జూన్ 25న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం మిల్పిటాస్ పట్టణంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 4వ స్నాతకోత్సవాన్ని విశిష్టంగా జరుపుకొన్నది.మొదట విశ్వవిద్యాలయ ప్రొవోస్ట్ రాజు చమర్తి క్రమపద్ధతిలో పట్టభద్రులను, ఉన్నతాధికారులను వేదిక వద్దకు తీసుకొనిరాగా గణేశ స్తుతి, అమెరికా జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది.ప్రారంభోపన్యాసంలో విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డా. ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ భారతదేశం మినహా మిగతా అన్ని దేశాల్లో భారతీయ కళలు బోధిస్తున్న ఒకే ఒక విశ్వవిద్యాలయం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయమని పేర్కొన్నారు. ప్రశస్తమైన భారతీయ జ్ఞానానికి ఆధునిక విద్యను, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ అభివృద్ధి పథంలో నడిపించడమే సిలికానాంధ్ర ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.
చిత్తశుద్ధితో మార్గనిర్దేశకం చేస్తే ఇతరులు అనుసరిస్తారని గుర్తు చేసారు.ఈ సందర్భంగా చైర్మన్, డా. పప్పు వేణుగోపాలరావు పర్యవేక్షణలో వెలువడుతున్న విశ్వవిద్యాలయ పత్రిక ‘శాస్త్రం’ అచ్చుప్రతిని విడుదల చేసారు. ప్రముఖ వెస్టర్న్ డిజిటల్ సంస్థలో టెక్నాలజీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న డా. శివ శివరాం కీలకోపాన్యాసం చేస్తూ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో నివసించిన త్యాగయ్య భక్తిరసాన్ని నమ్ముకొని కర్ణాటక సంగీతానికి రాచబాటలు వేసిన వైనాన్ని వివరించారు. కళకు హృదయంలో స్థానమిచ్చి (Art at Heart), మనస్సు లగ్నంచేసి శ్రమిస్తే ఉత్తమ ఫలోత్పత్తి లభిస్తుందని ఉద్ఘాటించారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు బయట సంఘంలో విశ్వవిద్యాలయ దూతలుగా వ్యవహరించాలని సూచించారు.అధ్యక్షుడు డా. ఆనంద్ కూచిభొట్ల చేతుల మీదుగా కూచిపూడి నాట్యం, భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు మరియు సంస్కృత భాషల్లో సర్టిఫికెట్, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేసిన 56 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయటం జరిగింది.ట్రస్టీ సభ్యుడు, సిద్ధార్థ లకిరెడ్డి ముగింపు వాక్యాలు పలుకుతూ బాహ్య ప్రపంచంలో మంచి నడవడికను అవలంబించటానికి కొన్ని సలహాలిచ్చారు.తేనీటి విందుతో ముగిసిన సభలో పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులు, ఇతర సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు.