DailyDose

అడవి బిడ్డలకు సకాలంలో వైద్యం అందించాలి – TNI తాజా వార్తలు

అడవి బిడ్డలకు సకాలంలో వైద్యం అందించాలి  –  TNI  తాజా వార్తలు

* సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బీజీపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో మలేరియా, వైరల్ ఫీవర్ బారిన పడే అవకాశం ఉందని, అయితే గిరిజనులకు వైద్యం సకాలంలో వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఇంకా తన ఫేస్‌బుక్‌లో ఇలా పోస్టు చేశారు.ఆడ‌వి బిడ్డ‌ల ప్రాణాల‌తో ఆట‌లాడితే పుట్టగ‌తులుండవ్ ‘‘తెలంగాణ‌లో గిరిజన బిడ్డ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వానా‌కాలం మొదలవ్వడంతో అడవి బిడ్డలు జ్వరాలతో మంచం పట్టారు. మలేరియా, వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. వీరికి వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. అటవీ ప్రాంతాల నుంచి దవాఖానాలకు వెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. వాగులు, వంకలు అడ్డం వస్తుండడంతో తోటి గిరిజనులే కావడి కట్టి తీసుకుపోవడం, మంచాలపై వేసుకుని దాటించడం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నచోట్ల అంబులెన్స్లు సమయానికి రాక మార్గంమధ్యలోనే చనిపోతున్నారు. ఒకవేళ అదృష్టం బాగుండి.. హాస్పిటల్ వరకూ వెళ్లినా సిబ్బంది, డాక్టర్ల కొరత, సౌకర్యాలు లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పాములు, తేళ్లు కుట్టి దవాఖానాల బాట పడితే అక్కడ విరుగుడు మందుల్లేక కాటికి పోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా జ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ఎక్కువ మంది వైరల్ ఫీవర్, మలేరియా బారిన పడేవారే ఉంటున్నారు. జిల్లాలో 29 పీహెచ్సీలు,15 రౌండ్ ది క్లాక్ పీహెచ్సీలు, 240 సబ్సెంటర్లున్నా అన్ని చోట్లా సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి సబ్సెంటర్కు రోజూ 10 నుంచి 15 మంది జ్వరాలతో క్యూ కడుతున్నారు.

* కొవిడ్‌ మహమ్మారితో రెండేళ్ల తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభంకానున్నది. దీంతో దేశం నలుమూల భక్తులు, పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొన్నది. యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కశ్మీర్‌కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా వందలాది మంది సాధువులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో జమ్మూలో ఈ నెల 27 నుంచి ప్రయాణికుల టోకెన్‌ ప్రక్రియ ప్రారంభంకానున్నది. అలాగే 28 నుంచి తక్షణ రిజిస్ట్రేషన్‌ సదుపాయం అందుబాటులోకి రానున్నది. యాత్రలో భాగంగా మొదటి బ్యాచ్‌ 29న తెల్లవారు జామున జమ్మూలోని బేస్‌ క్యాంప్‌ భగవతి నగర్‌ నుంచి బయలుదేరనున్నది. సాంప్రదాయ బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో 30న అధికారికంగా మొదటి బ్యాచ్‌లో చేరనున్నది.దాదాపు 400 మంది సాధువులు జమ్మూలోని శ్రీరామ మందిర పురాణి మండికి చేరుకున్నారు. 28 నుంచి ఆలయ ప్రాంగణంలో సాధువుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఆలయ మహంత్ రామేశ్వర్ దాస్ పేర్కొన్నారు. అదేవిధంగా తత్కాల్ రిజిస్ట్రేషన్ కోసం సామాన్య ప్రయాణికులు ముందుగా రైల్వే స్టేషన్ సమీపంలోని సరస్వతి ధామ్ వద్ద టోకెన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. టోకెన్‌లో కేటాయించిన స్థలం, తేదీ ప్రకారం తక్షణ రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కేంద్రాల్లోనే భక్తులకు తక్షణ వైద్య పరీక్షల సౌకర్యం కల్పిస్తామన్నారు. తత్కాల్ రిజిస్ట్రేషన్ కోసం ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరి స్పష్టం చేశారు.టోకెన్ పొందిన తర్వాత, రూ. 220 రుసుము చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, సాధువులకు ఉచితంగానే రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ సమీపంలోని వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభ, శాలమార్ వద్ద ప్రయాణికుల తక్షణ నమోదుకు ఏర్పాట్లు చేశారు. శ్రీరామ మందిరం పురాణీ మండి, గీతా భవన్ పరేడ్ వద్ద సాధువుల తత్కాల్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఏర్పాట్లు చేశారు. బేస్ క్యాంపు భగవతి నగర్‌లో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 27న టోకెన్‌ను జారీ చేసిన తర్వాత మరుసటి రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని ఏడీసీ సతీశ్‌ శర్మ తెలిపారు. న్వాన్ బేస్ క్యాంపులో అమర్‌నాథ్ యాత్ర కోసం ఆరోగ్య శాఖ బేస్ క్యాంపులో 15 పడకల ఆసుపత్రిని సిద్ధం చేశారు. ఇందులో కాన్సంట్రేటర్లతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచారు.

* కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.నివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షణలు, కోడెల స్థంబం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు.

* ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు బద్రీనాథ్‌ హైవేపై పడిపోయాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన్ని మూసివేశామని, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. బద్రీనాథ్‌ – కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ప్రకారం.. ఈ ఏడాది 7.60లక్షల మంది పర్యాటకులు బద్రీనాథ్‌ను సందర్శించారు. మే 8న బద్రీనాథ్‌ యాత్ర ప్రారంభమైంది. రోడ్డు మూతపడడంతో యాత్రకు ఆటంకం కలుగుతున్నది. పలు ప్రాంతాల్లో భక్తులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తున్నది.ఇటీవల ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి బద్రీనాథ్‌ను సందర్శించి మాస్టర్‌ ప్లాన్‌ కింద చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల్లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, అరైవల్ ప్లాజా నిర్మాణం, దేవాలయం సమీపంలోని సరస్సుల సుందరీకరణ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా లూప్ రోడ్, బైపాస్ నిర్మాణాలున్నాయి. పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకుండా నిర్ణీత గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

* గన్నవరం విమానాశ్రయం నుండి మరో అవయవదానానికి ఊపిరితిత్తులు హైదరాబాద్ కు తరలింపు.పోరంకి క్యాపిటల్ హాస్పిటల్ నుండి గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ చానల్ ద్వారా అవయవాలు తరలించిన పోలీసులు.గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఊపిరితిత్తులను హైదరాబాద్ కు తరలించిన వైద్యులు.తెనాలికి చెందిన పుట్ట చంద్రిక(52) అనే మహిళ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో క్యాపిటల్ హాస్పిటల్ లో చేరిక.చంద్రిక బ్రెయిన్ డెడ్ అయినట్లు దృవీకరించిన వైద్యులు.అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు.

*అమరావతిలో ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్-డీ భవనాలు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. అలాగే ఒక భవనాన్ని విట్ వర్సిటీకి లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

*గుడివాడలో తెలుగు తమ్ముళ్ల మధ్య బ్యానర్ల వివాదం చోటుచేసుకుంది. రావి వెంకటేశ్వరరావు, టీడీపీ యువనేత శిష్లా వర్గాల మధ్య వివాదం జరిగింది. మహానాడు దృష్ట్యా గుడివాడలో శిష్లా లోహిత్ వర్గీయులు ఫ్లెక్సీలు కట్టారు. లోహిత్ బ్యానర్లు కత్తిరించి ప్రత్యర్థులు రావి వెంకటేశ్వరరరావు బ్యానర్లు కట్టారు. రావి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా రేపు గుడివాడలో నెహ్రూ సెంటర్లో ధర్నాకు లోహిత్ వర్గీయుల సన్నాహాలు జరుపుతున్నట్లు సమాచారం. రావి వెంకటేశ్వరరావు బ్యానర్లు మాత్రమే ఉండాలని రావి వర్గీయులు చెబుతున్నారు.

*బైక్ రేసర్లు, కుర్రకారుకి విశాఖ సిటీ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ సైలెన్సర్లు అమర్చితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ బీచ్ రోడ్డులో సిటీ పోలీసుల వాహన తనిఖీలు చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సమక్షంలో కార్యక్రమంను నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్లకు అమర్చిన సైలెన్సర్లను రోడ్డురోలర్తో సిటీ పోలీసులు ధ్వంసం చేయించారు. 631 బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్లతో తొక్కించి ధ్వంసం చేశారు.

*రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్ల పరిధి ఖరారు చేస్తూ హోం శాఖ తుది ఉత్తర్వులు జారీ చేసింది. వెయ్యికి పైగా పోలీస్‌ స్టేషన్లు, 200కు పైగా సర్కిళ్లు, 100కు పైగా సబ్‌ డివిజన్ల పరిధిని నిర్ణయించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో 18 పోలీస్‌ యూనిట్లు ఉండగా కొత్త జిల్లాలు ఏర్పడ్డాక విజయవాడ, విశాఖపట్నం కమిషనరేట్లతో కలిపి 26 పోలీస్‌ యూనిట్లు అయ్యాయి. జిల్లాల ఎస్పీల సిఫార్సులను పరిశీలించి డీజీపీ ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి తుది ప్రతిపాదనలను పంపారు. తాజాగా వాటికి హోం శాఖ ఆమోదం తెలిపింది.

*కాశీవిశ్వేశ్వరాలయం, మదురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రాజ్యాంగపరంగా, శాంతియుతమార్గంలో పోరాటం చేస్తామని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) ప్రకటించింది. శనివారం కాంచీపురంలో వీహెచ్‌పీ కేంద్ర పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్శంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ రెండు ప్రదేశాల వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నందున, వాటి తీర్పు వచ్చే వరకూ వేచి వుంటామన్నారు.

*కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా, సూళియ తాలూకాలో శనివారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముందుగా పెద్ద శబ్దం వినిపించిందని, ఆ తర్వాత దాదాపు 45 సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు ఓ వార్తా సంస్థకు తెలిపారు. ఇళ్ళలోని అరమరలలో పెట్టిన వస్తువులు క్రిందకు పడిపోయాయని చెప్పారు.

*సీపీఎ్‌సను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకురావడానికి జనసేన పార్టీగా తన వంతు ప్రయత్నం చేస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. పవన్‌ తండ్రి కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా తల్లి అంజనాదేవి.. జనసేన చేపట్టిన కౌలురైతు భరోసా యాత్రకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ఆ చెక్కును శనివారం పవన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు అనేది తన కుటుంబానికి భావోద్వేగంతో కూడుకున్న అంశమన్నారు. పాత పెన్షన్‌ విధానాన్నే తాము కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ఉద్యోగులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అబ్కారీ శాఖలో విధులు నిర్వర్తించిన తన తండ్రి 2007లో కాలం చేశారని, అప్పటి నుంచి అమ్మకు పెన్షన్‌ రావడం మొదలైందని, పెన్షన్‌ డబ్బును దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటుగా మారిందని చెప్పారు. లక్ష విరాళం ఇచ్చిన అంజనాదేవికి పవన్‌ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

*కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో వున్నారని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు అన్నారు. విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం సీతంపేట జీవీఎంసీ పాఠశాలలో జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో సీపీఎస్‌ రద్దుపై 122సార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

* జనసేన కౌలు రైతు భరోసాకు మెగా బ్రదర్స్ మాతృమూర్తి అంజనాదేవి ఆర్థిక సాయం చేశారు. పెన్షన్ డబ్బు నుంచి రూ. లక్షన్నరను ఆమె తన కుమారుడు పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. పార్టీ కోసం మరో రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. కొణిదెల వెంకట్రావు జయంతి సందర్భంగా ఈ విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మా తండ్రి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. పెన్షన్ డబ్బులను కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి అమ్మ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. పెన్షన్ డబ్బులను దాచి సహాయ కార్యక్రమాలకు ఇవ్వడం అమ్మకు అలవాటు. ఇవాళ కౌలు రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి విరాళంగా ఇచ్చింది. పెద్ద మనసుతో ఆమె చేసిన ఈ పనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.’’ అని పేర్కొన్నారు.

*సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు కేసుల్లో స్వాధీనం చేసుకొన్న 821 వాహనాలను వేలం వేయనున్నట్లు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. సీజ్‌ చేయబడిన వాహనాల నెంబర్లు ఇతర వివరాలు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. వేలంపై అభ్యంతరాలున్న వాహన యాజమానులు ధ్రువపత్రాలతో సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. వేలానికి సంబంధించిన వివరాల కోసం ఎంటీఓ విష్ణు 9490617317ను సంప్రదించాలని కోరారు.

