DailyDose

అమెరికాలో విషాదం.. 42 మంది మృతి – TNI నేర వార్తలు

అమెరికాలో విషాదం.. 42 మంది మృతి   – TNI  నేర వార్తలు

*అగ్రోరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్‌ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న దాదాపు 42 మంది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు.వివరాల ప్రకారం.. శాన్‌ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కు డోర్‌ను తెరిచిచూడగా.. అందులో దాదాపు 42 మంది చనిపోయి ఉన్నారు. 16 మంది ప్రాణాలతో బయట పడ్డారని.. వారిలో నలుగురు చిన్నారుల ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్‌ పెరిగింది. దీంతో, వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు.

*కొల్చారం మండ‌లం రంగంపేట గ్రామంలో దారుణం జ‌రిగింది. రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువ‌కులపై నుంచి ఓ ట్రాక్ట‌ర్ దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, మ‌రో ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు. అయితే ఈ ప్ర‌మాద ఘ‌ట‌న దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

*విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రాక్టర్‌.. ఇద్దరు మృతి
మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొల్చారం మండలం రంగంపేటలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు హాస్టల్‌ విద్యార్థులపై వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థి జశ్వంత్ మృతి సంఘటన ప్రాంతంలోనే మృతిచెందగా.. మెదక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో విద్యార్థి రజనీకాంత్ ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలైన విద్యార్థి చరణ్ మెదక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

*జీడిమెట్ల పారిశ్రామిక‌వాడ‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. గంప‌ల‌బ‌స్తీలోని ఎస్‌బీఐ కో ఆప‌రేటివ్ సొసైటీలోని ఓ కెమిక‌ల్ డ్ర‌మ్ముల గోదాంలో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు గోదాం అంత‌టా వ్యాపించాయి. ద‌ట్ట‌మైన పొగ‌లు అలుముకున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసుల‌కు, అగ్నిమాప‌క శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న రెండు ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. అగ్నిప్ర‌మాదం నేప‌థ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

*ధర్మవరం పట్టణంలో అధికార వైసీపీ-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నాయకులకు తలపగలడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*అన్నమయ్య: జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామ పొలాల్లో రోడ్డు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. వివాద నేపథ్యంలో సమీప బంధువులైన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్ళు, కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. కాగా అర్జునరాజు, శేఖర్ రాజు అనే ఇద్దరు వ్యక్తులు ఏకంగా పోలీసుల లాఠీలు లాక్కొని లాఠీలతో, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో రాజమ్మ, సుబ్బమ్మ, జయ్యమ్మ, సురేష్ రాజు, అనిల్ గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో తాళ్లపాకకు చేరుకున్న 108 వాహనాన్ని కూడా అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. చివరకు 108లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*బండరాయితో తలపై మోది చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తిరుపతి రూరల్‌ చెర్లోపల్లె వద్ద సోమవారం వేకువజామున ఈ దుర్ఘటన జరిగింది.ఎంఆర్‌పల్లె ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చెర్లోపల్లె మద్యం దుకాణం వద్ద ఓ మృతదేహం ఉందన్న సమాచారం పోలీసులకు అందింది. ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బండరాయితో తలపై బలంగా కొట్టడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. వ్యక్తిగత వివరాలేమీ లభ్యం కాలేదు. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే వ్యక్తిగా తేలింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

*విజయవాడ నగరంలోని బందరు రోడ్‌లోని ఒక కార్పొరేట్ కళాశాల‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే‌ అప్రమత్తమైన సిబ్బంద విద్యార్థులను బయటకు పంపేసారు. అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలాని చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. దాంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు.

* మహారాష్ట్ర ముంబై నాయక్‌నగర్‌లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన ఏడుగురిని ఏడుగురి రక్షించారు. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. అయితే, శిథిలాల కింద 20 నుంచి 25 మంది చిక్కుకుపోయినట్లుగా సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది.

* జోర్డాన్‌లోని దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ అయ్యింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్‌ అల్‌ షాబౌల్‌ తెలిపారు. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంక్‌ను రవాణా చేస్తున్న సమయంలో కిందపడిపోవడంతో గ్యాస్‌ లీకైనట్లు అధికారులు తెలిపారు. గ్యాస్‌ లీకేజీలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు పేర్కొన్నారు.

*హైదరాబాద్: నగరంలోని చింతలబస్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ MPCలో తక్కువ మార్కులతో పాస్ కావడంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చింతలబస్తికి చెందిన విద్యార్థి గౌతం కుమార్ (18) ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు మొదటగా గౌతమ్‌ను స్థానిక మహావీర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందడంతో కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబీకులు కన్నీరుమున్నీగా రోదిస్తున్నారు.

*అల్లూరి జిల్లాలో మావోయిస్టు సభ్యులు, మావోయిస్టు మిలీషియా, సానుభూతిపరులు సుమారు 60 మంది విశాఖ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళ మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.39 లక్షల నగదు, ల్యాండ్‌మైన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు.