Devotional

కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం ఇదే

కామాక్షీ దీపం దాని వైశిష్ట్యం ఇదే

దీపారాధన ప్రతి ఇంట్లోనూ సంప్రదాయంగా ఉండేవాళ్ళు చేస్తారు. ఈ దీపారాధనలో కూడా బోలెడు రకాలు ఉంటాయి. ఫలితాన్ని ఆశించి వివిధ రకాలుగా దీపారాధన చేసేవాళ్ళు ఉన్నారు. అయితే దీపాన్ని దేవుడి ముందు వెలిగించడం ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవడం అనేది అందరి అభిప్రాయం మరియు ఆకాంక్ష. ఇక దీపాలలో కామాక్షి దీపానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. కానీ దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ.

కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపాన్ని గజలక్ష్మీ దీపం అనికూడా అంటారు. దీపాన్ని వెలిగించినపుడు ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కాబట్టే దీన్ని కామాక్షీ దీపం అంటారు.ఇక కామాక్షి దేవి ప్రత్యేకత గురించి చెప్పుకుంటే సర్వదేవతలకూ శక్తినిచ్చే శక్తి కామాక్షిదేవికి ఉంటుందని ప్రతీతి. దీన్నీ ఒక చిన్న విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. కామాక్షీ దేవి కోవెల లేదా గుడి తెల్లవారుఝామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరుస్తారు. ఆ తరువాత రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూసివేస్తారు. అంటే మొదట అమ్మవారి గుడి తలుపు తెరిచాక మిగిలిన గుడులు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుంది. తరువాత అన్ని గుడులు మూసివేశాక, అందరు దేవతలు విశ్రాంతిలోకి వెళ్ళాక తను విశ్రాంతి తీసుకుంటుంది. ఇకపోతే ఈ కామాక్షి దీపం స్వయానా అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. అలాంటి కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది.

కామాక్షీ దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. అంటే విలువైనది అంటే ఇక్కడ వెలకట్టలేనిది, పవిత్రమైనది అని కూడా అర్థం. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్ళలో ఉండే ఆచారం. చాలామంది ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడూ, అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని ఉపయోగిస్తారు. కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది. అంటే అమ్మవారి బొమ్మ ఈ దీపం మీద ఉంటుంది. ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టమని శాస్త్రం మరియు పండితులు చెబుతున్నారు. కామాక్షీ దీపం వెలిగించినప్పుడు తప్పనిసరిగా పాటించవలసిన నియమం ఒకటుంది. దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం. కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షింతలు వేసి నమస్కరించుకోవాలి.అలా చేస్తే నేరుగా అమ్మవారికి కుంకుమ పెట్టి, అమ్మ ఆశీర్వాదం తీసుకున్నంత పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి సాంప్రదాయాన్ని వదలకుండా ఇలాంటి గొప్ప పద్ధతులను తరాలు అందిపుచ్చుకోవాలి. అప్పుడే ప్రతి ఇల్లు సంతోషంలో ఉంటుంది.