*గత నెల మొదటి వారంలో ఆకాశన్నంటిన టమోటా ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రామకుప్పం, కుప్పం, పలమనేరు, ఏడోమైలు మార్కెట్లలో 15 కిలోల బాక్సు శుక్రవారం వరకు రూ.400నుంచి రూ.450 వరకు పలికింది. ఈ ధర శనివారం రూ.350 నుంచి రూ.400కు పడిపోయాయి. ఇదే సమయంలో సోమల మార్కెట్‌లో 15కిలోల బాక్స్‌ ధర రూ.300 పలికింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అధిక దిగుబడులు రావడంతో పాటు జిల్లావ్యాప్తంగా రైతులు తాము పండించిన టమోటాలను మార్కెట్లకు తరలిస్తుండడంతో ధరలు తగ్గుతున్నాయి. వారం రోజుల క్రితం మచ్చలు కల్గిన, చిన్నసైజు కాయల బాక్సు రూ.250 నుంచి రూ.350 వరకు పలికింది. ప్రస్తుతం అటువంటి కాయల కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. బాక్సు ధర రూ.350 వరకు పలికితే పెట్టుబడి గిట్టుబాటై కాస్తోకూస్తో లాభాలు వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. టమోటా ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం కిలో రూ.30 నుంచి రూ.40 పలుకుతోంది.

*ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పాము కనిపించడంతో వైద్యులు, వైద్య విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. శనివార ఉందయం 10 గంటలకు ఉస్మానియా పాత భవనంలోని జనరల్‌ సర్జరీ విభాగం వద్దకు ఓ పాము రావడంతో వైద్య విద్యార్థులు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఆస్పత్రి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్నేక్‌ సొసైటీ ప్రతినిధులను పిలిపించారు. వారు పామును పట్టుకోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా వర్షాకాలం వచ్చిందంటే ఉస్మానియాలో పాముల బెడద తీవ్రంగా ఉంటుందని, ఆస్పత్రికి ఆనుకొని మూసీ ఉండడంతో అందులో నుంచి పాములు వస్తున్నట్టు పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

*ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్స్‌ అదరగొడుతున్నారు. లీసెస్టర్‌షైర్‌ కౌంటీతో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో శనివారం విరాట్‌ కోహ్లీ (67), శ్రేయాస్‌ అయ్యర్‌ (62), జడేజా (56 బ్యాటింగ్‌) అర్ధసెంచరీలు సాధించారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 92 ఓవర్లలో 7 వికెట్లకు 364 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు 366 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. భరత్‌ (43), శార్దూల్‌ (28), పుజార (22) ఫర్వాలేదనిపించారు. లీసెస్టర్‌షైర్‌ తరఫున ఆడుతున్న సైనీకి మూడు, నాగర్‌కోటికి రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 82/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ తొలి సెషన్‌లో త్వరగానే వికెట్లు కోల్పోయింది. జడేజా ఓసారి డకౌట్‌ కాగా, శ్రేయాస్‌ కూడా రనౌటయ్యాడు. అయితే పుజారా, కోహ్లీ నిష్క్రమణ తర్వాత ఈ ఇద్దరినీ మరోసారి బరిలోకి దించారు.

* గొర్రెల స్కీం పేరుతో రూ.8 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారన్న ఆరోపణపై మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల పశువైద్య ఉపకేంద్ర జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌ సజ్జా శ్రీనివాసరావు ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ ఎస్‌.రామచందర్‌ శనివారం సస్పెన్షన్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ కేసులో శీనివాసరావును ఈ నెల 9న ఘటకేసర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో ఆయన భార్య లక్ష్మితో పాటు బావ అనిల్‌కుమార్‌, మరో వ్యక్తి అరవింద్‌ కుమార్‌నూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆర్జితసేవ టికెట్ల సెప్టెంబరు నెల కోటాను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను సోమవారం సాయంత్రం 4గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల కోటాను ఎప్పటిలానే డిప్‌ విధానంలో భక్తులకు కేటాయించనున్నారు. ఈ కోటాను సోమవారం ఉదయం 10 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

*న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ అధికారులు శనివారం నోటీసు జారీ చేశారు. గతంలో ఆమంచి సీబీఐ విచారణకు వెళ్లివచ్చారు. ఇటీవల సీబీఐ నోటీసు జారీ చేసినప్పటికి వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో సీబీఐ అధికారులు మరోసారి నోటీసు ఇచ్చేందుకు వచ్చారు. ఆమంచి జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు వచ్చి తీసుకున్నారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపినట్లు సమాచారం.

