దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ కొత్త టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించింది. ఈ నంబరుకు కాల్ చేయడం ద్వారా బ్యాంకు ఖాతాదారులు వివిధ రకాల ఆర్థిక సేవలు ఇంటి వద్ద నుంచే సులభంగా పొందొచ్చు. దీంతో ప్రాథమిక బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సమయం ఆదా అవుతుంది.ఎస్‌బీఐ కొత్త టోల్ ఫ్రీ నంబరు 1800 1234. ప్రయాణ సమయంలో బ్యాంకింగ్ సాయం కోసం ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుర్తుంచుకోవడం కూడా చాలా సులభం. ఈ కొత్త టోల్ ఫ్రీ నంబర్‌ను ఉపయోగించి ఎస్‌బీఐ ఖాతాదారులు.. ఖాతా బ్యాలెన్స్, చివరి 5 లావాదేవీల వివరాలు, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్, డిస్పాచ్ స్టేటస్, చెక్‌బుక్ డిస్పాచ్ స్టేటస్, టీడీఎస్ వివరాలు, డిపాజిట్ వడ్డీ సర్టిఫికెట్ (ఈ-మెయిల్ ద్వారా పంపుతారు), పాత ఏటీఎం కార్డు బ్లాక్ చేయడం, పాత కార్డు బ్లాక్ చేసిన తర్వాత కొత్త ఏటీఎం కార్డుకి అభ్యర్థించడం వంటి సేవలను పొందొచ్చు.
ఈ సేవలు 24X7 అందుబాటులో ఉంటాయి. 1800 1234తో పాటు 1800 11 2211, 1800 425 3800, 1800 2100, లేదా 080 – 26599990 నంబర్లకు కూడా కాల్ చేయవచ్చు. ఇవన్నీ టోల్ ఫ్రీ నంబర్లే. ఎస్‌బీఐ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలు, సందేహాల నివృత్తి కోసం దేశీయంగా ఉన్న అన్ని మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్ల నుంచి ఈ టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేయవచ్చు.
*ఎస్‌బీఐ ఈ-మెయిల్ ఐడీ..
ఫిర్యాదులకు ఫోన్ కాల్ సమాధానంతో సంతృప్తి చెందని వారు, టెక్నాలజీ గురించి అవగాహన ఉన్నవారు customercare@sbi.co.in లేదా contactcentre@sbi.co.in మెయిల్ ఐడీలకు ఫిర్యాదులను పంపి రిజిస్టర్ చేసుకోవచ్చు. కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాక సంబంధిత టికెట్ నంబరు ఎస్ఎంఎస్ ద్వారా గానీ, ఈ-మెయిల్ ద్వారా గానీ ఖాతాదారునికి వస్తుంది.
*ఎస్ఎంఎస్ అలర్ట్..
ఎస్ఎంఎస్ ద్వారా తమ సమస్యలను తెలియజేయాలనుకునే కస్టమర్‌లు HELP అని టైప్ చేసి +91 8108511111కి పంపొచ్చు. బ్యాంక్ అందించే సేవలతో సంతృప్తి చెందని వారు UNHAPPY అని టైప్ చేసి 8008 202020కి పంపవచ్చు. నమోదిత ఖాతాకు అనుసంధానమైయున్న ఏటీఎం కార్డు పోగొట్టుకున్నా/దొంగతానికి గురైనా ఎస్ఎంఎస్ ద్వారా కార్డును బ్లాక్ చేయవచ్చు. ఏటీఎం కార్డ్‌ను బ్లాక్ చేయడానికి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి సబ్ BLOCK XXXX అని 567676కి SMS పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ XXXX అనేది కార్డ్ నంబర్‌లోని చివరి 4 అంకెలను సూచిస్తుంది.