DailyDose

జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. -TNI తాజా వార్తలు

జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. -TNI  తాజా వార్తలు

* పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు ఈమేరకు నోటిఫికేషన్లు జారీ చేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 12న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని లోక్సభ, రాజ్యసభ సచివాలయాలు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. రాష్ట్రపతి ఆమోదం మేరకు ఈ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ చివరిసారిగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు సమావేశమైంది.మొత్తం 18 సిట్టింగ్ల్లో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. తొలి రోజు భారత రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. జులై 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జులై 25న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు. ఆగస్టు 6 ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా.. ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.కాగా, ప్రస్తుత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే కానున్నాయి. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్నీ కుదిరితే వర్షాకాల సమావేశాల తర్వాత జరిగే సెషన్లు.. నూతన భవనంలోనే జరిగే అవకాశం ఉందని సమాచారం.

* కర్నూలు నగర పాలక సంస్థ ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.సురేంద్రబాబు.. కాంట్రాక్టరు శ్రీనివాసరెడ్డి నుంచి రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా గురువారం అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఎస్‌ఈ పట్టుబడడం ఇంజనీరింగ్‌ విభాగంలో కలకలం రేపుతోంది. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో గత ప్రభుత్వం లో అమృత్‌ పథకం నిధులు రూ.68 కోట్లతో 430 కి.మీ మేర తాగునీటి పైపులైను, 15 వేల ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు 2018లో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన హ్యూంపైప్స్‌ సంస్థ పనులు దక్కించుకుంది. ఆ సంస్థ నుంచి కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి సబ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. 11,300 కుళాయిలు సహా 426.17 కి.మీ. పైపులైన్‌ పనులు పూర్తిచేశారు. శ్రీనివాసరెడ్డికి ఫైనల్‌ బిల్లు రూ.1.52 కోట్లు రావాల్సి ఉంది. ఆ బిల్లు ఇవ్వాలని ఇన్‌చార్జి ఎస్‌ఈ ఇ.సురేంద్రబాబును సంప్రదిస్తే రూ.35 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరులకు వివరించారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టరు కర్నూలు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శివనారాయణస్వామిని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రూ.15 లక్షలు సిద్ధంచేసి శ్రీనివాసరెడ్డి… సురేంద్రబాబును ఫోన్‌లో సంప్రదించారు. కృష్ణానగర్‌ ఫ్లైఓవర్‌ బిడ్జి దిగువకు రమ్మంటే.. అక్కడికి వెళ్లి నగదు ఉన్న బ్యాగును ఎస్‌ఈకి అందజేశారు. ఆ బ్యాగులో ఉన్న నోట్ల కట్టలు తీసుకొని చూసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. నగదు స్వాధీనం చేసుకొని ఆయన్ను కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబరుకు తీసుకెళ్లారు. అక్కడ ఎం-బుక్స్‌, పనులకు సంబంధించిన ఇతర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయనికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, కృష్ణయ్య, ఇంతియాజ్‌ ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కాంట్రాక్టరు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు… ఎస్‌ఈ సురేంద్రబాబు రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా…రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ వివరించారు.

* ఏపీలోని కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ నేటితో ముగియడంతో అతడిని పోలీసులు ఎస్కార్ట్ సాయంతో కేంద్ర కారాగారం నుంచి తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు.విచారణ అనంతరం రిమాండ్ గడువు పెంచడంతో తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. మే 23 నుంచి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు బెయిల్‌ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు కొట్టివేసింది.

*అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ ఈ నెల మూడున చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి క్యాంపు కార్యాలయం పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. దుష్టశక్తుల బారినుంచి పార్టీని కాపాడేందుకు, డీఎంకే ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ శశికళ ఈ నెల మూడున పర్యటిస్తారని పేర్కొన్నారు. మూడో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు టి.నగర్‌ నివాసం నుంచి శశికళ ప్రచార వాహనంలో బయలుదేరి గిండి, కత్తిపారా జంక్షన్‌, పోరూరు మీదుగా పూందమల్లి చేరుకుంటారు. ఆ తర్వాత కుమనన్‌ చావిడి నుంచి బయలుదేరి తిరుమళిసై, వెల్లవేడవు, పాక్కం, తామరైపాక్కం ప్రాంతాల్లో పర్యటించి పార్టీ శ్రేణులను కలుసుకుని అక్కడి నుంచి టి.నగర్‌ చేరుకుంటారు. ఈ నెల ఐదున మధ్యా హ్నం ప్రచార వాహనంలో బయలుదేరి విల్లుపురం జిల్లా దిండివనం, ఏడున వానూరు, ఎనిమిదిన కల్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేటలో పర్యటించనున్నారు.

* తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని ఏపీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రోజా, ఏపీ ప్రభుత్వ విప్‌ ప్రసాద్‌ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి, శ్రీవారి ఫొటోను అందజేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు అనునిత్యం అధికార పార్టీపై దాడులు చేస్తున్నాయని అన్నారు. గతంలో ఏ విపక్షమూ ప్రభుత్వంపై ఇలా విరుచుకు పడలేదని ఆరోపించారు. తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 31 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

*ఆ ఉద్యోగి జీతం రూ. 43వేలు. ప్రతి నెల అంతే మొత్తం వేతనాన్ని అందుకునే అతడికి గత నెల మాత్రం ఏకంగా రూ. 1.42 కోట్లు జమ అయింది. తన జీతం కంటే అది 286 రెట్లు ఎక్కువ. తొలుత ఏం అర్థం కాని సదరు ఉద్యోగి, సంస్థను సంప్రదించి విషయాన్ని తెలియజేశాడు. రికార్డుల్ని పరిశీలించి తప్పు జరిగిందని తెలుసుకున్న యాజమాన్యం, అతడికి అదనంగా పడిన మొత్తాన్ని తిరిగి తమకు చెల్లించాలని సూచించింది. అందుకు ఉద్యోగీ సరే అన్నాడు. అయితే.. ఎన్ని రోజులైనా ఆ మొత్తం సంస్థకు తిరిగిరాలేదు. ఈ నెల 2న అతడి రాజీనామా మాత్రం సంస్థకు చేరింది. ఇక ఆ తర్వాత అతడు మళ్లీ ఎవరికీ దొరకలేదు. చిలీలోని కన్సార్షియో ఇండస్ట్రియల్‌ డీ అలిమెంటో్‌స(సియల్‌) సంస్థలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చేసేది లేక సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ధనం మూలం ఇదం జగత్‌ అంటే ఇదేనేమో..!

* రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్‌ని రిటర్నింగ్‌ అధికారి తిరిస్కరించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మందాటి తిరుపతి రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పర్డివాలాతో కూడిన వేకేషన్‌ ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం-1952లోని సెక్షన్‌ 5బీ(1)(ఏ) ప్రకా రం తిరస్కరణకు గురైందన్న అంశాన్ని విస్మరించలేమని.. అందువల్ల నామినేషన్‌ని తిరస్కరించడంలో న్యాయపరమైన తప్పిదమేమీ లేదని పేర్కొంది. తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ని కొట్టివేసింది

*ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగిం ది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 5న నోటిషికేషన్‌ వెలువడుతుంది. అదే రోజు ప్రారంభమయ్యే నామినేషన్లను 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. వాటి పరిశీలన 20న చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఎన్నిక అనివార్యమైతే ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ ముగి యగానే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాగా.. ప్రతి అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయొచ్చు. రూ.15 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఓటింగ్‌ పార్లమెంటు భవనంలోనే జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగా వివి ధ రాష్ట్రాల అసెంబ్లీల్లో జరిగే అవకాశం ఉండదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదించాలి.

*పేదలందరికీ ఇళ్లు పథకంలో మొదటి విడతగా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను ఏడాదిలోపు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ బోర్డు సమావేశం నిర్ణయించింది. నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు సకాలంలో అందించాలని, జగనన్న కాలనీల్లో రహదారులు, విద్యుత్‌, నీరు తదితర మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

*వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న మంది మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసరు (ఎంపీఈవో)ల కాంట్రాక్ట్‌ సమయాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ ఏడాది మార్చితో కాంట్రాక్ట్‌ గడువు ముగియగా, 2023 మార్చి వరకు పొడిగించేందుకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆమోదం తెలిపారు.

*ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం కాకుండా, ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో ఈ చట్టం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ చట్టం ప్రకారం మండలాల్లో పనిచేసే తహసీల్దార్లు, ఎస్‌ఐలు వారానికి ఒకసారి గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తే దళితులపై దాడులు చేయకూడదనే విషయం అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదని దళిత వర్గాలకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.

*ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధుల్లో పాల్గొన్న అధ్యాపకులకు రెమ్యునరేషన్‌ వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. మూల్యాంకనానికి 25 శాతం విడుదల చేసిన ప్రభుత్వం, ప్రాక్టికల్స్‌, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఉత్పన్నం కాలేదన్నారు.

*ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను మరో 10 నెలలపాటు కొనసాగించేలా రెన్యువల్‌ చేస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది. 713 మంది అధ్యాపకులను రెన్యువల్‌ చేస్తున్నట్లు తెలిపింది.

*ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయించేందుకు ప్రభు త్వం తీసుకోచ్చిన సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆన్‌ టికెట్లు విక్ర య సంస్థ బుక్‌ మైషో, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలు, సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్ల యాజమాన్యా లు.. సవరణ చట్టం, జీవోలపై తమ అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ నిమిత్తం తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. ప్రభుత్వమే నేరుగా ఆన్‌లైన ద్వారా సినిమా టికెట్లు విక్రయించేందుకు గత ఏడాది తీసుకొచ్చిన సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ బిగ్‌ ట్రీ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ అన్నోజ్‌వాలా హైకోర్టును ఆశ్రయించారు. అలాగే, ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ చట్టం(12/2021) ద్వారా టికెట్ల విక్రయ ప్లాట్‌ఫామ్‌ను ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ గత ఏడాది డిసెంబరు 17న జారీ చేసిన జీవో 142ను సవాల్‌ చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండి యా ఫెడరేషన్‌ తరఫున మంజీత్‌ సింగ్‌, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

*పులివెందుల, కొత్తపేట రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటుపై తుది గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కడపలో పులివెందుల, కోనసీమ జిల్లాలో కొత్తపేట డివిజన్‌లను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 12న వీటి ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు.

*పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచే జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయాలని సమగ్ర శిక్ష జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 30 వరకు పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. రోజుకు 30 నుంచి 40 కిట్లు బయోమెట్రిక్‌ విధానంలో పంపిణీ చేయాలని ఆదేశించింది. కిట్ల నాణ్యతను ముందుగానే సరిచూసుకోవాలని, పాడైన, చిరిగిపోయిన కిట్లు అందితే ఆ వివరాలను పై అధికారులకు తెలపాలని పేర్కొంది.

*గంజాయి స్మగ్లర్‌ రెచ్చిపోయాడు. తన వద్ద డబ్బులు తీసుకుని గంజాయిని పంపించలేదనే కారణంగా గిరిజన వ్యక్తిని అపహరించి నిర్బంధించాడు. ఆయన కోసం వెళ్లిన కుటుంబాన్ని కూడా బంధించాడు. అయితే.. ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు గిరిజనులను రక్షించడంతోపాటు స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏఎస్పీ తుషార్‌ డుడి బుధవారం ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గూడెంకొత్తవీధి మండలానికి చెందిన పాంగి గోవర్థన్‌ 2020లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడి.. రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. ఈ సమయంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్‌ సుభాష్‌ అన్నా పవార్‌తో పరిచయం ఏర్పడింది. బెయిల్‌పై వచ్చిన గోవర్థన్‌ను 2021 డిసెంబరులో గొల్లొరి హరిబాబు సాయంతో స్మగ్లర్‌ పవార్‌ కలిశాడు.

*టీడీపీ అధినేత చంద్ర బాబు రాయలసీమ పర్యటన యథాతథంగా కొనసాగనుంది. జూలై 6న మదన పల్లెలో నిర్వహించనున్న ఆ జిల్లా మహానాడులో ఆయన పాల్గొంటారు. పీలేరులో అన్నమయ్య జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై 7న సమీక్ష నిర్వహిస్తారు. నగరి, జీడీ నెల్లూరుల్లో 8న రోడ్‌ షో నిర్వహిస్తారు. గుడివాడ, మదనపల్లెల్లో జిల్లా మహానాడుల నిర్వహణపై ఆ రెండు జిల్లాల నేతలతో బుధవారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గుడివాడలో బుధవారం కృష్ణా జిల్లా మహానాడు వర్షం కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. మదనపల్లె తర్వాతే గుడివాడలో మహానాడు నిర్వహించాలని నిర్ణయుంచారు.

* వల్లేటి రాజబాబు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌గా బుధవారం భాధ్యతలు స్వీకరించారు. ఐఎంజీ ప్రత్యేక అధికారిగా, ఏపీ అర్బన్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీగా భాధ ్యతలు నిర్వహించిన ఆయనను తాజాగా రవాణాశాఖ కమిషనర్‌గా బదిలీ చేయడంతో ఆయన ఎన్టీఆర్‌ పరిపాలనా భవనంలోని రవాణాశాఖ కార్యాలయంలో భాధ్యతలు చేపట్టారు.

* బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్‌ రావెళ్ల శ్రీనివాసరావు, సీనియర్‌ సంపాదకుడు కలిమిశ్రీకి గుంటూరుకు చెందిన బాపు-రమణ-బాలి కళాపీఠం పురస్కారాలను అందజేసింది. గుంటూరులో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను గ్రహీతలు అందుకున్నారు. పత్రిక నిర్వహణకు సంబంధించి కలిమిశ్రీకి ముళ్లపూడి పత్రికా సంపాదన పురస్కారాన్ని అందజేశారు. బాల సాహిత్య విభాగంలో రావెళ్ల శ్రీనివాసరావుకు ముళ్లపూడి బాలసాహితీ పురస్కారాన్ని అందజేశారు.

* టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై వైసీపీ మంత్రి అమర్నాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి మాట్లాడితే అయ్యన్నపాత్రుడి నాలుక చీరేస్తామని అమర్నాథ్‌ హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడు గ్రామాల్లోకి వస్తే కొట్టి పంపించండని అమర్నాథ్‌ పిలుపునిచ్చారు.
*ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌లను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ను ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కోరారు. సామాన్యులపై ఈ యాప్‌ల రికవరీ ఏజెంట్లు భరించలేని వేధింపులకు పాల్పడుతున్నారని, వారి వేధింపులతో అమాయకులు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.

*జులై 1న నగరానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి నేత తరుణ్ చుగ్‌ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల జరగనున్నాయి. సమావేశాలు సందర్భంగా జులై 2న ప్రధాని మోదీ వస్తున్నారని, జులై 3న భారీ బహిరంగ సభ జరగనున్నట్లు తరుణ్ చుగ్ తెలిపారు. సభకు 35వేల పోలింగ్ బూత్‌ల నుంచి కార్యకర్తలు హాజరుకానున్నరని చెప్పారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్కు టుంబం దోచుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ఓ వ్యక్తి పార్టీ కాదని తరుణ్ చుగ్‌ తెలిపారు.

*ఈనెల 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ అనంతరం ఆయన రాజ్ భవన్ కు చేరుకుంటారని, రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేస్తారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.ప్రధాని బస సందర్భంగా రాజ్‌భవన్‌లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్‌భవన్ మార్గాల్లో 4 వేల మంది పోలీసులతో పహారా నిర్వహిస్తున్నట్టు సీపీ ఆనంద్ వెల్లడించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో పహారా కాస్తారని చెప్పారు. ప్రధాని, సీఎంలు, కేంద్రమంత్రులు సభకు హాజరవుతున్న దృష్ట్యా ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు సీపీ ఆనంద్‌ వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను ఇంచార్జ్‌లుగా నియమించామన్నారు.

*తెలంగాణ రాష్ట్ర బిసి స్టడీ సర్కిల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 2న సివిల్ సర్వీసెస్ 2021విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 2వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఠాగూర్ ఆడిటోరియంలో 2021 సివిల్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందన్నారు.

* కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించడం ఖాయమని ఎమ్మెల్యే ఈటల రాజేందర్పే ర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల‌ తర్వాత కాంగ్రెస్ , టీఆర్ఎస్‌ లు ఫ్రెండ్లీ పార్టీలుగా మారతాయన్నారు. ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ టీఆర్‌ఎస్‌ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోందన్నారు. బీజేపీ(BJP) పండగకు.. కేసీఆర్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ లో చెల్లని కేసీఆర్ మొహం.. పక్క రాష్ట్రాల్లో చెల్లుతుందా? అని ఈటల ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతారా? అని నిలదీశారు. కేసీఆర్ దోపిడీ వల్లే రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని ఈటల విమర్శించారు.

*ఈ నెల 24న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. సాలార్జింగ్ మ్యూజియం లో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓల్డ్ సిటీ బోనాల కోసం రూ.70 కోట్లతో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. బోనాల పండగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా బోనాల ఉత్సవాల నిర్వహణకు తలసాని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలి, గొప్పగా పండుగలు జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి అభిమతమని తలసాని పేర్కొన్నారు.