* రాష్ట్ర ప్రభుత్వం అక్రమ బదిలీలకు తెరతీసి, గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిన బదిలీలు చేయడం వల్ల కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అందరికీ పారదర్శకంగా సాధారణ బదిలీలు నిర్వహించాలని సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి పినాకపాణి, గౌరవాధ్యక్షుడు రమేష్‌ ఓ ప్రకటనలో కోరారు.

*రెండేళ్లు పూర్తి చేసుకుని, డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ పాసైన గ్రామ, వార్డ్‌ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ప్రకటిస్తూ గ్రామ, వార్డ్‌ సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 1 నుంచి వీరికి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.15 వేల పారితోషికం అందుకుంటున్న ఈ ఉద్యోగులు ఇక నుంచి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5 ఉద్యోగులు రూ.23120, మిగిలిన 18 రకాల సచివాలయ కార్యదర్శులు రూ.22460లు బేసిక్‌ జీతంగా పొందనున్నారు. మొదటి విడతలో నియమితులై డిపార్టుమెంట్‌ టెస్ట్‌లు పాసైనవారిని మాత్రమే రెగ్యులరైజ్‌ చేయనున్నారు. వీరు 70వేల మంది ఉంటారని అంచనా. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1.35 లక్షల సచివాలయ పోస్టులు మంజూరు చేయగా, ఇప్పటికి రెండు విడతల్లో 1.21 లక్షల పోస్టులను భర్తీ చేశారు.

*అధికార మదంతో ప్రవర్తిస్తే, అధికార మదం తలకెక్కితే ప్రజలు వాత పెడతారని నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దని వైసీపీ శ్రేణులకు సూచించారు. శనివారం నెల్లూరులో జరిగిన రూరల్‌ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ నాయకులకు, సర్పంచ్‌లకు, కార్యకర్తలకు చెబుతున్నా. ఎక్కడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దు. ఇబ్బందులు పెట్టవద్దు. మనం ఎంత తగ్గితే అంత మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను శత్రువులుగా చూడవద్దు. వారిని రాజకీయాల్లో పోటీదారులుగానే చూడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా.. మనం జనంకు జవాబుదారీగా ఉన్నాం. జగన్‌కు జవాబుదారీగా ఉన్నాం. అందరినీ ప్రేమిద్దాం. అందరినీ మిత్రులుగా చూద్దాం. శత్రువులుగా వద్దు. అధికార మదం తలకెక్కితే, అధికార మదంతో ప్రవర్తిస్తే ప్రజలు చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన విధంగా వాత పెడతారు సోదరులారా’’ అని అన్నారు. అధికారులు, ఉద్యోగులపై పెత్తనం చెలాయించవద్దని సూచించారు. మంచితనంతో వారితో పనులు చేయించుకోవాలని, అధికారం ఉంది కదాని వారితో దురుసుగా ప్రవర్తించకూడదని కోటంరెడ్డి హితవు పలికారు.

*జగన్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావ డం ఖాయమన్నారు. ప్రజావేదికను కూల్చి మూడేళ్లైన సందర్భంగా.. పార్టీ శ్రేణులతో కలిసి ప్రజావేదికను సందర్శించేందుకు శనివారంవెంకన్న విజయవాడ నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నా రు. బుద్దా మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నిరంతరం పనిచేశారని గుర్తుచేశారు. జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని కూలగొట్టడానికి ప్రజావేదికతో కూల్చివేతలు ప్రారంభించారన్నారు. రాష్ట్ర ప్రజ లు జగన్‌కు 151 సీట్లు ఇస్తే, సైకో రాష్ట్రాన్ని నాశనం చేశాడని మం డిపడ్డారు. పోలీసులను చట్టపరంగా పనిచేయకుండా వారిపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అఽధికారంలోకి రాగానే ప్రజావేదికను నిర్మిస్తామని తెలిపారు.

