ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ -పాస్‌పోర్ట్‌ను ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి తీసుకొని రానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పాస్ పోర్ట్ కార్యకలాపాలు కొనసాగుతాయి. 2008లో తొలిసారి కేంద్రం పాస్‌పోర్ట్ సేవల్ని ఆన్‌లైన్‌లో అందించడం ప్రారంభించింది. ఇప్పుడు 2వ సారి టీసీఎస్ సంస్థ భాగస్వామ్యంతో ఈ- పాస్‌పోర్ట్ సేవల్ని అందించనుంది.
ఇమ్మిగ్రేషన్ అంటే?
ఇమ్మిగ్రేషన్ అంటే ఉదాహరణకు భారత్‌కు చెందిన వ్యక్తి అమెరికాలో శాస్వతంగా ఉండేందుకు,లేదంటే పౌరసత్వం పొందేందుకు ఆ దేశ అనుమతి తప్పని సరి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అనుమతి కోసం జరిగే ప్రాసెస్‌ను ఇమ్మిగ్రేషన్ అంటారు. ఈ ఇమ్మిగ్రేషన్ కోసం కేంద్రం,టీసీఎస్‌లు సంయుక్తంగా ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-పాస్‌పోర్ట్‌పై టీసీఎస్ పబ్లిక్ సెక్టార్ బిజినెస్ యూనిట్ విభాగం ప్రతినిధి తేజ్ బట్లా స్పందించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డిసెంబర్ నాటికే వినియోగదారులకు ఈ-పాస్‌పోర్ట్‌లను అందించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పాస్‌పోర్ట్‌లను చిప్‌లతో ఆధునీకరించనున్నట్లు తేజ్‌బట్లా వెల్లడించారు.
పలు నివేదికల ప్రకారం..
పలు నివేదికల ప్రకారం..ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌లో జరిగే అవకతవకల్ని అరికట్టేందుకు ఇంట్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐడీఏఓ) సెక్యూర్ బయోమెట్రిక్ డేటాతో ఈ-పాస్ పోర్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో దేశానికి ఒక్కో డిజిటల్ సిగ్నేచర్‌తో ఉన్న ఈ చిప్‌లలో పాస్‌పోర్ట్ వినియోగదారుల బయోగ్రఫికల్ డేటాతో పాటు డిజిటల్ సెక్యూరిటీ ఫీచర్ల డేటా ఉంటుంది. ఆ డేటా సాయంతో ఇమ్మిగ్రేషన్‌లో తలెత్తే లోపాల్ని అరికట్టవచ్చు.
సెమీకండక్టర్ చిప్ సమస్య
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో సెమీకండక్టర్ చిప్ తయారీ తగ్గిపోయింది. దీంతో అన్నీ డివైజ్‌లలో ఉపయోగించే చిప్ కొరత ఆయా సంస్థల్ని తీవ్రంగా వేదిస్తోంది. కానీ ఈ-పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ముందుగానే కావాల్సిన చిప్‌లను సిద్ధంగా ఉంచుకుందని తేజ్ బట్లా తెలిపారు.
రెండు డేటా సెంటర్లు
ఈ-పాస్‌పోర్ట్ వినియోగదారుల డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్ల అవసరం ఎక్కువగా ఉంది. అందుకే దేశ వ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న డేటా సెంటర్లను ఆదునీకరించనున్నట్లు వెల్లడించారు.
టీసీఎస్ లక్ష్యం అదే
ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్న టీసీఎస్ వినియోగదారులకు అందించే సేవల్ని మరింత సులభతరం చేయనుంది. చాట్ బోట్, బయోమెట్రిక్‌తో ఆటో రెస్పాన్స్ వంటి ఫీచర్లను ఈ ఈ-పాస్ పోర్ట్‌కు జత చేయనుంది.