* కర్నూలు, విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తామని ప్రిటింగ్, స్టేషనరీ కమిషనర్ ఎబీ వెంకటేశ్వర రావు తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయాన్ని పరిశీలించాక ఆయన మాట్లాడారు. ముద్రణ యంత్రాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ముద్రణ యంత్రాలయంలో నిపుణులైన సిబ్బంది ఉన్నా.. వారికి సరిపడా పనిలేదన్నారు. కొన్ని యంత్రాలు బాగున్నాయని, మరికొన్ని తుప్పు పట్టాయని తెలిపారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో పని కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
*తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖులు ఇవాళ దర్శించుకున్నారు. కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బగేల్, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ , సినీనటుడు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రముఖులకు స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం రంగనాయకమ్మ ఆలయంలో వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
*ఏపీ రాజధాని అమరావతి భూములు, భవనాలపై ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను అంగీకరించే ప్రసక్తేలేదని అమరావతి ఐక్య కార్యచరణ సమితి నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే తాము మళ్లీ కోర్టుకు వెళ్తామని వెల్లడించారు. భూమిలిచ్చింది రాజధాని నిర్మాణానికే గానీ లీజుల కోసం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు ఉద్యోగులకు ఇస్తే ప్రభుత్వానికి అద్దెభత్యం భారం తగ్గుతుందని అన్నారు.
* మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఈసీ నమోదు చేసిన కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2014 ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై లగడపాటి ముందుగానే అంచనాలను వెల్లడించారంటూ అప్పటి ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు సాక్షులను కోర్టు విచారించింది. అలాగే వీడియో, ఆడియో రికార్డింగ్‌లను న్యాయస్థానం పరిశీలించింది. కాగా… సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్ల ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది.
*భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలకు సంబంధించిన కార్యాచరణలో భాగంగా హెచ్‌ఐసీసీలో బీజేపీ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది.అన్ని శాఖల అధికారులతోబీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్శి వకుమార్ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు.జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో పలువురు నాయకులు అధికారులతో భేటీఅయి ఏర్పాట్లపై చర్చించారు. సమావేశాల సందర్భంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
*కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నాటక లోని కాలా బురగీ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ లోని బొల్లారం కు చెందిన అర్జున్ కుమార్, అతని భార్య సరళ, కుమారుడు వివన్, K.అనిత,గోదేఖీ ఖబర్ కు చెందిన శివకుమార్, అతని భార్య రవళి, కుమారుడు దీక్షిత్ లు మరణించారు. మరో 7 గురు గాయపడగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోమవారం తన కార్యాలయంలో కంటోన్మెంట్ MLA సాయన్న, కలెక్టర్ శర్మన్ లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
*రూ. 2,500 కోట్ల వరకు షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను బజాజ్ బోర్డు ఆమోదించినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ సోమవారం వెల్లడించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు, సోమవారం జరిగిన సమావేశంలో… ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూపులు మినహా ప్రస్తుత వాటాదారుల నుండి రూ. 10 ముఖ విలువ కలిగిన కంపెనీ యొక్క పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను ఓపెన్ నుండి బైబ్యాక్ చేసే ప్రతిపాదనను ఆమోదించింది.
*ఉన్నతాధికారుల ఫొటోలు, పేర్లతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ గజారావ్ భూపాల్ కోరారు. ‘‘డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను డిస్‌ప్లే పిక్చర్ (డీపీ) గా పెట్టి మోసం చేస్తున్నారు. దీంతో కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్నాం. డీజీపీ డీపీతో వాట్సాప్ ద్వారా అందరికి మెసేజ్ చేసి, డబ్బులు అడుగుతున్నారు. గతంలో I &PR ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేరుతో కూడా డబ్బులు వసూలు చేశారు. ఇలా చాలా మంది ఐఏఎస్, IPS ఆఫీసర్ల పేరుతో మోసం చేస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
*తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. టికెట్లు పొందిన వారి జాబితాను నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 46,470 టికెట్లలో లక్కీడిప్ ద్వారా 8,070 టికెట్లు కేటాయించారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించారు.లక్కీడిప్ టికెట్ల జాబితా వెబ్‌సైట్లో ఉంచినట్లు వివరించారు. జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో లక్కీడిప్ టికెట్ల కోసం భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అదేవిధంగా భక్తులకు ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు.కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జూన్ 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయని తెలిపారు.
*ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్‌ధామ్ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది. అయితే రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. వీరిలో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో 97 మంది, బద్రీనాథ్ ధామ్ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది ఉన్నారని తెలిపింది. గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలతోనే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నది.మే 3 నుంచి ఇప్పటివరు 25 లక్షల మందికిపైగా యాత్రికులు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని వెల్లడించింది. అయితే వాతావరణంలో మార్పులు, వర్షాలు పడుతుండటంతో గత వారంరోజులుగా యాత్రికుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. కాగా, యాత్రకు రావడానికి ముందే భక్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సూచించింది.
*పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామ శివార్లలో రెండు ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్థులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామంలోకి రాకుండా యువకులు కర్రలతో కావాలి కాస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందడంతో వారు ఎర్రగూడూరు గ్రామానికి చేరుకున్నారు. రెండు నెలలుగా ఎలుగు బంట్లు సంచారిస్తున్నాయని స్థానికులు చెబుతున్నాయి.
*కడప: జిల్లా వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉపసంహరించాలంటూ నిరసన చేపట్టారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టర్‌కు టీడీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వం టెట్ పరీక్ష ఉపసంహరించుకోకపోతే ఇడుపులపాయను ముట్టడిస్తామని హెచ్చరించారు. వచ్చే నెల 7, 8 తేదీల్లో సీఎం జగన్ జిల్లా పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు.
*మదనపల్లి మార్కెట్‌కు టమాటా పోటెత్తింది. టమాటా విక్రయానికి రాక దాదాపు 1500 టన్నుల టమాటా లారీలు, ట్రాక్టర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతుల ట్రాక్టర్ల నుంచి టమాటాలు అన్‌లోడ్ కాని పరిస్థితి నెలకొంది. మార్కెట్ సిబ్బంది పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*నభూతో నభవిష్యత్ అన్న విధంగా గుడివాడలో టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు సభను విజయవంతం చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. సోమవారం గుడివాడలో టీడీపీ నేతలు మీడియాత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… కరిఫ్‌లో కృష్ణా డెల్టా రైతాంగానికి జరిగే నష్టాన్ని గుర్తించిన రైతాంగం చంద్రబాబు సభలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 2020 నాటికి పోలవరం పూర్తి అన్న ప్రభుత్వం నేడు రైతాంగాన్ని నిండా ముంచిందని మండిపడ్డారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే జగన్ ప్రభుత్వం పట్టిసీమను నిర్వీర్యం చేస్తోందన్నారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు వ్యవస్థలను పాతి పెట్టేస్తున్నారని విమర్శించారు. ఓపిక నశించి తప్పక చంద్రబాబు రోడ్డెక్కారని తెలిపారు. చంద్రబాబు సభలతో ఉత్తరాంధ్రలో వైసీపీ కనుమరుగు ఖాయమని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
*ఆవుపాల ఉత్పత్తిదారులకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశీయ జాతి ఆవుల కొనుగోలుపై రూ.25,000 వరకు సబ్సిడీని ప్రకటించారు.హర్యానా రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖట్టర్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌లో రెండు నుంచి ఐదెకరాల భూమి ఉన్న రైతులు స్వచ్ఛందంగా సహజ వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారని, వారికి దేశవాళీ ఆవులను కొనుగోలు చేసేందుకు సబ్సిడీని అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి బ్లాక్‌లో సహజ వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేస్తామని ఖట్టర్ తెలిపారు.
*నంద్యాల ఖలీల్ థియేటర్ వద్ద టీడీపీ నేత ఫిరోజ్ ఆధ్వర్యంలో సీఎం జగన్ రెడ్డి మోసపూరిత విధానాలను ఖండిస్తూ నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఫరూక్, రాష్ట్ర మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏ.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు మౌలాన ముస్తాక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి అనేది పార్టీ నిర్ణయమని పేర్కొన్నారు. అందరం కలిసి పనిచేసి టీడీపీని గెలిపిద్దామన్నారు. చంద్రబాబును సీఎం చేద్దామని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.
*హైదరాబాద్: నగరంలో నిన్న కురిసిన వర్షానికి కొండాపూర్ మెయిన్ రోడ్డు కుంగిపోయింది. ఆ సమయంలో అక్కడ పని చేసే వారు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్‌లో నూతనంగా చేపడుతున్న అండర్ పాస్, ప్లై ఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు. కాగా… సేఫ్టీ పాటించకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*ప్రపంచంలోని తెలుగు వారంతా ఈ నెల 29న గుడివాడ లో జరగనున్న టీడీపీ మినీ మహానాడు వైపే చూస్తున్నారని ఆ పార్టీ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణరావు అన్నారు. ఆదివారం మచిలీపట్నం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మినీ మహానాడు షెడ్యూల్‌ను వివరించారు. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హనుమాన్ జంక్షన్ నుంచి చంద్రబాబు రోడ్ షోగా బయలుదేరుతారని, సాయంత్రం 5గంటలకు అంగలూరులోని సభా వేదికకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. రాత్రి 10 గంటలకు నిమ్మకూరులో బస చేసి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నంలోని గోల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జులతో సమీక్షిస్తారని చెప్పారు. అంగలూరు సభలో లక్షలాది మంది పాల్గొంటున్నారని, వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు.