* సీడ్‌మనీతో పాటు ఆపరేషన్‌ ఫ్లో చార్ట్‌, 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌పై చర్చించడానికి వీలుగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఉప కమిటీ సమావేశం 30న జరుగనుంది. గెజిట్‌ అమలు కోసం తెలుగు రాష్ట్రాలు విధిగా రూ.200 కోట్లను బోర్డు ఖాతాలో జమ చేయాలని కేంద్రం నిర్దేశించిన విషయం విదితమే. దాంతో పాటు షెడ్యూల్‌-2లోని ప్రాజెక్టుల నిర్వహణను పర్యవేక్షించడానికి వీలుగా రూపొందించిన ఆపరేషన్‌ ఫ్లో చార్ట్‌పై చర్చించనున్నారు.

*తెలంగాణలోని శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌తో పాటు ఐదు ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్‌ శ్రీవాస్తవ అధ్యక్షతన 4 రాష్ట్రాల అధికారులతో ఈనెల 27న సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, వరదల నిర్వహణపై చర్చిస్తారు. దీనికి హాజరుకావాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ అధికారులకు ఆహ్వానం పంపించారు.

*హైదరాబాద్‌కు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (డబ్ల్యూటీసీ) రానుంది. విస్తీర్ణంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్దది కానుంది. దాదాపు 50-60 ఎకరాల్లో.. శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలో ‘డబ్ల్యూటీసీ శంషాబాద్‌’ను అభివృద్ధి చేయడానికి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూటీసీఏ) నుంచి గత ఏడాది చివర్లో కపిల్‌ గ్రూప్‌ లైసెన్స్‌ పొందింది. శంషాబాద్‌ డబ్ల్యూటీసీతో పాటు విశాఖలో కూడా మరోటి ఏర్పాటు చేయడానికి లైసెన్స్‌ పొందినట్లు కపిల్‌ కన్సల్టెన్సీ వైస్‌ ప్రెసిడెంట్‌, డబ్ల్యూటీసీ శంషాబాద్‌, విశాఖపట్నం వైస్‌ చైర్మన్‌ వై.వరప్రసాద్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ రెండు డబ్ల్యూటీసీలను కపిల్‌ గ్రూప్‌నకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేస్తోంది. డబ్ల్యూటీసీఏ ప్రమాణాల ప్రకారం రెండు ప్రాజెక్టుల్లో దాదాపు 70-75 శాతం ఆఫీస్‌ మౌలిక సదుపాయాలు, 25-30 శాతం సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉంటుంది. హోటళ్లు, కో-లివింగ్‌ స్పేస్‌, కాన్ఫరెన్సింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సదుపాయాలు, చిరుతిళ్ల ఔట్‌లెట్స్‌ అభివృద్ధి చేస్తారు. కాగా, ‘డబ్ల్యూటీసీ శంషాబాద్‌’లో బహుళ టవర్లు ఉంటాయని.. ఒక్కో టవర్‌లో 12 అంతస్తులను నిర్మిస్తున్నామని వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. సమీపంలో విమానాశ్రయం ఉన్నందున శంషాబాద్‌ డబ్ల్యూటీసీ టవర్లు ఇతర వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్లతో పోలిస్తే తక్కువ ఎత్తులో టవర్లు ఉంటాయని పేర్కొన్నారు. మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలోని హార్డ్‌వేర్‌ పార్క్‌లో ‘డబ్ల్యూటీసీ శంషాబాద్‌’ను అభివృద్ధి చేస్తున్నారు.

