Business

పాత బంగారానికీ హాల్‌మార్క్‌!

పాత బంగారానికీ హాల్‌మార్క్‌!

ఈ మధ్య కాలంలో మనం కొనే బంగారానికి ఖచ్చితమైన హాల్‌మార్కింగ్‌ ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. గత ఏడాది జూన్‌ నుంచి ఈ నియమాన్ని అధిక శాతం వ్యాపారులూ అమలు చేస్తున్నారు. అయితే మన దగ్గరున్న పాత బంగారం పరిస్థితి ఏంటి?.. వాటికి హాల్‌మార్క్‌ లేకపోతే ఎలా?.. మనం వాటిని కరిగించలేమా?.. షాపుల్లో ఎక్సేంజ్‌ చేసుకునేందుకు అవకాశం లేదా?.. హాల్‌మార్కింగ్‌ చేయించుకోవాలంటే ఏం చేయాలి?.

హాల్‌మార్కింగ్‌ ఎందుకు?
మనం కొనే బంగారంలో స్వచ్ఛత ఎంత?.. అని తెలుసుకునేందుకు వచ్చిన విధానమే హాల్‌మార్కింగ్‌. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) వీటిని పర్యవేక్షిస్తుంది. 22 క్యారెట్ల బంగారం పేరుతో మనం నగలు కొంటున్నప్పుడు అందులో ఖచ్చితంగా అంత ప్యూరిటీ ఉందా?.. లేదా?.. అని తెలుసుకోవాలనేది ఈ హాల్‌మార్కింగ్‌ ఉద్దేశం. ఎందుకంటే ఆ ప్యూరిటీలో తేడా కొనుగోలుదారుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ కారణంగా బీఐఎస్‌ అనేక నిబంధనలను పసిడి వ్యాపారులపై విధించింది. ప్రతీ నగపై ఖచ్చితమైన గుర్తు, దానికి ప్రత్యేక నెంబర్‌ ఉండాలనే సూచిస్తోంది. దీన్నే హాల్‌మార్కింగ్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (HUI) నెంబర్‌ అంటారు. దీని ఆధారంగా ఏ ఆభరణాన్ని ఎవరు అమ్మారు?.. అందులో ఎంత ప్యూరిటీ ఉంది?.. అనేది BIS Care App ద్వారా మనం తెలుసుకోవచ్చు.

పాతవాటి పరిస్థితేంటి?
పాత నగలను మనం ఎలాంటి ఇబ్బందీ లేకుండా వినియోగించుకోవచ్చు. అయితే వాటికి కూడా మనం హాల్‌మార్కింగ్‌ చేయించుకునే సౌలభ్యం కల్పిస్తోంది బీఐఎస్‌. ఇందుకోసం మనం బీఐఎస్‌ అధీకృత జ్యుయెల్లర్‌ లేదా సెంటర్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు మన నగలను దగ్గరున్న సెంటర్‌కు పంపుతారు. అందులో ఎంత ప్యూరిటీ ఉందో తెలుసుకున్న తర్వాత దానిపై హాల్‌మార్క్‌తోపాటు సర్టిఫికెట్‌ కూడా అందజేస్తారు. సదరు నగ బరువు ఎంత?.., ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్‌ పద్ధతి, శాంప్లింగ్‌, పైర్‌ అస్సే, లేజర్‌ మేకింగ్‌ వంటి ఫ్లోచార్ట్‌ అంతా బీఐఎస్‌ నిబంధనల ప్రకారమే జరగాలి. అంతేగాకుండా ప్రతీ ప్రక్రియను ఫ్లోచార్ట్‌ ప్రకారం ఫాలో అవుతూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. టెస్టింగ్‌ తర్వాత ఈ ఆభరణాలకు ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌ను బీఐఎస్‌ సంస్థ ఇస్తుంది. దానిపై బీఐఎస్‌ లోగో, ప్యూరిటీ మార్క్‌ వేస్తారు.

ఎంత ప్యూరిటీకి ఏ మార్క్‌?
22 క్యారెట్‌ బంగారానికి 916, 18 క్యారెట్‌కు 750, 14 క్యారెట్‌కు 585 ప్యూరిటీ సర్టిఫికెట్‌ లభిస్తుంది.

హాల్‌మార్కింగ్‌ ఛార్జీలు ఎంత?
హాల్‌మార్కింగ్‌ కోసమైతే ఒక్కో బంగారం ఆభరణానికి రూ.35, వెండి నగలకు రూ.25 చొప్పున వసూలు చేస్తారు. గోల్డ్‌ టెస్టింగ్‌ కోసం నాలుగు ఆర్టికల్స్‌ కలిగిన ఒక్కో కన్సైన్‌మెంట్‌కు రూ.200 తీసుకుంటారు. సర్టిఫికెట్‌ జారీ కోసం ఎలాంటి రుసుమూ లేదు.

హాల్‌మార్క్‌ లేకపోతే?
ఒకవేళ హాల్‌మార్కింగ్‌ చేయించుకోకపోయినా పెద్దగా నష్టం లేదు. పాత బంగారాన్ని జ్యుయెల్లర్‌కు ఎక్సేంజ్‌ కోసం ఇచ్చినప్పుడు వాళ్లే ప్యూరిటీ చెక్‌ చేసి చెప్తారు. వాటిని కరిగించి కొత్త నగలు చేసినప్పుడు హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి. బ్యాంకులో తాకట్టు పెట్టాల్సి వచ్చినప్పుడు కూడా వాల్యూయర్‌ దాన్ని లెక్కగడ్తారు. అప్పుడూ ఎలాంటి ఇబ్బందీ ఉండబోదు. కాకపోతే హాల్‌మార్కింగ్‌ చేయించుకుంటే మన బంగారంలో ఎంత బంగారం నిజంగా ఉన్నది?.. అనే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు కేవలం మాట మీద, నమ్మకం మీదే వ్యాపారాలు సాగేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి హాల్‌మార్కింగ్‌ అంటూ పాత బంగారానికి కూడా చేయించుకుని సిద్ధంగా ఉంచుకుంటే మనకూ ఓ భరోసా ఉంటుంది.