటి బయటి వాళ్లెవరూ గ్రామంలోకి రాకుండా చూస్తారు. బొడ్రాయిని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతియేటా వార్షికోత్సవాలు జరుపుతారు. పంచాంగం ప్రకారం ఏ రోజున ప్రతిష్ఠ చేశారో.. ఏటా అదే రోజున గ్రామ ప్రజలంతా కలిసి వేడుక నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీన్నే ‘బొడ్రాయి పండుగ’ అంటారు. ఇది ఊరుమ్మడి వేడుక. ఆ రెండ్రోజులూ ప్రతి ఇల్లూ బంధు మిత్రులతో కళకళలాడుతుంది.
**తరాల ఆచారాలు
*దసరా, ఉగాది ఇతర పర్వదినాల్లో గ్రామ ప్రజలు బొడ్రాయి వద్ద పూజలు చేస్తారు.
* పెండ్లి తర్వాత ఆడబిడ్డ ఊరుదాటి వెళ్లేటప్పుడు గానీ, కొత్త కోడళ్లు ఊళ్లో అడుగుపెట్టేటప్పుడు గానీ.. బొడ్రాయిని పూజించడం ఆనవాయితీ.
*ప్రధాన పండుగల సందర్భంగా బొడ్రాయి ముందు యాటలను (దేవర పోతులను) బలి ఇవ్వడం తరాలనాటి సంప్రదాయం.
* ఊర్లో ఎవరైనా చనిపోతే.. శవాన్ని బొడ్రాయి మార్గం గుండా మాత్రమే ఊరు దాటించాలని చెబుతారు.