*రాష్ట్రంలో ఆయుష్‌ పార్క్‌ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆయుర్వేదిక్‌ డ్రగ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(టీఏడీఎంఏ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఏడీఎంఏ జనరల్‌ సెక్రటరీ జీఆర్‌ కరుణాకర్‌ కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ విభాగానికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఫార్మా, బయోటెక్నాలజీ, ఆటోమొబైల్‌, మెడికల్‌ డివైజ్‌, ఈఎమ్‌ఎస్‌, టైక్స్‌టైల్‌, సెమీకండక్టర్‌, హార్డ్‌వేర్‌ పార్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆయుష్‌ ఇండస్ట్రీస్‌ కోసం ఇండస్ర్టియల్‌ పార్‌్డను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించాలని కోరారు. ఇక ఆయుష్‌ పార్క్‌ను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ అభివృద్ధి చేయాలని సూచించారు. అటువంటి ఆయుష్‌ పార్క్‌కు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

*పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ పట్టణ ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీయూఎ్‌ఫఐడీసీ) ద్వారా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందుకు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో రూ.3809 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిధుల నుంచి 117 పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,219 కోట్లు లాంఛనంగా కేటాయించినట్లు తెలిపింది.

*హైదరాబాద్‌ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ తేదీలను హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రకటించింది. ఈ నెల 27న పోచారం, 28న బండ్లగూడ(ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ మినహా), 29న బండ్లగూడ ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్ల లాటరీ తీస్తామని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 3,716 ఫ్లాట్లకు 39,082 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో బండ్లగూడ ఫ్లాట్లకే 33,161 అర్జీలు వచ్చాయని హెచ్‌ఎండీఏ పేర్కొంది. ఫ్లాట్ల లాటరీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, లాటరీని యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో లైవ్‌ వెబ్‌కాస్ట్‌ చేయనున్నామని, రికార్డు కూడా చేస్తామని వెల్లడించింది. వీటికి సంబంధించిన వెబ్‌ లింక్‌లను ప్రకటించింది. లాటరీ తీసిన తర్వాత ఫ్లాట్‌ నంబర్‌, దరఖాస్తుదారుడి పేరును వెల్లడిస్తామని తెలిపింది. బండ్లగూడలో 345 ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్లకు 16,679 అప్లికేషన్లు వచ్చినందున ఈ లాటరీని 29న తీస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఫ్లాట్లు దక్కించుకున్న వారి వివరాలను www.hmda. gov.in, www. swagruha.telangana.gov.in వెబ్‌సైట్లలో ఈ నెల 29 సాయం త్రం నుంచి అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఒక వ్యక్తి ఒకే ఫ్లాట్‌కు అర్హులని, ఒక వేళ రెండు ఫ్లాట్స్‌ వస్తే రద్దు చేస్తామని వెల్లడించింది. ఫ్లాట్‌ దక్కించుకున్న వ్యక్తులు వారంలోగా 10 ు ఫ్లాట్‌ రుసుము, మిగతా 80 ు అమౌంట్‌ను రెండు నెలల్లోగా, మిగతా అమౌంట్‌ను 3 నెలల్లోగా చెల్లించాలని హెచ్‌ఎండీఏ తెలిపింది.

*తెలంగాణలోని శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌తో పాటు ఐదు ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనుకుమార్‌ శ్రీవాస్తవ అధ్యక్షతన 4 రాష్ట్రాల అధికారులతో ఈనెల 27న సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, వరదల నిర్వహణపై చర్చిస్తారు. దీనికి హాజరుకావాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ అధికారులకు ఆహ్వానం పంపించారు.

*ప్రముఖ సినీ నిర్మాత, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌.. కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ క్రియాశీలంగా పని చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నివాసానికి వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేద్దాం రావాలంటూ ఆహ్వానించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, రాహుల్‌ ప్రధాని కావాలన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నదే తన ఆకాంక్ష అని బండ్ల గణేష్‌ తెలిపారు. మంచి రోజు చూసుకుని పార్టీలో క్రియాశీలం అవుతానని చెప్పారు.

*సర్కారీ దవాఖానాలు సైతం కార్పొరేట్‌ ఆస్పత్రుల ప్రమాణాలకు ఏ మాత్రం తీసిపోమంటున్నాయి. ఇంతకాలం కార్పొరేట్‌ ఆస్పత్రులకే లభించిన జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు (ఎన్‌క్వాష్‌ – నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌) ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులు సైతం సాధిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో 13 ప్రభుత్వ ఆస్పత్రులు ఎన్‌క్వాష్‌ సర్టిఫికెట్స్‌ సాధించాయి. మరో 3 ఆస్పత్రులకు ఎన్‌క్వాష్‌ రెన్యూవల్‌ లభించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 143 ఆస్పత్రులు ఈ ఘనత సాధించాయి. లేబర్‌ రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ నిర్వహణలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న నిర్మల్‌ ఏరియా ఆసుపత్రికి ‘‘లక్ష్య’’ గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ఈ గుర్తింపు ఆస్పత్రులు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.

* ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలో టీడీపీ బహిరంగ సభకు సన్నద్ధమవుతోంది. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. శనివారం ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు టీడీపీ రాష్ట్రముఖ్యులతో సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్‌రావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింలు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అరవింద్‌గౌడ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదును చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు నెలలుగా జరుగుతున్న సభ్యత్వ నమోదు సంతృప్తిగా ఉందని, ఠీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు చిలువేరు కాశీనాథ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు సామా భూపాల్‌రెడ్డి తెలిపారు.

*పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ పట్టణ ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీయూఎ్‌ఫఐడీసీ) ద్వారా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందుకు అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో రూ.3809 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నిధుల నుంచి 117 పట్టణ స్థానిక సంస్థలకు రూ.3,219 కోట్లు లాంఛనంగా కేటాయించినట్లు తెలిపింది.

*సీట్లు రద్దయిన మెడికల్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులకు ఊరట కలిగింది. వారిని రాష్ట్రంలోని ఇతర మెడికల్‌ కాలేజీలకు తరలించవచ్చని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) హైకోర్టుకు తెలిపింది. మౌలిక సౌకర్యాలు లేవని, తగినంతమంది బోధన సిబ్బంది లేరని పేర్కొంటూ ఎంఎన్‌ఆర్‌, టీఆర్‌ఆర్‌, మహావీర్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ సీట్లను ఎన్‌ఎంసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏమిటో చెప్పాలని ఎంఎన్‌ఆర్‌ కాలేజీకి చెందిన 48 మంది వైద్య విద్యార్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎన్‌ఎంసీ అఫిడవిట్‌ను సమర్పిస్తూ రద్దయిన కాలేజీల్లోని విద్యార్థులను రాష్ట్రంలోని ఇతర కాలేజీలకు తరలించవచ్చని పేర్కొంటూ మే నెలలోనే మార్గదర్శకాలు జారీచేశామని తెలిపింది. ఆయా కాలేజీల్లో సీట్లు ఖాళీ లేకపోతే ఈ ఒక్కసారికి సూపర్‌ న్యూమరీ కింద సీట్లు పెంచుకోవచ్చని తెలిపింది. అయితే మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 250కి మించరాదని తెలిపింది. సూపర్‌ న్యూమరీ సీట్లపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వానికి సూచించింది. ర్యాంకు, సీట్ల లభ్యతను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ఆయా కాలేజీలకు కేటాయించాలని తెలిపింది. ఫీజులపై కూడా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చామని పేర్కొంది.

*భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి శనివారం ఆర్జిత సేవలో భాగంగా సువర్ణ తులసార్చన నిర్వహించారు. ఈ సేవలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే స్వామి వారి నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణ ప్రక్రియలో బాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యహా వచనం, కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, యోక్త్రబంధనం, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధా రణ, బ్రహ్మముడి, తలంబ్రాలు, వేద ఆశీర్వచనం నిర్వహించారు. స్వామి వారిని ఏపీలోని అనం తపురం ఎంపీ రంగయ్య దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయనకు ఆలయ మర్యాదలతోస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండి వెలుపల వరకు క్యూలైన్ నిండిపోయింది. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పట్టనుంది. శనివారం తిరుమల శ్రీవారిని 94,411 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 46,283 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

* మచిలీపట్నం ట్రాఫిక్‌ సీఐ బాలరాజాజీ అదృశ్యమయ్యారు. ఆయన గత ఐదు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. ఇటీవల విజయవాడ నుంచి ఈ నెల 16వ తేదీన మచిలీపట్నానికి ట్రాఫిక్‌ సీఐగా బదిలీ అయ్యారు. 20వ తేదీ వరకూ విధులకు హాజరయిన బాలరాజాజీ స్నేహితుడి పల్సర్‌ బైకుపై బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు పేర్కొంటుండగా. దైవభక్తి ఎక్కువగా ఉండే బాలరాజాజీ ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి ఉండొచ్చనే స్నేహితులు భావిస్తున్నారు..