హైదరాబాద్, ముంబై, చెన్నైతో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో 74,330 ఇళ్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 15,968తో పోలిస్తే ఇది నాలుగున్నర రెట్లు ఎక్కువ. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చినా నివాస గృహాల అమ్మకాలు ఐదు శాతం పెరిగాయి. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. గత మూడు నెలల్లో ఆర్‌బీఐ రెండు సార్లు కీలక రెపో రేట్లు పెంచింది. దాంతో గృహ రుణాల వడ్డీ రేట్లూ పెరిగాయి. అయినా వడ్డీరేట్లు ఇంకా అందుబాటులోనే ఉన్నట్టు ప్రాప్‌టైగర్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, ఈ నగరాల్లో ఇళ్ల ధరలు ఐదు నుంచి తొమ్మిది శాతం పెరిగాయి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వెంటనే గృహ ప్రవేశం చేసే ఇళ్లకు కొనుగోలుదారులు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. హైదరాబాద్‌కు చోటుఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర వాణిజ్య రియల్టీలో హైదరాబాద్‌కు చోటు దక్కింది. మొత్తం 20 నగరాలతో నైట్‌ఫ్రాంక్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలకూ చోటు దక్కింది. పట్టణీకరణ ఒత్తిళ్లు, ఉద్గారాలు, వాతావరణ ముప్పు, ప్రభుత్వ చర్యల ఆధారంగా నైట్‌ఫ్రాంక్ సంస్థ ఈ నగరాలను ఎంపిక చేసింది. టాప్-20లో బెంగళూరుకు 14, ఢిల్లీకి 17, హైదరాబాద్‌కు 18, ముంబైకి 20వ స్థానం లభించాయి.