*న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ అధికారులు శనివారం నోటీసు జారీ చేశారు. గతంలో ఆమంచి సీబీఐ విచారణకు వెళ్లివచ్చారు. ఇటీవల సీబీఐ నోటీసు జారీ చేసినప్పటికి వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో సీబీఐ అధికారులు మరోసారి నోటీసు ఇచ్చేందుకు వచ్చారు. ఆమంచి జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు వచ్చి తీసుకున్నారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపినట్లు సమాచారం.
*రెండేళ్లు పూర్తి చేసుకుని, డిపార్ట్‌మెంటల్ టెస్ట్ పాసైన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటిస్తూ గ్రామ, వార్డ్ సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 1 నుంచి వీరికి కొత్త జీతాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.15 వేల పారితోషికం అందుకుంటున్న ఈ ఉద్యోగులు ఇక నుంచి పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 ఉద్యోగులు రూ.23120, మిగిలిన 18 రకాల సచివాలయ కార్యదర్శులు రూ.22460లు బేసిక్ జీతంగా పొందనున్నారు. మొదటి విడతలో నియమితులై డిపార్టుమెంట్ టెస్ట్‌లు పాసైనవారిని మాత్రమే రెగ్యులరైజ్ చేయనున్నారు. వీరు 70వేల మంది ఉంటారని అంచనా. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1.35 లక్షల సచివాలయ పోస్టులు మంజూరు చేయగా, ఇప్పటికి రెండు విడతల్లో 1.21 లక్షల పోస్టులను భర్తీ చేశారు.
*ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తున్న కొన్ని మద్యం బ్రాండ్లలో తీవ్ర అనారోగ్యానికి దారితీసే ప్రమాదకర రసాయనాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణ చేసింది. అతి పెద్ద ల్యాబ్‌లో తాము చేయించిన పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను ఆ పార్టీ నేతలు శనివారం ఇక్కడ బయటపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులు పంచుమర్తి అనురాధ, ఆనం వెంకట రమణా రెడ్డి, రసాయన నిపుణుడు వరుణ్ కుమార్ విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం షాపుల్లో తాము కొనుగోలు చేసిన ఆంధ్రా గోల్డ్, సిల్వర్ స్టైప్స్ విస్కీ, నైన్ సీ హార్స్ బ్రాండ్లను లాబ్‌లో పరీక్ష చేయిస్తే దిగ్ర్భాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయన్నారు. ఆరోగ్యానికి తీవ్రంగా నష్టం కలిగించే రసాయనాలు వీటిలో ఉన్నాయని చెప్పారు. ఆ రసాయనాలు ప్రభుత్వ మద్యం బ్రాండ్లలో ఉన్నాయో లేదో ప్రభుత్వం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
*ధూళిపాళ్ల వీరయ్యచౌదరి(డీవీసీ) మోమోరియల్ చారిటబుల్ ట్రస్టు స్వాధీనానికి ప్రభుత్వం మరోసారి ప్రయత్నించింది. ట్రస్టును దేవదాయశాఖ చట్టం కింద రిజిస్టర్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల జిల్లాలోని పాడి రైతులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. డీవీసీ ట్రస్టు ఆధ్వర్యంలో సంగం డెయిరీ పరిధిలోని వడ్లమూడిలో అధునాతన హాస్పిటల్‌ను నిర్మించి పాడి రైతులకు, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని రాయితీపై అందిస్తున్నారు.
*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకున్నారు. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఆలయ కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత ్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. తలనీలాలు సమర్పించే భక్తులతో కల్యాణకట్ట రద్దీగా మారింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్.రమాదేవి నేతృత్వంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వేళలో గంట పాటు వర్షం కురవడంతో భక్తులు కొంత ఇబ్బందులకు గురయ్యారు.
*పుణెకు చెందిన ప్రీతి మస్కే అలా్ట్ర సైక్లింగ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. లేహ్ నుంచి మనాలి వరకు ఉన్న 430 కిలో మీటర్ల దూరాన్ని 45 ఏళ్ల ప్రీతి సైకిల్ తొక్కుకుంటూ 55 గంటల 13 నిమిషాల్లో చేరుకొంది. ఈ సాహసోపేతమైన ఫీట్ సాధించిన తొలి మహిళగానూ ప్రీతి నిలిచింది. ఆమె ఫీట్‌కు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కగల అర్హత ఉందని అధికారులు తెలిపారు. 6 వేల కిలోమీటర్ల గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌ను చుట్టేసిన వేగవంతమైన మహిళా సైక్లిస్ట్‌గా కూడా ప్రీతి రికార్డు నెలకొల్పింది.
* ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్‌గా శాంతిలాల్ జైన్ (నెల్లూరు) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం మచిలీపట్నంలో జరిగింది. అసోసియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కపిలవాయి విజయకుమార్, చీఫ్ ఆర్గనైజర్‌గా శాంతిలాల్ జైన్, గౌరవాధ్యక్షుడిగా నంబూరి శంకర్‌రావు, ముఖ్య కార్యదర్శిగా బొమ్మిశెట్టి శంకరరావు, కోశాధికారిగా అనీల్‌కుమార్‌జైన్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎం.గిరీష్ కుమార్, జె.విశ్వనాఽథ్, బి.మల్లేశ్వరరావు ఎన్నికయ్యారు.
* కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీలు)ల్లో 2022-23గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించినట్లు సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్వి ఆదివా రం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 27 నుంచి జూలై 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అనాథలు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు అర్హులని తెలిపారు. https://apkgbv.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
*శ్రీకాకుళం జిల్లా నుంచి సోమవారం అమ్మఒడి మూడోవిడత పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం వేదిక గా సీఎం బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 43.96 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతా ల్లో రూ.6594.6 కోట్ల నగదు జమచేయనున్నారు. తొలుత లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం 11.25 గంటల నుంచి 12.10 గంటలకు బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు. 12.15 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా మూడోవిడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ దఫా బహిరంగసభ మధ్యలో జనం వెళ్లిపోకుండా ఏర్పాట్లు చేశారు.
*తిరుమల నుంచి తిరుపతికి చేరుకునే మొదటి ఘాట్‌లో మళ్లీ ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. గురువారం ఏనుగుల ఆర్చ్ ఏడో మైలు మధ్యలో ఏనుగుల గుంపు రోడ్డుకు అతిసమీపానికి రావడంతో వాహనదారులు భయబ్రాంతులకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో సుమారు ఏనుగులు ఆదివారం సాయంత్రం రోడ్డు సమీపానికి వచ్చాయి. వీటిని చూసిన వాహనదారులు హడలిపోయారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ విజిలెన్స్ అఽధికారులు అక్కడికి చేరుకుని ఏనుగులు అడవిలోకి వెళ్లేలా శబ్దాలు చేశారు. ఏనుగుల గుంపును పూర్తిగా దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
*సెప్టెంబరు నెలకు సంబంఽధించిన శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది. మొత్తం టికెట్లలో లక్కీడిప్ ద్వారా 8,070 టికెట్లను కేటాయించనున్నారు. మిగిలిన 38,400 టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన జారీ చేయనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవా టికెట్లను లక్కీడిప్ ద్వారా కేటాయిస్తారు. ఈ కోటా కోసం సోమవారం ఉదయం 10 నుంచి 29వ తేదీ ఉదయం 10 గంటల వరకు ‘తిరుపతిబాలాజీ.జీవోవీ.ఇన్’ టీటీడీ వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ లక్కీడి్‌పలో ఎంపికైన భక్తులకు ఎస్‌ఎంఎస్, ఈ మెయిళ్ల ద్వారా తెలియజేస్తారు. అలాగే వెబ్‌సైట్‌లోనూ ఎంపికైన వారి జాబితాను అప్‌లోడ్ చేస్తారు. వీరు రెండ్రోజుల్లోపు టికెట్ ఽరుసుము చెల్లించాలి. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జూన్ 29వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తారు. వీటిని మాత్రం ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన కేటాయిస్తారు.
*తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని శనివారం రికార్డుస్థాయిలో 94,411 మంది భక్తులు దర్శించుకున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండున్నరేళ్ల పాటు శ్రీవారిని దర్శించుకోలేకపోయిన భక్తులు ప్రస్తుతం వేసవి సెలవులు, విద్యార్థులకు పరీక్ష ఫలితాల విడుదల నేపథ్యంలో భారీగా తిరుమలకు వస్తున్నారు. ఈ క్రమంలో నెలన్నర రోజుల నుంచి తిరుమల కొండ కిటకిటలాడుతోంది. ఇందులో భాగంగానే శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 94,411 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా తర్వాత ఒకే రోజులో ఇంతమంది భక్తులు దర్శించుకోవడం ఇదే మొదటిసారి. హుండీ ద్వారా రూ.3.41 కోట్ల ఆదాయం లభించగా, 46,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని టీటీడీ ఆదివారం పేర్కొంది. కాగా.. ఈ నెల 4న 90,165 మంది, 11వ తేదీన 87,698, 12న 93,400, 18న 84,982, 19న 90,471 మంది భక్తులు దర్శించుకున్న విషయం తెలిసిందే.
