సీనియర్ నటి పవిత్రా లోకేష్.. సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు సోషల్‌మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో ఎన్నో పాత్రలతో మెప్పించిన సీనియర్ నటి పవిత్రా లోకేష్. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితంపై రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి. ఆమె సీనియర్ నటుడు నరేశ్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ కథనాలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పవిత్ర.. కర్ణాటకలోని సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు తన పేరుతో ఫేక్ అకౌంట్స్‌ను క్రియేట్ చేసి, అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేనిపోని పుకార్లు పుట్టించి తన పేరుని చెడగొడుతున్నారని వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చారు పవిత్రా లోకేష్. ఈమె తండ్రి, ప్రముఖ నటుడు మైసూర్ లోకేష్. భర్త సుచేంద్ర ప్రసాద్, సోదరుడు ఆది లోకేష్ కూడా కన్నడలో నటులు. ప్రస్తుతం తెలుగులో పలువురు స్టార్ హీరోలకు తల్లిగా నటిస్తున్న ఆమె.. కొంతకాలం క్రితం తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటున్నారు.