Devotional

అరచేతిలో అందాల పంట

అరచేతిలో అందాల పంట

గోరింట పూచింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు.. గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు.. సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా.. అందాల చందమామ అతనే దిగి వస్తాడు అంటూ గోరింటాకు గొప్పతనాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ సినిమాలో అద్భుతంగా చెప్పారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆషాఢం, గోరింటాకు, మహిళలకు ఓ ప్రత్యేకమైన సంబంధం ఉంది.  ఆషాఢం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. 

ఆషాఢం గడిచేలోపు ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. జ్యేష్ట మాసంలో వర్షాలు మొదలై.. ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునే వారు, ఏరు దాటాల్సి వచ్చే వారు, ఈ కాలంలో కాళ్లు చేతులు తడవకుండా రోజులు దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం వంటి వాటి నుంచి ఈ గోరింటాకు కొన్ని రోజులు పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతుంది. ఆ సమయంలో గోరింట పెట్టుకోవడంతో ఎర్రగా పండుతుంది. అందుకే పూర్వం నుంచి ఆషాఢంలో గోరింట పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  

కొత్త పెళ్లికూతురికి సౌభాగ్యం ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింటాకు తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింటిలో ఉన్న వధువు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.  
కోన్లతో జాగ్రత్త ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారని చాలా మంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్‌లపై ఆధారపడుతుంటారు. గోరింట మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపురంగు కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. దీని వలన ఆరోగ్యం మాట అటు ఉంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాఢంలో ప్రకృతి సహజసిద్ధంగా లభించే గోరింటాకును వాడేందుకు ప్రాధాన్యమివ్వాలి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది  ఆషాఢం నాటికి వాతావరణం ఒక్క సారిగా చల్లబడుతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన కఫ సంబంధిత రోగాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లో వేడిన తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరిచి రోగాల బారిన పడకుండా చేస్తుంది. అన్ని విధాలా మేలు చేస్తుంది