గాంధీజీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఆరోగ్య యాత్రలు చేసిన ఆయుర్వేద నిపుణులు ఆచంట లక్ష్మీపతి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంతో గొప్ప సేవ చేసిన బ్రహ్మ జ్యోస్యుల సుబ్రహ్మణ్యం.. ఇలా ఇంకా ఎంతో మంది డాక్టర్లు మనకు స్వాతంత్య్రోద్యమంలో తారసపడతారు. తొలి కాంగ్రెస్ సమావేశం నిర్వహించిన ఎ.ఓ.హ్యోమ్ కూడా వైద్యులే. మరో వైద్య యోధుడు బి.సి.రాయ్!
భారత స్వాతంత్య్రోద్యమంలో లాయర్లు చాలా మంది.. గాంధీజీ, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, ఆంధ్రకేసరి.. ఇలా ఎంతోమంది కనబడతారు! డాక్టర్లు లేరా అనే సందేహం వచ్చి తరచి చూస్తే 1885లో బొంబాయిలో తొలి కాంగ్రెస్ సమావేశం నిర్వహించిన ఎ.ఓ.హ్యోమ్.. డాక్టరు కోర్సులో పట్టభద్రుడైన తర్వాత ఐసిఎస్ పూర్తి చేసిన స్కాట్లాండ్ వారని కొంచెం పరిశోధన చేస్తే బోధపడింది. 1849లో వారు భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వపు ఉద్యోగంలో చేరారు. తొలి స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఇరువైపులా జరుగుతున్న హింసాత్మక ఘటనలను గమనించి సున్నిత హృదయులైన హ్యోమ్ తల్లడిల్లేవారు.
1882లో ఐసిఎస్ పదవీవిరమణ తర్వాత భారతీయులు, ఆంగ్లేయుల మధ్య అగాధం పూడ్చాలని భావించారు. 1884లో మద్రాసులో జరిగిన దివ్యజ్ఞాన సమితి సమావేశంలో సంఘాలన్నింటిని ఏకతాటిపై తీసుకురావాలనే నిర్ణయం జరిగింది. అదే కాంగ్రెస్ పుట్టుకకు దారి తీసింది. తొలుత పూనాలో జరపాలని భావించినా కలరా మహమ్మారి కారణంగా బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో తొలి కాంగ్రెస్ సమావేశం జరిగింది. అయితే భారతీయులతో సన్నిహితంగా ఉన్నారని బ్రిటీషు వారూ, బ్రిటీషు వాడని కొందరు భారతీయులు భావించడంతో హ్యుమ్ బాగా కలత చెందారు. పక్షులను కూడా ప్రేమించే ఎ.ఓ.హ్యూమ్ 1892లో ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు, 1912లో గతించారు.
కాంపౌండర్‌గా గాంధీజీ!
ఒక డాక్టరు ప్రారంభించిన కాంగ్రెస్ సంస్థ.. డాక్టరు వంటి మరొక వ్యక్తి గాంధీజీ చేతిలో పూర్తి జవసత్వాలు పుంజుకుంది. నిజానికి డాక్టర్ కోర్సు చదవాలని గాంధీజీ ఎంతో ఉబలాట పడినా, కుటుంబ సభ్యుల కోసం బారిస్టరు చదివారు. దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటున్న గాంధీజీకి మెడిసిన్ మీద మోజు తగ్గలేదు. 1908లో చివరిసారిగా డాక్టరు కోర్సు చదవాలని భావించినా, పరిస్థితులు అనుకూలించడం లేదని ఆశను చంపుకున్నారు.
అయితే తర్వాత కొంతకాలం ప్రతిరోజు సాయంత్రం ఒక గంటపాటు కాంపౌండరుగా శిక్షణ పొందారు గాంధీజీ. అందులో గాంధీజీ నైపుణ్యం అమోఘం! గాంధీజీ పిలుపు, సూచనమేరకు దేశవ్యాప్తంగా ఆరోగ్య యాత్రలు చేసిన ఆయుర్వేద నిపుణులు ఆచంట లక్ష్మీపతి; ‘జన్మభూమి’ ఆంగ్ల వారపత్రికను నిర్వహించడంతో పాటు గాంధీజీకి కుడిభుజంగా మారిన భోగరాజు పట్టాభి సీతారామయ్య, గౌతమి సత్యాగ్రహ ఆశ్రమంతో గొప్ప సేవ చేసిన బ్రహ్మ జ్యోస్యుల సుబ్రహ్మణ్యం.. ఇలా ఇంకా ఎంతో మంది డాక్టర్లు మనకు స్వాతంత్య్రోద్యమంలో తారసపడతారు.
వైద్య మహాత్ముడు
‘డాక్టర్స్ డే’గా జూలై 1 న గుర్తు చేసుకోవల్సిన డాక్టరు బి.సి.రాయ్! రాయ్ గాంధీజీకి వ్యక్తిగత డాక్టరు, తర్వాతి దశలో డా. సుశీలా నయ్యర్‌ను గాంధీజీకి పరిచయం చేసింది కూడా ఆయనే! గాంధీజీ సూచన మేరకు 1948 జనవరి 23న బిసి రాయ్ బెంగాల్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యి, 14 సంవత్సరాలు గొప్ప సేవలందించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) ప్రారంభం కావడానికి ఆయనే కారణం. మన దేశంలో వైద్య విద్యను మలచిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ ఆయన ఆలోచనే.
జీవితాంతం బ్రహ్మచారిగా సాగిన బిసి రాయ్ మరణానంతరం తన ఇల్లును తల్లి పేరున ఆస్పత్రి నడుపుకునేలా చర్యలు తీసుకున్నారు. పేదరికంలో పెరిగిన రాయ్ వైద్య విద్య చదువుకున్నప్పుడు బెంగాల్ విభజన ప్రకటించారు. లాలా లజపతిరాయ్, అరవింద్ ఘోష్, లోకమాన్య బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి వారి స్వాతంత్య్ర పోరాటాలు ఆయన్ని ఆకర్షించాయి. శారీరకంగా, మానసికంగా దేశం బాగా ఉన్నప్పుడే స్వరాజ్యం స్థిరమని భావించి వైద్యవిద్యను పూర్తి చేశారు.