*బలిజ సంఘం సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా తట్టుకుని నిలబడగలిగింది బలిజలు మాత్రమేనన్నారు. కొందరు ప్రజాప్రతినిధుల మాదిరి అధికారులను భయభ్రాంతులకు, బెదిరింపులకు గురిచేసే తత్వం తనకు లేదని చెప్పారు. ఏ పనైనా సాఫ్ట్‌గా చేసుకుని వెళ్లే మనస్తత్వం కలిగిన వ్యక్తి తానని ఎమ్యెల్యే శ్రీనివాసులు తెలిపారు.
*అల్లూరి: జిల్లాలోని హుకుంపేటలో టీడీపీ నాయకులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. హుకుంపేట పీఎస్లో అరకు ఎమ్మెల్యే శెట్టిపాల్గుణపై ఫిర్యాదు చేశారు. తీగలవలసలో గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుకు.. ఎమ్మెల్యే శెట్టిపాల్గుణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
*తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
*రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, జూన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాగానీ.. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ.. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించి ఆమెకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ బీజేపీ నేత, మాజీ మంత్రి బోడ జనార్దన్.. రేవంత్ సమక్షలో కాంగ్రె్‌సలో చేరారు. ఆయనతో పాటుగా బీఎస్సీ నేత రావి శ్రీనివాస్, మెట్పల్లి జెడ్పీటీసీ రాధశ్రీనివా్‌సరెడ్డి, కోరుట్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కళ్లెం శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత శ్రీనివా్‌సరెడ్డి తదితరులూ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్లో మహిళా మంత్రే లేదని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడినీ అర్థాంతరంగా తొలగించారని పేర్కొన్నారు. బోడ జనార్థన్ మాట్లాడుతూ బీజేపీలో బీసీలు, దళితులకు న్యాయంం జరగడంలేదని, ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలూ ఎక్కువని అన్నారు. కాగా, కుత్బుల్లా పూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు ఆదివారం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రె్‌సలో చేరారు. రేవంత్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 500 మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ నేతలు పలువురు ఆదివారం సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సమక్షంలో పార్టీలో చేరారు.
*రాగల రెండు రోజులు తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురియగా… సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
*ఏజెన్సీ ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్ల పరిధిలోని గిరిజనులకు సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 75శాతం రిజర్వేషన్ ఉంటుందని రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి(టీఎ్‌సఎల్‌పీఆర్‌బీ) తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం-అసిఫాబాద్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, మహబుబాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఏజెన్సీ పోలీసు స్టేషన్లలోని గిరిజన అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రత్యేక రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీవో నంబర్ 24 ప్రకారం జారీ చేసిన ఏజెన్సీ ధ్రువపత్రాలను పరిశీలించి.. రిజర్వేషన్ అమలు చేస్తామని వివరించింది.
*ఉస్మానియా వైద్య కళాశాల ఆస్పత్రి దుస్థితికి సంబంధించిన కొన్ని చిత్రాలు, వీడియోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని, వాటిని షేర్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతిభకు మెమో జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బోధనా ప్రభుత్వ వైద్యుల సంఘం(టీటీజీడీఏ) తెలిపింది. మెమో జారీ చేయడం శోచనీయమని, ఇది వ్యక్తిగత భావ ప్రకటనను హరించేదిగా ఉందని ఆ సంఘం అభిప్రాయపడింది. మెమోను ఉస్మానియా సూపరింటిండెంట్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ సంఘం డిమాండ్ చేసింది.
*ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కారం ప్రదానం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చేపట్టారు. ఇందులోభాగంగా ఆదివారం ఎన్వీఆర్ కన్వెషన్‌లో రాఘవేంద్రరావును గజమాల, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సభకు భారీ సంఖ్యలో హాజరైన వారంతా కరతాళ ధ్వనులతో దర్శకేంద్రుడిని అభినందించారు. అనంతరం సభను ఉద్దేశించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఎన్టీఆర్ భారత రత్న కాదని, ఆయనకు ఆ అవార్డు రాలేదని ఎవరూ బాధపడవద్దని ఆయన ప్రపంచ రత్న అంటూ చేసిన ప్రసంగానికి సభికుల నుంచి పెద్ద స్పందన లభించింది. తన సినీ జన్మకు ఎన్టీఆర్ కారణమని చెప్పారు.